టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు కీలక సూచనలు చూశారు. ముఖ్యంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన సూచన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సందర్భంలో ఓ కొత్త ప్రశ్న, సంశయం టీడీపీ శ్రేణుల్లో పుట్టుకొచ్చింది. అయ్యన్నపాత్రుడు ఏమన్నారంటే…
‘టీడీపీ అభ్యర్థులను ముందే నిర్ణయించాలి. సరిగా పని చేయని వారికి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పాలి. ఒకవేళ అయ్యన్నపాత్రుడు ఈ ఎన్నికల్లో గెలవలేడని అనుకంటే టికెట్ ఇవ్వొద్దు’ అని అన్నారు. తనతో సహా క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితి లేకపోతే టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు నేరుగానే అయ్యన్న చెప్పారు.
ఈ నేపథ్యంలో గెలిచే వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాల్సి వస్తే… లోకేశ్ పరిస్థితి ఏంటనేది చర్చకు వచ్చింది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోవడాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఈ దఫా కూడా ఆయన అక్కడే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే మంగళగిరిలో రాజకీయ పరిస్థితులు టీడీపీకి మరింత వ్యతిరేకంగా మారాయి.
ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో బీసీలు గెలుపోటములను శాసిస్తారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ వెన్నముఖ విరిగినట్టైంది. మంగళగిరి మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఆళ్ల జనం నాయకుడనే పేరు వుంది. నిత్యం వాళ్లతోనే ఆయన వుంటున్నారు.
లోకేశ్‌కు పరిస్థితులు అనుకూలించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు గెలవడానికా లేక ఓడిపోవడానికి టికెట్ ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.