అయ్యన్న ‘ఉడత’ అన్నది పవన్ కల్యాణ్‌నేనా?

మాజీ మంత్రి, బూతులు మాట్లాడడంలో సిద్ధహస్తుడు, దూషణల కేసుల దగ్గరినుంచి ఫోర్జరీ కేసుల వరకు తన మీద ఎన్ని కేసులు నమోదు అవుతున్నా.. కోర్టు రక్షణతో తప్పించుకు తిరగగల సమర్థుడు అయ్యన్నపాత్రుడు.. తాజాగా హద్దులు…

మాజీ మంత్రి, బూతులు మాట్లాడడంలో సిద్ధహస్తుడు, దూషణల కేసుల దగ్గరినుంచి ఫోర్జరీ కేసుల వరకు తన మీద ఎన్ని కేసులు నమోదు అవుతున్నా.. కోర్టు రక్షణతో తప్పించుకు తిరగగల సమర్థుడు అయ్యన్నపాత్రుడు.. తాజాగా హద్దులు మీరిన చంద్రభజన చేస్తున్నారు. ఈ వయసులో చంద్రభజన వలన కొత్తగా ఎలాంటి లాభాలు ఉంటాయని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు గానీ.. చంద్రబాబునాయుడును.. దేవుడు అయిన శ్రీరామచంద్రుడితో పోల్చి మాట్లాడుతున్నారు. రాముడిలాగా చంద్రబాబుకూడా రావణ సంహారం చేయాలంటున్నారు.

అయితే ఈ భజన మొత్తం సొంత బలం మీద, సొంత ప్రజాదరణ మీద నమ్మకం లేక.. పవన్ కల్యాణ్ ఆసరా తీసుకోవాలని అనుకుంటుండడాన్ని సమర్థించుకోవడానికి! చంద్రబాబునాయుడుకు తాను ఒంటరిగా పోటీచేస్తే నెగ్గుతాననే నమ్మకం లేదు. ఓటమి భయం ఇంకా వెన్నాడుతోంది. పవన్ కల్యాణ్ ఆసరాగా చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారు. పవన్ ను కాకా పడుతున్నారు. రెండేళ్లుగా తన వన్ సైడ్ లవ్ ను చాన్స్ వచ్చినప్పుడెల్లా ప్రకటిస్తూనే ఉన్నారు. 

పవన్ కల్యాణ్ తనను, తన కొడుకును గతంలో నానా చెత్త మాటలు అన్నప్పటికి కూడా.. ఎన్నడూ చంద్రబాబు సీరియస్ గా రెస్పాండ్ కాలేదు. ఇప్పటికీ పవన్ పొత్తులేకుండా మనుగడ అసాధ్యం అనేభయంలో ఉన్నారు. అయితే.. ఈ పొత్తులను, ఆ ప్రయత్నాలను సమర్థించడానికి అయ్యన్నపాత్రుడు కొత్త వాదన తెచ్చారు. అదేంటంటే..

‘‘శ్రీరామచంద్రుడు దేవుడు.. ఆయన ఒక్కడే వెళ్లి ఒక బాణం వేస్తే రావణుడు చచ్చిపోడా? అయినా లోక కల్యాణం కోసమే ఆంజనేయుడు, విభీషణుడు, ఉడత.. ఇలా అందరి సాయం తీసుకున్నాడు.. అలా రాష్ట్ర కల్యాణం కోసం.. చంద్రబాబునాయుడు అందరి సాయం తీసుకునే ప్రయత్నం చేయాలి..’’ అంటూ అయ్యన్న సెలవిచ్చారు. 

ఇవన్నీ ఉబుసుపోని, ఆయనలోని అజ్ఞానాన్ని ప్రదర్శించే మాటలే. ఎందుకంటే.. శ్రీరాముడును ఆయన వ్యక్తిత్వ లక్షణాల వల్ల మనం దేవుడుగా కొలుస్తున్నాం. కానీ.. ఆయన జీవించిన కాలంలో.. దేవుడుగా మహిమలు ప్రదర్శించలేదు. సామాన్య మానవుడిలాగానే బతికాడు. అందుకే ఒక్కడే వెళ్లి ఒక బాణం వేయడం కాదు కదా.. కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి, లంక గుట్టు ఎక్కడున్నదో విభీషణుడు చెప్పిన తర్వాత గానీ రావణాసురుడిని చంపలేకపోయాడు. అదంతా ఒక ఎత్తు.. అయితే ఇప్పుడు అందరి సాయం తీసుకోవాలని అంటున్నారు.

అయ్యన్న మాటల ప్రకారం చంద్రబాబునాయుడు శ్రీరామచంద్రుడు అయితే.. ఇంతగా రామభజన చేస్తున్న హనుమంతుడు అయ్యన్నపాత్రుడే అవుతారు. జగన్ పార్టీ నుంచి కోవర్టులను వీరు ఎవరినైనా కాంట్రాక్టు మాట్లాడుకుంటే.. సదరు కోవర్టు విభీషణుడు అవుతారు! మరి ఉడత ఎవరు? ఇంకెవరు.. అయ్యన్న దృష్టిలో ఉడత అంటే.. పవన్ కల్యాణే అని జనం నవ్వుకుంటున్నారు. 

తనకు పెద్దగా బలం లేకపోయినా.. తాను చేయగలిగింది ఏమీ లేకపోయినా.. ఉడత పాపం రాముడికి సాయం చేయాలని చాలా ఆరాటపడింది. పవన్ కల్యాణ్ కూడా అదే మాదిరిగా.. తనకు పెద్దగా ప్రజాబలం లేకపోయినా.. చంద్రబాబును గెలిపించాలని ఆరాటపడుతున్నాడు..! అయ్యన్న పోలికల్లో ఉడత పాత్ర మాత్రం పవన్ కల్యాణ్ కు చక్కగా సరిపోయిందని పలువురు విశ్లేషిస్తున్నారు.