ఒకే ఒక్క వైఎస్ జగన్‌ను ఎదుర్కోడానికి చంద్రబాబు ఎన్నెన్నో తిప్పలు పడాల్సి వస్తోంది. అది కూడా రాజకీయ చరమాంకంలో కావడం గమనార్హం. తన రాజకీయ అనుభవమంత వయసున్న యువకుడు, మిత్రుడి కుమారుడితో రాజకీయ యుద్ధం చేయాల్సి వస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరు. గొప్ప వ్యూహకర్తగా ఇంత కాలం చంద్రబాబు గురించి ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. జనం కూడా నిజమే కాబోలు అని నమ్ముతూ వచ్చారు.
అయితే జగన్‌ను చూసిన తర్వాత… అరె చంద్రబాబు తేలిపోతున్నారే అని మాట్లాడుకోవడం మొదలైంది. జగన్‌తో పోల్చుకుంటే చంద్రబాబు చిన్న గీత అయ్యారు. జగన్ మాత్రం వ్యూహాల్లో పెద్ద గీత అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో బలమైన ప్రత్యర్థి జగన్‌ను ఎదుర్కోడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ‘ఇదేం ఖర్మ..’ అనే ప్రోగ్రాం చేయడానికి నిర్ణయించారు.
ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 52 లక్షల కుటుంబాలను, రెండుకోట్ల మంది ప్రజలను కలవాలనేది ప్రణాళిక. జనం దగ్గరికి వెళ్లాలనుకోవడం మంచి నిర్ణయం. అయితే తనకు, టీడీపీకి పట్టిన ఖర్మ ఏంటో చంద్రబాబు గుర్తించినట్టు లేరు. అసలు రోగం ఏంటో తెలుసుకోకుండా, మందు వేయాలని అనుకున్నట్టుగా చంద్రబాబు తీరు వుంది.
టీడీపీకి నారా లోకేశ్ వారసుడు కావడం చంద్రబాబు చేసుకున్న ఖర్మ. ఇదే సూత్రం వ్యక్తిగతంగా ఆయనకు కూడా వర్తిస్తుంది. కేవలం చంద్రబాబునాయుడు తనయుడనే అర్హత తప్ప, మిగిలిన అంశాల్లో లోకేశ్‌కు అంత సీన్ లేదని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. ప్రజల ఆదరణ దేవుడెరుగు, కనీసం సొంత పార్టీ ఆమోదం కూడా లేని లోకేశ్ నాయకత్వాన్ని బలవంతంగా రుద్దడంతో తమ ఖర్మ అని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. అలాగని లోకేశే భావి నాయకుడిగా ప్రకటించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవు.
జనవరి 27న లోకేశ్‌తో పాదయాత్ర ప్రారంభించడం ద్వారా… అతనే భావి నాయకుడనే సంకేతాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మీ పిల్లలు, మీ భవిష్యత్ కోసం టీడీపీ అధికారంలోకి రావాలని పదేపదే చెబుతున్న చంద్రబాబు… మరి పార్టీ కోసం ఏం చేశారో చెప్పగలరా? టీడీపీకి సరైన నాయకుడిని ఇంత వరకూ ఎందుకు తయారు చేయలేకపోయారు. దీనికి అధికారం అవసరం లేదు కదా? ప్రతిపక్షంలో వున్నా టీడీపీని బలమైన పార్టీగా తీర్చిదిద్దలేకపోవడానికి చంద్రబాబు కారణం కాదా?
బాబుతోనే టీడీపీ అంతమవుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న మాట నిజం కాదా? ఇది చంద్రబాబు ఫెయిల్యూర్ కాదా? కనీసం తన పార్టీకే ఒక సమర్థుడైన నాయకుడిని తయారు చేయలేదని చంద్రబాబు … రాష్ట్రానికి తాను లేకపోతే దిక్కు లేదనడం అతిశయోక్తి అనిపించుకోదా? టీడీపీకి, చంద్రబాబుకు లోకేశ్ ఖర్మ అనుకుంటే, రాష్ట్రానికి బాబు నాయకత్వం కూడా అదే అవుతుందనే విమర్శను కొట్టి పారేయలేం.
ఎందుకంటే సొంత పార్టీని చక్కదిద్దుకోలేని నాయకుడు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటే నమ్మేదెట్టా? జగన్‌ను వద్దనుకున్నా… 14 ఏళ్ల చంద్రబాబు పాలన చూసిన తర్వాత కూడా… ఆయనే కావాలని ఎవరైనా కోరుకుంటారా?