తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రెండు జీవోలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా నష్టపోయిందేమీ లేదు. పైగా పాలక మండలి సభ్యులు కూడా ఆవేదన చెందకపోగా, లోలోపల సంతోషిస్తుంటారని చెప్పొచ్చు.
ఎందుకంటే భారీ సంఖ్యలో ఆహ్వానితులు రావడం వల్ల తమకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండవనే ఆవేదన వారి మనసుల్లో ఉందంటున్నారు.
హైకోర్టు స్టేతో ఏ విధంగా చూసినా జగన్ను నిందించే వారెవరూ లేరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను గుర్తించి టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని, న్యాయస్థానం జీవోలను కొట్టేసిందనే భావన తప్ప, మరో రకంగా వ్యతిరేకత ఏర్పడే అవకాశమే లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టుకెళ్లిన వాళ్లపై వారికి కోపం ఉంటుంది. తమ పిటిషన్లను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను నెలపాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని పిటిషనర్లు స్వాగతిస్తున్నారు.
తాజా పరిణామాలపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కోర్టు స్టేతో ఇంకా కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయని ప్రత్యేక ఆహ్వానితుల ఆవేదన మాటలకందదు. నిజానికి ప్రభుత్వ నియామకంపై ప్రతికూల తీర్పు వెలువడినప్పుడు ప్రభుత్వ పెద్ద ఆవేదనకు గురి అవుతుంటారు. కానీ ఈ కేసు మాత్రం అందుకు ప్రత్యేకం అని చెప్పక తప్పదు.