మనసొకచోట…మనిషొక చోట!

జనసేనాని పవన్‌కల్యాణ్‌ రాజకీయంగా అన్యమనస్కంగా ఉన్నట్టు స‌మాచారం. రాజకీయంగా తనకిష్టమైన చోట కాకుండా, మరో పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాన‌నే ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనసును కష్టపెడుతూ ఎంతో కాలం రాజకీయాలు…

జనసేనాని పవన్‌కల్యాణ్‌ రాజకీయంగా అన్యమనస్కంగా ఉన్నట్టు స‌మాచారం. రాజకీయంగా తనకిష్టమైన చోట కాకుండా, మరో పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాన‌నే ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనసును కష్టపెడుతూ ఎంతో కాలం రాజకీయాలు చేయడం ఇబ్బంద‌నే ఆలోచనతో ఆయన ఉన్నారని సమాచారం. 

ఇందులో భాగంగా అధికారికంగా బీజేపీతో తనకు తానుగా పొత్తు తెగదెంపులు చేసుకోకుండా, ఆ పార్టీనే దూరమయ్యేలా వ్యూహరచన చేశారని సమాచారం. ఈ క్రమంలో వచ్చే నెలలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . 
గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ పోటీచేసి ఓడిపోయినా గాజువాక నియోజకవర్గ పరిధిలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఉంది. దీన్ని వందశాతం ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

బీజేపీతో పొత్తు ఉండడం వల్ల విశాఖ స్టీల్‌ పరిశ్రమ ప్రైవేటీకరణను జనసేనాని అధికారికంగా గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి. అలాగని ప్రజావ్యతిరేక విధానాలను మౌనంతో అంగీకరించలేక పవన్‌ సతమతం అవుతున్నారని సమాచారం. దీంతో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రుల సెంట్‌మెంట్‌ అయిన విశాఖ ఉక్కును కాపాడుకునేందుకే పవన్‌ మొగ్గు చూపుతున్నారని సమాచారం.

బీజేపీతో జనసేనాని విడిపోవాలని టీడీపీ కోరుకుంటోంది. ఒకవేళ బీజేపీతో జనసేన దూరమైతే అత్యధిక లబ్ధి టీడీపీకే. టీడీపీ, జనసేన క‌లిస్తే రెండు పార్టీలకూ లాభమే. అయితే ఇదంతా ఆచరణలోకి రావడం ఎంత వరకూ సాధ్యమనే ప్రశ్నలు బీజేపీ వైపు నుంచి వస్తున్నాయి.

ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేనాని పోరాటానికి శ్రీకారం చుడితే మాత్రం భవిష్యత్‌ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .