24కు ఆ రెండూ లేనట్లే

టాలీవుడ్ జనం ఆశపెట్టుకున్న రెండు కోరికలు ఈవారం నెరవేరేలా కనిపించడం లేదు. ఆంధ్రలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఇవ్వడం, సెకెండ్ షో కు అనుమతి ఇవ్వడం అన్న రెండు విషయాల మీద టాలీవుడ్ జనాలు ఆశగా…

టాలీవుడ్ జనం ఆశపెట్టుకున్న రెండు కోరికలు ఈవారం నెరవేరేలా కనిపించడం లేదు. ఆంధ్రలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఇవ్వడం, సెకెండ్ షో కు అనుమతి ఇవ్వడం అన్న రెండు విషయాల మీద టాలీవుడ్ జనాలు ఆశగా వున్నారు. 

ఈవారం లవ్ స్టోరీ విడుదల లోపు ఈ ఆదేశాలు వస్తాయని ఎగ్జిబిటర్లు అంతా ఆశగా వున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి పేర్ని నాని సమక్షంలో జరిగిన టాలీవుడ్ ప్రతినిధుల సమావేశంలో కూడా ఈ రెండు విషయాలకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ఏమిటంటే, ఆంధ్రప్రధేశ్ ఆరోగ్యశాఖ నూరు శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది అన్నది. హోమ్ శాఖ నుంచి ఈ మేరకు వెళ్లిన మెయిల్ కు ఆరోగ్య శాఖ నో చెప్పేసింది. దీంతో బాల్ సిఎమ్ కోర్టులోకి వెళ్లిపోయింది. 

సిఎమ్ తలుచుకుంటే నూరు శాతం ఆక్యుపెన్సీ వుంటుంది లేదంటే లేదు. అదే విధంగా సెకెండ్ షో కూడా.  అయితే లవ్ స్టోరీ విడుదలకు ఇక ఒక్క రోజు మాత్రమే గ్యాప్ వుంది. ఏం జరిగినా గురువారం జరగాలి. కానీ మంత్రి పేర్ని నాని జిల్లాపరిషత్ ఎన్నికల హడావుడిలో వున్నారు. 

అందువల్ల ఆయన ఈ విషయం మీద దృష్టి ఏ మేరకు పెడతారు అన్నది చూడాలి. యుద్ద ప్రాతిపదికన మంత్రి పేర్ని నాని పూనుకుని, సిఎమ్ దృష్టికి తీసుకెళ్లగలిగితే పని జరగడానికి అవకాశం వుంది లేదంటే లేదు.