మరికొద్దిసేపట్లో చంద్రయాన్-3 ప్రయోగం ఓ కొలిక్కి రానుంది. ప్రయోగం విజయవంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ చంద్రయాన్-3 వైపు చూస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయంత్రం చంద్రుడి దక్షిణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో, అసలు చంద్రయాన్ ఎప్పుడు మొదలైంది, ఈ స్థాయికి ఎలా చేరుకుందో ఓసారి చూద్దాం..
ప్రపంచదేశాలతో పోలిస్తే జాబిల్లిని చేరుకునేందుకు మనం కాస్త ఆలస్యంగా అడుగులు వేశాం. ఇది కూడా వ్యూహాత్మకమే. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగాన్ని, అత్యంత చౌకగా చేసిచూపించడం భారత్ లక్ష్యం. అందుకే టైమ్ తీసుకుంది. ఈ క్రమంలో వైఫల్యాలు కూడా చూసింది.
చంద్రయాన్ పై తొలిసారి మాజీ ప్రధాని వాజ్ పేయి 2003, ఆగస్ట్ 15న అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఇస్రో ప్రయోగం చేపట్టింది. 2008, అక్టోబర్ 22న షార్ వేదికగా చంద్రయాన్-1 ప్రయోగం చేపట్టింది. నవంబర్ 8న చంద్రుడి కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది చంద్రయాన్-1. అలా చంద్రుడిని అన్వేషించే క్రమంలో భారత్ కూడా సక్సెస్ ఫుల్ గా తొలి అడుగు వేసింది.
చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-1, 8 నెలల పాటు ప్రపంచానికి చంద్రుడికి సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అందించింది. టెర్రైన్ మ్యాపింగ్, త్రీడీ చిత్రాలతో పాటు… చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఖనిజాలు, లోహాల్ని కూడా కచ్చితంగా వెల్లడించింది.
అయితే చంద్రయాన్-1 సక్సెస్ అయినంతగా, చంద్రయాన్-2 సక్సెస్ అవ్వలేదు. 2019లో చేపట్టిన ఈ ప్రయోగం, చంద్రుని కక్ష్యలోకి చేరేంత వరకు సక్సెస్ ఫుల్ గానే సాగింది. ల్యాండింగ్ విషయంలో మాత్రం అంచనా తప్పింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ జరిగి మిషన్ ఫెయిలైంది.
మళ్లీ ఇన్నేళ్లకు చంద్రయాన్-3 నింగికెగిసింది. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టబోతోంది. అయితే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్-2లో ఫెయిలైంది ఇక్కడే. ఈసారి ల్యాండింగ్ కు చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమని చెబుతోంది ఇస్రో. అందుకే ఆ క్షణాల కోసం యావత్ దేశం ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది.