మోడీ, కేసీఆర్ స‌ర్కార్ల మ‌ధ్య క‌రోనా చిచ్చు

కేంద్ర ప్ర‌భుత్వానికి, తెలంగాణ స‌ర్కార్‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. త‌మ‌ను బ‌ద్నాం చేయ‌డానికి కేంద్రం ప‌నిగ‌ట్టుకుని విష ప్ర‌చారం చేస్తోంద‌ని తెలంగాణ స‌ర్కార్ భావిస్తోంది. తాజాగా మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. కేసీఆర్‌, మోడీ…

కేంద్ర ప్ర‌భుత్వానికి, తెలంగాణ స‌ర్కార్‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. త‌మ‌ను బ‌ద్నాం చేయ‌డానికి కేంద్రం ప‌నిగ‌ట్టుకుని విష ప్ర‌చారం చేస్తోంద‌ని తెలంగాణ స‌ర్కార్ భావిస్తోంది. తాజాగా మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. కేసీఆర్‌, మోడీ స‌ర్కార్ల మ‌ధ్య ఎడ‌బాటు తీవ్ర‌మ‌వుతున్నద‌నేందుకు తాజా ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)  కేంద్ర ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే వార్తా సంస్థ. రాష్ట్రాల‌కు ఎలాగైతే స‌మాచార‌శాఖ ఉంటుం దో, కేంద్రం స్థాయిలో పీఐబీ అనేది ఒక‌టి ఉంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్త సమాచారాన్ని వార్తా సంస్థ లకు, ప్రజలకు అందిస్తూ ఉంటుంది.

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న నేప‌థ్యంలో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) కీల‌కంగా వ్య‌వ‌హ రిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బులెటిన్‌ విడుదల చేస్తోంది.  

అయితే స‌ద‌రు కేంద్ర వార్తా సంస్థ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన బులెటిన్ తెలంగాణ‌కు తీవ్ర కోపాన్ని తెప్పించింది. త‌మ‌ను కావాల‌నే కించ‌ప‌రిచేలా కేంద్ర వార్తా సంస్థ క‌ఠిన ప‌దాల‌ను ప్ర‌యోగించింద‌ని తెలంగాణ స‌ర్కార్ మండిప‌డుతోంది. త‌మ‌పై విషం చిమ్మార‌ని అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.

ఈ బులెటిన్‌లో ఒక్క తెలంగాణ మిన‌హాయించి మిగిలిన రాష్ట్రాల్లో క‌రోనా గ‌ణాంకాల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని తెలంగాణ అధికారులు ప్ర‌స్తావిస్తున్నారు.  

‘భారీ ఎత్తున కరోనా టెస్టులను చేయనందుకు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. దీనిపై సంజాయిషీ ఇచ్చేందుకు రావాల్సిందిగా ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశించింది. తెలంగాణ చాలా ఆలస్యంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను మొదలుపెట్టింది. అందులో కూడా అది ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం లేదు. యాంటిజెన్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చినవారు .. ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని ఐసీఎమ్మార్‌ సూచించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా లక్షణాలున్నవారిని మళ్లీ టెస్టుకు పంపకుండా, ఐసొలేషన్‌కు పంపాలని నిర్ణయించింది’ అని పీఐబీ తన బులెటిన్‌లో పేర్కొంది.

తెలంగాణ అధికారుల అభ్యంత‌రం ఏంటంటే పీఐబీ రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌డంపైనే. ఏఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి? ఎంత మంది మృత్యువాత ప‌డ్డారు? ఎంత మంది కోలుకున్నారు…త‌దిత‌ర వివ‌రాలు అంద‌జేసే వ‌ర‌కే ప‌రిమితం కావాల్సిన కేంద్ర వార్తా సంస్థ‌….త‌న ప‌రిధులు దాటి వ్య‌వ‌హ‌రించింద‌ని తెలంగాణ అధికారులు మండిప‌డుతున్నారు.

తెలంగాణ అధికారుల‌తో పాటు టీఆర్ఎస్ నాయ‌కులు పీఐబీ బులెటిన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ నేత‌లు కొన్ని రోజులుగా చేస్తున్న విమ‌ర్శ‌ల‌నే పీఐబీ బులెటిన్‌లో ప్ర‌స్తావించార‌ని ఆరోపిస్తున్నారు. పీఐబీ అంటే కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌నా లేక భార‌తీయ జ‌న‌తా పార్టీ జేబు సంస్థ‌నా అనే అనుమానాలు కలుగుతున్నాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర‌లో భాగ‌మే ఈ ప్ర‌క‌ట‌న అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంద‌ని విమ‌ర్శి స్తున్నారు.

కాగా  పీఐబీ బులెటిన్‌లో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. పీఐబీ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక