ముద్రగడ పద్మనాభం తాను కాపు ఉద్యమాన్ని ఇక చాలిస్తున్నట్టు ఓ బహిరంగ లేఖ రాసి సంచలనం రేపారు. సంచలనం రేపారు అనే కంటే చేతులు దులుపుకున్నారు అనడం కరెక్ట్. ఎందుకంటే ఆయన చెబుతున్న రీజన్స్ అలా ఉన్నాయి మరి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో కొంతమంది తనను బూతులు తిడుతున్నారని, తనపై అసహ్యంగా మెసేజ్ లు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విమర్శలు తాను భరించలేనని, కాపు ఉద్యమం పేరుతో తాను పదవులు, డబ్బు ఆశించడంలేదని స్పష్టం చేస్తూ ఇక ఉద్యమానికి సారథిగా వ్యవహరించబోనని తేల్చి చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఇంట్లోనే ఖైదు చేసినా, తనతోపాటు, కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ కి నడిపించినా.. జంకకుండా ధైర్యంగా పోరాడిన పద్మనాభమేనా ఇప్పుడు తనవల్ల కాదంటోంది? ఇన్నాళ్లూ తమ జాతికి అండగా ఉంటాడని కాపులంతా నాయకుడిగా కొలిచిన మాజీ మంత్రేనా నేను విమర్శలను ఎదుర్కోలేనని చెతులెత్తేసింది? అప్పుడున్న ధైర్యం ఇప్పుడెక్కడికి పోయింది?
ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతోనే ముద్రగడపై ఒత్తిడి పెరిగిందనేమాట మాత్రం వాస్తవం. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లిస్తామంటూ హామీ ఇవ్వడం వల్లే టీడీపీ హయాంలో ముద్రగడ రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టే.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన నోరెత్తలేదు. ఈలోగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి కాపు కమ్యూనిటీ కూడా ఊహించని రీతిలో మహిళలకు కాపునేస్తం నిధులు జగన్ ప్రభుత్వం అందించే సరికి ఒక్కసారిగా పవన్ కల్యాణ్ లో ఉక్రోషం పొంగుకొచ్చింది. కాపులకు వైసీపీ మేలు చేస్తే.. ఇక తనకు విలువ ఉండదనే ఉద్దేశంతోటే పవన్ లోపలి మనిషి బైటకొచ్చారు. కాపు రిజర్వేషన్లు తేల్చాల్సిందేనంటూ పట్టుబట్టారు.
దీంతో మరోసారి ముద్రగడపై ఒత్తిడి పెరిగింది. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన నాయకుడు ముద్రగడే కాబట్టి ఆయన్ని కూడా టార్గెట్ చేశారు చాలామంది. టీడీపీ హయాంలో ఒంటికాలిపై లేసే ముద్రగడకు.. వైసీపీ వచ్చాక రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయా అంటూ నీఛమైన పోస్ట్ లు పెట్టారు, ఉద్యమాన్ని అమ్ముకున్నాడంటూ మానసికంగా వేధించసాగారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు ముద్రగడ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లనైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి ఉన్నత వర్గాల కోసం 5శాతం రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం.. విధివిధానాల విషయంలో ఎటూ తేల్చకపోవడంతో ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో అవి అమలుకు నోచుకోలేదు. దీంట్లో వైసీపీ తప్పులేదని ముద్రగడకి కూడా తెలుసు. అయితే తనపై ఒత్తిడి పెరగడం వల్లే ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు కానీ, కాపుల కోసం 4770కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ ను ఆక్షేపించాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రం లేదు.
తీరా ఇప్పుడు ముద్రగడ కాపులకు రాసిన బహిరంగ లేఖలో కూడా ఎవరో ఆయనను టార్గెట్ చేశారనే విషయం స్పష్టమైంది. అది జనసైనికులే అని ఆయన బహిరంగంగా చెప్పకపోయినా.. అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో జనసేనకు ముద్రగడ బహిరంగ మద్దతు ఇవ్వలేదని వారంతా గుర్రుగా ఉన్నారు. కనీసం పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో అయినా.. కులపు ఓట్లు సమీకరించడంలో విఫలమయ్యామని, ముద్రగడ కూడా దీనికి కారణం అని అనుకుంటున్నారు.
అందుకే కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడ స్థానంలో జనసేనానిని కూర్చోబెట్టాలని వారి ఆలోచన. దానికి తగ్గట్టే ఇటీవల పవన్.. కాపులపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. ఇదంతా ముద్రగడపై సోషల్ మీడియాలో ద్వేషంగా మారుతోంది. ఈ విద్వేషాల వల్లే ఆయన హర్ట్ అయ్యారని తెలుస్తోంది. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ తెలిసో.. తెలియకో.. ముద్రగడను ఉద్యమం నుంచి పక్కకు తప్పించేశారు. ఇక జనసేనాని ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తారో లేక, ఇంకెవరైనా కాపు నాయకుడు తెరపైకి వస్తారో వేచి చూడాలి.