Advertisement

Advertisement


Home > Politics - Analysis

మా కోడీ…మా కుంపటీ అను ‘విషపు పలుకులు’

మా కోడీ…మా కుంపటీ అను ‘విషపు పలుకులు’

వెనకటికి ఓ ముసిలమ్మ…తన కోడి కూస్తేనే జ‌నం నిద్రలేస్తున్నారు..తను కుంపటిలో నిప్పు రగిలిస్తేనే తెల్లారుతోంది అని అనుకుందట. ఏం చేస్తాం కొంత మంది అజ్ఞానం ఆ రేంజ్ లో వుంటుంది మరి. కేవలం అది అమాయకత్వమో, అజ్ఞానమో అయితే ఫరవాలేదు. అలా కాకుండా అదే నిజ‌మని, అదే అసలు సిసలు సత్యమని జ‌నాలను నమ్మించే ప్రయత్నం అహర్నిశలూ చేస్తుంటేనే వస్తుంది సమస్య. తమ దగ్గర బలమైన డప్పు వుందని, దానితో సదా అలా టముకు వేస్తూ వుంటే జ‌నాలు ఎప్పటికైనా నమ్ముతారు అని, ఎలాంటి విషం నిండిన విషయమైనా జ‌నాల బుర్రల్లోకి ఎక్కించేయవచ్చు అని భావిస్తూ వస్తోంది తెలుగునాట ఓ సెక్షన్ ఆఫ్ మీడియా. 

ఎంతో మందిని ముఖ్యమంత్రులను చేయగలిగినా, చేయలేకపోయినా, కొందరినైనా బదనామ్ చేయగలిగాము, పదవి నుంచి దింపగలిగాము అనే నమ్మకం బుర్ర నిండా పేరుకుపోయింది. అలాంటి టైమ్ లో వైఎస్ జ‌గన్ అనే కొరకరానికొయ్య ఎదురుపడింది. ఈ అడ్డంకిని తొలగించుకుంటే తప్ప ‘తమకు’ భవిష్యత్ వుండదనే భయం పట్టుకుంది. ఆ ‘తమకు’ అంటే తాము మాత్రమే అని అంటే జ‌నాలకు పట్టదు. అందుకే ‘తమకు’ అంటే ఆంధ్ర అంతటికీ అనేంత హడావుడి చేయడం మొదలు పెట్టారు. 2024 ఎన్నికలు ‘కొందరికి’ జీవన్మరణ సమస్యగా మారాయి. ఇక సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అక్కడితో సరిపోదు. ఆ యొక్క పరమేశ్వరుడు నోరు ఇచ్చాడు కనుక, నొటికి వచ్చింది మాట్లాడడమే.

ఇప్పుడు ఈ రాతలు ఏ మేరకు చేరాయి అంటే, ఇక జ‌గన్ అనేవాడిని ఇలా వదిలేస్తే ప్రపంచపటంలో ఆంధ్ర ప్రదేశ్ అన్నది వుండదు. ఆంధ్రలో జ‌నాల పిల్లలు, మనవులు, ఆ తరువాత తరాలు అడుక్కు తినాల్సిందే. నాశనం అయిపోవాల్సిందే..నానా భ్రష్టు పట్టిపోతారు. చూసుకొండి మీ ఇష్టం. ఈసారి జ‌గన్ ను గెలిపించారో, మాకేం ఫరావాలేదు. మీకే నష్టం..మీకే దరిద్రం..మీ పిల్లలే నాశనం అయిపోతారు...ఈ రేంజ్ లో రాతలు మొదలుపెట్టారు. ఇలా రాయడానికి లాజిక్ లు వుండవు. ఇలా రాయడానికి వివరణలు వుండవు. ఇలా టముకేయడానికి థీసిస్ లు వుండవు. ఒక్కటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఒక్కటే సింగిల్ రీజ‌న్…’తమకు’ ‘తమ’ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని గతంలో కవులు మాట్లాడుకునేవారు. అలాగ్గా ‘వీరి’ బాధ ఆంధ్ర జ‌నాల బాధగా మార్చినపుడే కదా? జ‌గన్ అనేవాడిని జ‌నం కుర్చీలోంచి లాగేస్తారు? అదే అజెండా. అంతకు మించి మరేం లేదు.

జ‌గన్ చేసిన తప్పేమిటి? చంద్రబాబు చేసిన ఒప్పేమిటి?

రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్, సైబరాబాద్ చంద్రబాబు ఆలోచనలు. జ‌గన్ ఇలాంటి ఆలోచనలు ఒక్కటన్నా చేసారా? సైబరాబాద్ కు మూలమైన హైటెక్ సిటీ మాజీ సిఎమ్ నేదురుమల్లి జ‌నార్ధనరెడ్డి బ్రెయిన్ చైల్డ్ అని ఒక్కసారి అన్నా రాశారా? నేదురుమల్లి జ‌నార్ధనరెడ్డి తొమ్మిది ప్రయివేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తెలుగునాట సాఫ్ట్ వేర్ విద్యకు అంకురార్పణ చేస్తే కోర్టుకు లాగింది ఎవరు? అడ్డుకున్నది ఎవరు? యాగీ చేసింది ఎవరు? ఆ తరువాత అధికారంలోకి వచ్చాక డజ‌న్ల కొద్దీ ప్రయివేటు కాలేజీలను ‘తమ’ వారితో పెట్టించి, తామే సాఫ్ట్ వేర్ రంగ పితామహుడు అని టముకేయించుకున్నది ఎవరు? సైబరాబాద్ నిర్మాణం వెనుక ‘తమ’వారి అభివృద్ది చీకటి కోణాన్ని ఎప్పటికీ అంగీకరించని మీడియా కాదా మీది అని ప్రశ్నిస్తే సమాధానం వస్తుందా?

అభివృద్ధి..సంక్షేమం జోడు గుర్రాల స్వారీ అంటున్నారు. చంద్రబాబు అదే చేసారు..జ‌గన్ అదే చేయలేదు అంటున్నారు. చంద్రబాబుకు ఎలా సాధ్యం? జ‌గన్ కు ఎలా సాధ్యం కాలేదు? ఓ ప్రయివేటు సంస్థకో, వ్యక్తులకో వందలాది ఎకరాలు ఫ్రీగా ఇస్తామని ఆశ చూపిస్తే అవి ఆంధ్రకు పరిగెత్తుకు వస్తే, అది ఎవరి అభివృద్ది అవుతుంది? రామ్ దేవ్ బాబా, జ‌గ్గీ వాసుదేవ్ లాంటి వారి సంస్థలకు ఫ్రీగా లేదా నామినల్ ధరలకు స్థలాలు ఇవ్వడం అవసరమా? హైదరాబాద్ ను చేసిన అభివృద్ది తనదే అంటున్న చంద్రబాబు అయిదేళ్లలో ఆంధ్రలో ఎందుకు చేయలేకపోయారు. హైదరాబాద్ భౌగోళిక స్వరూపం దానికి అడ్వాంటేజ్ అని, దాని అభివృద్దికి అదే కీలకం అని తెలుసుకోకపోవడం, తెలిసినా అలా చెప్పకుండా దాన్ని తీసుకువచ్చి చంద్రబాబు ఖాతాలో వేయడం ఎంత వరకు సబబు?

సికిందారాబాద్ జూబ్లీ బస్ట్ స్టేషన్, విజ‌యవాడ బస్ స్టేషన్, ఆంధ్రలో ప్రయివేట్ బస్సుల జాతీయకరణ, ఆర్టీసీ బస్ స్టేషన్ లు వందల సంఖ్యలో నిర్మాణం, ఇలా చాలా నిర్మాణాత్మక పనులు ఎన్టీఆర్ చేసారు. కానీ చంద్రబాబు ఇలాంటి వాటి జోలికి పోలేదు. ఎంతసేపూ భూముల పంపకం, అక్కడకు సంస్థలను రప్పించడం, భూముల ఆశ చూపించకుండా చంద్రబాబు రప్పించిన సంస్థలు ఎన్ని? హైటెక్ సిటీ చేతిలోకి తీసుకున్న ఎల్ అండ్ టి నే తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం చేసిందన్న దానిపై వున్న విమర్శలకు సమాధానం ఏది? హైటెక్ సిటీ చుట్టూ ‘తమవారికి’ మాత్రమే కీలక భూములు ఎలా దక్కాయి అన్న దానికి సమాధానం ఎక్కడ?

