టీడీపీ యువ నాయకుడు యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగుతోంది. పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ను చూసేందుకు రోడ్లన్నీ జనమయం అయ్యినట్టు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. జనం పోటెత్తు తుండడంతో షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర మందగమనంతో వెళుతోందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. లోకేశ్‌ను చూసేందుకు జనం రోడ్లపై అర్ధరాత్రి, తెల్లవారుజామున వరకూ వేచి చేస్తున్నారని టీడీపీ అనుకూల పత్రికలు రాస్తున్నాయి.
తద్వారా లోకేశ్‌కు విపరీత జనాదరణ వస్తోందనే ఫీలింగ్‌ను క్రియేట్ చేసేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. లోకేశ్ నాయకత్వ సమర్థతను చాటి చెప్పేందుకు ఆయన కంటే మిగిలిన వారంతా ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. అయితే టీడీపీ ఎంపీలు పాదయాత్రలో పాల్గొనకపోవడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రపై గల్లా జయదేవ్ నెగెటివ్ కామెంట్స్ చేసినట్టు కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో తాను అలా అనలేదని చెప్పడానికి లోకేశ్ పాదయాత్ర గురించి అయిష్టంగా అయినా గల్లా జయదేవ్ ట్వీట్ చేయాల్సి వచ్చిందని సమాచారం. గల్లా జయదేవ్ ట్వీట్ ఏంటంటే…
“టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారి మీద, ఆయన తలపెట్టేన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, ఒట్టి నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను”
గల్లా జయదేవ్ పాదయాత్రలో పాల్గొనకపోయినా, ఆయన గుర్తింపునకు నోచుకోవడం గమనార్హం. నారా లోకేశ్ వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఏ మాత్రం ప్రజాదరణ లేని నాయకుల్ని లోకేశ్ ప్రోత్సహిస్తూ, తమను నిర్లక్ష్యంగా చూస్తున్నారనేది వారి ఆవేదన. గల్లా జయదేవ్ కొంత కాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. బలమైన కారణం వల్లే గల్లా జయదేవ్ టీడీపీకి దూరంగా ఉన్నారనే చర్చ ఆ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.