కరోనా సాయం విషయంలో కేంద్రం ఎంత ఉదారంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. కరోనా తొలి విడత తరువాత ప్రకటించిన ప్యాకేజీ ఎంత అపహాస్యం పాలయిందో కూడా తెలిసిందే.
ఉత్తరోత్తరా ఇక కేంద్రం నుంచి సహాయం అన్నదే ఆలోచనల్లోంచి తప్పకుంది. రాష్ట్రాలు అడిగినా కూడా కేంద్రం అప్పులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందే తప్ప సహాయం కాదు.
ఇలాంటి నేపథ్యంలో కరోనా మృతులకు సాయం చేసే విషయంలో సుప్రీం కోర్టు దగ్గర కేంద్రానికి తరచు ఇబ్బంది ఎదురవుతూ వచ్చింది. సాయం చేయకపోతే కోర్టు ఒప్పుకోదు.
సాయం చేయడానికి మనసు రాదు. ఇది చాలా కొన్ని నెలలుగా అలా సాగుతూ వస్తోంది. ఆఖరికి నిన్నటికి నిన్న కరోనా మృతులు అందరికీ యాభై వేల వంతున సాయం చేస్తామని కేంద్రం కోర్టుకు తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
అయితే అక్కడే అసలు గమ్మత్తు దాగి వుందని వార్తలు వివరంగా బయటకు వచ్చాక అర్థమైంది. ఈ సాయం కేంద్రం చేయదట. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ విపత్తు స్పందన నిధుల నుంచి చేయాలట. అలా చేయడానికి రాష్ట్రాలను అనుమతిస్తున్నాం, అది కూడా అన్ని నిబంధనల ప్రకారం కోవిడ్ మృతి అని తేలితేనే సహాయం అందుతుంది అని కోర్టుకు కేంద్రం తెలియచేసింది.
మొత్తానికి కోర్టు చెప్పిన మేరకు సహాయం అందించినట్లూ అయింది, తమ చేతికి మట్టి అంటకుండానూ అయింది. ఇక రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.