పిల్లల్ని కనడానికి మహిళు అనాసక్తి చూపుతున్నారు. దీంతో ప్రపంచ జనాభా అనూహ్యంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ శతాబ్దం చివరికి చాలా దేశాల్లో జనాభా సగానికి సగం తగ్గబోతున్నట్టు అంచనా. స్పెయిన్, జపాన్‌తో పాటు 23 దేశాల్లో 2100వ సంవత్సరం నాటికి కేవలం సగం జనాభా మాత్రమే మిగలనుంది. కొత్తగా పిల్లలను కనే పరిస్థితి లేకపోవడంతో 80 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య బాగా పెరగనున్నట్టు పలు పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. వాషింగ్లన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ వర్సిటీ పరిశోధనలో ఆందోళన, ఆసక్తి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.
పరిశోధకుల లెక్కల ప్రకారం 2064 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుతుంది. ఆ తర్వాత మరో 36 ఏళ్లకు అంటే శతాబ్దం చివరి నాటికి ఈ జనాభా అనూహ్యంగా 880 కోట్లకు పడిపోతుందనే పరిశోధకుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి కారణాలను కూడా పరిశోధకులు తెలిపారు. మహిళలు కేవలం తాము పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా మిగిలిపోవడానికి సిద్ధం లేరన్నారు.
మెజార్టీ మహిళలు చదువు, ఉద్యోగం మీద దృష్టి పెట్టడం వల్ల 21 ఏళ్లలో పెళ్లి చేసుకునేందుకు అయిష్టత చూపుతున్నారని తేలింది. దీంతో సంతానోత్పత్తి తగ్గనున్నట్టు పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా జపాన్, ఇటలీ, స్పెయిన్, థాయిలాండ్, పోర్చుగల్ దేశాల్లో భారీగా జనాభా తగ్గనున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే మన దేశం మాత్రం జనాభాలో మొదటి స్థానాన్ని ఆక్రమించనున్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జనాభాలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న విషయం తెలిసిందే.