వేరుకుంప‌టి పెడ‌తాడా? ఉండే ముంచుతాడా?

పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ నెక్ట్స్ స్టెప్ ఏమిట‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. అధిష్టానం ఆదేశాల మేర‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అమ‌రీంద‌ర్ ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిణామాల‌పై ఆచితూచి స్పందిస్తూ ఉన్నార‌ని…

పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ నెక్ట్స్ స్టెప్ ఏమిట‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. అధిష్టానం ఆదేశాల మేర‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అమ‌రీంద‌ర్ ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిణామాల‌పై ఆచితూచి స్పందిస్తూ ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ముందుగా కొత్త ముఖ్య‌మంత్రి చ‌న్నీకి శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు అమ‌రీంద‌ర్. త‌న స్థానంలో పీఠ‌మెక్కిన చ‌న్నీపై తీవ్ర‌స్థాయిలో ఆయ‌న విరుచుకుప‌డ‌లేదు. చ‌న్నీ స‌రిహ‌ద్దుల‌ను కాపాడుతాడ‌న్నాడు. అయితే ఇదే చ‌న్నీ గ‌తంలో అమ‌రీంద‌ర్ కేబినెట్లో మంత్రిగా అస‌మ్మ‌తి వాదిగా పేరును క‌లిగి ఉండేవారు. 

కానీ అమ‌రీంద‌ర్ కు అంతో ఇంతో ఊర‌ట ఏమిటంటే ఆయ‌న‌ను దించేసి సిద్ధూను సీఎంగా చేయ‌లేదు అధిష్టానం. త‌న స్థానంలో సిద్ధూను కూర్చోబెట్టి ఉంటే అమ‌రీంద‌ర్ ఈ పాటికి వేరు కుంప‌టి పెట్ట‌డం ఖ‌రారు అయ్యేది. అయితే.. అధిష్టానం కూడా వ్యూహాత్మ‌కంగా చ‌న్నీని సీఎంగా చేసింది. అలా అమ‌రీంద‌ర్ ముందుకు వెళ్ల‌కుండా బంధ‌మేసింది.

అయితే అమ‌రీందర్ కాంగ్రెస్ ఫ‌స్ట్ ఫ్యామిలీపై కూడా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాడు ఇప్ప‌టికే. ప్రియాంక‌, రాహుల్ లు అనుభ‌వం లేని వార‌ని తేల్చేశారు. అయితే డైరెక్టుగా సోనియాను ఇంకా విమ‌ర్శించ‌లేదు. ఇక అస‌లే పంజాబ్ లో ముక్కుతూ మూలుగుతూ ఉన్న బీజేపీ అమ‌రీంద‌ర్ కు గాలం వేసుకోవ‌చ్చునేమో! కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో పంజాబ్ లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటూ ఉంది బీజేపీ. 

ఆ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను అమ‌రీంద‌ర్ కూడా విమ‌ర్శించారు బోలెడ‌న్ని సార్లు. అలాంటిది ఇప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పోయింద‌ని ఆయ‌న డైరెక్టుగా బీజేపీ తీర్థం పుచ్చుకోలేరు. ఒక‌వేళ అలా చేస్తే అమ‌రీంద‌ర్ సొంతంగా క‌లిగి ఉన్న ఛ‌రిష్మా కూడా పోయే అవ‌కాశాలుంటాయి. 

అందుకే ఆయ‌న అటు వైపు వేగంగా క‌ద‌ల్లేని ప‌రిస్థితి. ఇక సొంతంగా పార్టీ పెట్ట‌డ‌మే అమ‌రీంద‌ర్ కు ముందున్న పెద్ద ప‌రిష్కారం. ఈ విష‌యంలో మాత్రం ఆయ‌న ఉత్సాహంగానే క‌నిపిస్తున్నారు. 80 యేళ్ల వ‌య‌సులో 40 యేళ్ల‌లానూ ఉండ‌వ‌చ్చు, 40 యేళ్ల వ‌య‌సులోనూ 80ల‌లో బ‌తికిన‌ట్టుగానూ బ‌త‌కొచ్చు.. అనే మాట‌తో అమ‌రీంద‌ర్ త‌న దృక్ప‌థాన్ని చాటుకున్న‌ట్టుగా ఉన్నారు. 

మ‌రి ఇలా త‌గ్గేది లేదంటున్న అమ‌రీంద‌ర్ సొంత కుంప‌టి పెడ‌తారా, కాంగ్రెస్ లోనే ఉండి ఆ పార్టీ పుట్టిని పంజాబ్ లో ముంచుతారా? అనేవి శేష ప్ర‌శ్న‌లు.