స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని చూసి అధికార వైసీపీ ఏ మాత్రం విరవీగినా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. అసలు ఏ మాత్రం ప్రచారానికి నోచుకోని ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీకి ఓ హెచ్చరిక చేస్తున్నాయి. అయితే ఇది ఆ పార్టీ గుర్తించాల్సి వుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కమిటీలకు ఎన్నికలు జరగడంతో పాటు పలు చోట్ల ఘర్షణలు తలెత్తడాన్ని అధికార పార్టీ సులభంగా తీసుకోడానికి వీల్లేదు.
ఎందుకంటే నిన్నమొన్నటి వరకూ సాగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా ఏకపక్షంగా ఆధిపత్యాన్ని చెలాయించింది. అది పార్టీలకు అతీతంగా జరిగిన పంచాయతీ ఎన్నికలైనా, పార్టీ పరంగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైనా విజయం మాత్రం అధికార పక్షానిదే. చాలా వరకూ ఏకగ్రీవాలయ్యాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు వచ్చే సరికి అధికార పార్టీ తాననుకున్నట్టు చేయలేకపోయింది. ఇందుకు ఏకగ్రీవ గణాంకాలే చెబుతున్నాయి.
విద్యా కమిటీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరిగాయి. కానీ పూర్తిస్థాయిలో రాజకీయం పనిచేసింది. జగన్ ప్రభుత్వ పాఠశా లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. దీంతో తల్లిదండ్రుల కమిటీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
బడుల్లో నిన్న జరిగిన ఎన్నికలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూపు సురేష్ చెప్పిన ప్రకారం… రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,609 పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించారు. 19వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక మిగిలిన పాఠశాలల్లో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోయినట్టు మంత్రి మాటలే చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరస్పరం దాడులకు దిగడాన్ని పరిశీలిస్తే… ప్రతిఘటన ఎదురవుతున్నట్టుగా గ్రహించాలి. ఇది ప్రధానంగా అధికార వైసీపీ ఓ హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే జగన్ రెండేళ్ల పాలనతో వైసీపీ అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే 17.66 శాతం ఓట్లను అధికంగా పొందిందని పార్టీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి. సీఎం జగన్ రెండేళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో 67.61 శాతం మంది ప్రజల ఆదరణ పొందారని లెక్కలేసి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 16.38 శాతం మేర ప్రజాదరణను కోల్పోయిం దని కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుని లెక్కలేస్తున్నారు.
మరి బడుల ఎన్నికల్లో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగా ఏకపక్షంగా తన హవాను కొనసాగించలేకనపోవడానికి కారణం ఏంటి? ఎక్కడో, ఏదో తేడా కొడుతోందని అధికార పార్టీ గ్రహించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు సంకేతాన్ని ఇస్తున్నాయి. జగన్ పాలనపై సానుకూలత ఉన్న మాట వాస్తవమే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాదరణ కంటే, అధికార అండగా వైసీపీకి బాగా కలిసి వచ్చిందనేది జగమెరిగిన సత్యం. ఆ వాస్తవాన్ని విస్మరించకూడదు.
మొక్కే కదా అని బడుల ఎన్నికల్లోని ప్రతిఘటనను వదిలేస్తే… మరో రెండున్నరేళ్ల నాటికి అదే వృక్షమవుతుందని గ్రహించాలి. ముఖ్యంగా ఈ పరిణామాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా తీసుకోవాలి.