అమరావతికి భూములు ఇచ్చిన వారిలో ‘తమ వారి’కన్నా పైవారే ఎక్కువ అంటున్న వారు, ఆ అలైన్ మెంట్ కు సరిహద్దుల్లో వున్నవి, కొన్నవి అయిన భూములు ‘తమవారివే’ అని మాత్రం ఎందుకు చెప్పరు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. జ‌గన్ వల్ల ఆంధ్ర అల్ల కల్లోలం అయిపోయింది. ‘పలుకులు’వండి వారుస్తున్నవారు, ఒక్కసారి ఆంధ్రలోని పాఠశాలలు పరిశీలించడానికి వస్తారా? బడులు అన్నీ కొత్తగా మారుతున్న వైనం గమనించడానికి వస్తారా? అలాగే ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయో, లేదో చూడడానికి వస్తారా? మరి అవి అభివృధ్ది లెక్కల్లోకి రావా? పోర్టులు, ఎన్నో కొన్ని పరిశ్రమలు వస్తుంటే సింగిల్ కాలమ్ వార్తలు అయినా సదరు మీడియాలో రాయగలిగారా?

ప్రగతి లేదు అంటూ టముకేసే ఈ పత్రికలు, వున్న దాని గురించి నాలుగు వాక్యాలు అయినా ఎప్పుడన్నా రాశారా? చంద్రబాబు గెలవడం చంద్రబాబు కోసం కాదు, ఆంధ్ర కోసం అని బలంగా ప్రజ‌ల మనస్సుల్లో నాటడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తప్ప మరెవరు వున్నా రాష్ట్రం అధోగతే అంటున్నారు. మరి చంద్రబాబే దశాబ్దాలు, శతాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా వుండలేరు కదా? మరి అప్పటి పరిస్థితి ఏమిటి? ఆ కిరీటం తీసుకెళ్లి లోకేష్ కు పెడతారా? లోకేష్ నే ప్రగతి దిక్సూచి అని అప్పడు టముకేస్తారా?

అసలు జ‌గన్ చేసిన ఘోర అపరాధం ఏమిటి? అమరావతిని కదిలించడమేనా? విశాఖలో ‘తమవారి’ ఆటలు సాగనివ్వకపోవడమేనా? అమరావతిని అంగీకరించకపోతే అది అభివృద్ధికి విఘాతం..విశాఖలో దశాబ్దాలుగా ‘తమవారు’ సాగిస్తున్న అరాచకాలు అడ్డుకుంటే అది దోపిడీ…అంతేనా? ఈ ‘పలుకుల’ సారాంశం?

నిజంగా జ‌నాల్లో మార్పు వచ్చేసింది. జ‌నాలకు జ‌గన్ అంటే పీకల మేరకు కోపం వచ్చింది. జ‌నాలు ఎవరూ పిలవకుండానే చంద్రబాబు కోసం వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? జ‌గన్ ను కిందకు లాగి పడేద్దామా అని జ‌నం చూస్తున్నారు.

ఇవే కదా? నిత్యం పలికే పలుకులు. కాస్సేపు ఇవే నిజం అనుకుందాం. మరింక ఎందుకు ఈ తాపత్రయం. నిత్యం అవే రాతలు. నిత్యం అదే గోల..మరోపక్క భాజ‌పాను దారిలోకి తెచ్చుకోవాలనే తపన. జ‌నసేన అండ సంపాదించాలనే బాధ. ఇక ఇవన్నీ ఎందుకు? జ‌గన్ రాక్షసుడు అని జ‌నానికి తెలిసిపోయింది అనే కదా మీ ‘పలుకుల’సారాంశం. అలా తెలిసి పోయినా కూడా ‘మీవారి’ బలం సరిపోవడం లేదా? ఇలా నిత్యం ‘విషపు పలుకులు’ పలకాల్సిందేనా?

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా