విశాఖ పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఒకరు దుర్మరణం పాలుకాగా మరికొందరికి గాయాలయ్యాయి. రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించింది. పరిశ్రమల శాఖ మంత్రి, కార్మిక మంత్రి, హోం మంత్రి నేరుగా పరిస్థితి సమీక్షించారు. స్థానిక నేతలు స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి కారణాలు అడిగి తెలుసుకున్నారు, బాధితులకు భరోసా ఇచ్చారు. మరోవైపు జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ కమిటీని నియమించి న్యాయపరమైన చర్యలకు నాంది పలికారు.
ప్రభుత్వం ఎంత చేసినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మానవు. బాధిత కుటుంబాలతో కలసి ఫ్యాక్టరీ ముందో లేదా కలెక్టరేట్ ముందో నానా హడావిడి చేస్తాయి. గతంలో అయితే పరిస్థితి ఇలాగే ఉండేది, నష్టపరిహారం విషయంలో చర్చోపచర్చలు జరిగేవి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు నష్టపరిహారం అనే మాటెత్తడానికే జంకుతున్నాయి. బాధితులు కూడా ముఖ్యమంత్రి జగన్ పై భరోసా ఉంచుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన తర్వాత కాంపెన్సేషన్ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వారి ఊహలకు అందకుండా సీఎం జగన్ ఏకంగా మరణించినవారి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించడం, అది కూడా దుర్ఘటన జరిగిన నాలుగో రోజే వారికి చెక్ లు అందేసరికి ఎవరికీ నోటమాట రాలేదు. అప్పటి వరకూ నష్టపరిహారంపై రగడ చేసిన చంద్రబాబు కూడా నోరు మూసుకున్నారు. కోటి రూపాయలిస్తే ప్రాణాలు తిరిగొస్తాయా అంటూ కొత్త లాజిక్ మాట్లాడారు.
ఇటీవల సాయినాథ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో విషవాయువులు లీకై ఇద్దరు మరణించిన ఘటనలో కూడా ప్రతిపక్షాలు అన్నీ మాట్లాడాయి కానీ నష్టపరిహారంపై నోరు మెదపలేదు. తాజాగా ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి, ఇంకో నలుగురు చిన్న చిన్న గాయాలతో బైటపడ్డారు. ఈ ఘటనపై టీడీపీ స్పందించినా కేవలం ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి సైలెంట్ గా ఉంది. బీజేపీ – జనసేన తరపున పవన్ కల్యాణ్ స్పందించారు. పవన్ కూడా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం.
ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది.. ? అనే వాక్యం మినహా పవన్ ప్రెస్ నోట్ లో ఎక్కడా విమర్శలు లేవు. బాధితులకు సకాలంలో నష్టపరిహారం అందించాలని మాత్రమే ఆయన డిమాండ్ చేయడం విశేషం. మొత్తమ్మీద రాష్ట్రంలో అనుకోని దుర్ఘటనలు జరిగితే అతిగా స్పందించే ప్రతిపక్షాలు జగన్ నిర్ణయాలతో సంయమనం పాటిస్తున్నాయన్నమాట.
నష్టపరిహారం తాము అడగడం, దానికి నాలుగైదు రెట్లు ఎక్కువగా జగన్ ప్రకటించడం, బాధితులంతా జగన్ ని దేవుడిలా చూడటం.. ఇదంతా ఎందుకన్నట్టు ఆగిపోతున్నారు. దుర్ఘటనలను రాజకీయం చేయడం మానుకున్నారు.