ఒకవైపు ఇంకా డీజిల్ వెహికల్స్ నే భారీ ఎత్తున తయారు చేస్తున్నారు ఇండియాలో. డీజిల్ తో నడిచే బస్సులు, కార్లు భారీ ఎత్తున మార్కెట్లోకి, ఆ పై రోడ్లపైకి వస్తున్నాయి. ఇక పెట్రో ఉపఉత్పదనల్లో డీజిల్ కన్నా కాస్త మెరుగైన ఉత్పత్తి పెట్రోల్.
పెట్రో ఉత్పత్తుల్లో వాహనాలకు ఇంధనంగా వాడేవన్నీ కాలుష్యానికి కారణం అనేది తరచూ వినిపించే మాటే. ఈ విషయంలో డీజిల్ కన్నా మెరుగైన ర్యాంకులో ఉంటుంది పెట్రోల్. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ వల్ల ఎక్కువ కాలుష్యం సంభవిస్తుందంటారు. అందుకే క్రమంగా డీజిల్ తో నడిచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే డిమాండ్ ఉంది.
అయితే అది డిమాండ్ మాత్రమే. ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం లేదు. లక్షల రూపాయలు పెట్టి విలాసవంతమైన కార్లను కొనే కొంతమంది కూడా డీజిల్ వెర్షన్లనే కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన కార్లను అయినా ముందుగా డీజిల్ నుంచి పెట్రోల్ వెర్షన్ లలో మాత్రమే అందుబాటులో ఉంచాలనే నియమం కూడా ఇంకా ఏదీ లేకుండా పోయింది.
ఆ సంగతలా ఉంటే.. దేశంలో వీలైనంత త్వరగా పెట్రోల్ తో నడిచే బైకుల ఉత్పత్తిని, మార్కెట్, వినియోగాన్ని తగ్గించి వేయాలని అంటోంది హీరో ఎలక్ట్రిక్.ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ మాట్లాడుతూ.. 2027 కళ్లా దేశంలో పెట్రో స్కూటర్లు, బైక్ ల వినియోగాన్ని ఆపివేయాలని అంటున్నారు. అంతా ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఇ-బైక్ ల వల్ల కాలుష్యం తగ్గుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకో ప్రజలు వాటి వైపు పూర్తి స్థాయిలో మల్లడం లేదు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ తరుణంలో అయినా ప్రజలు కరెంట్ బ్యాటరీలో నడిచే బైక్ ల వైపు మొగ్గే అవకాశాలున్నాయి. అది వీలైనంత త్వరగా జరగాలని.. 2027 కళ్లా దేశంలో బైకులన్నీ ఇ-బైక్ లు అయిపోవాలని హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆకాంక్షిస్తోంది. మరి పెట్రోల్ బైకుల ఉత్పాదనను కూడా అలాంటి సంస్థలు ఆపాల్సి ఉంది. ఇదంతా అంత తేలికగా జరిగే పనేనా?