ఇన్ని రోజులూ కోడెలను వేధిస్తున్నారంటూ మాట్లాడిన నేతలు ఎవరైనా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎవరైనా కోడెల శివప్రసాద్ రావు పేరెత్తారా? కనీసం చంద్రబాబు నాయుడు అయినా కోడెల గురించి ఒక మాట మాట్లాడారా? కోడెల గురించి మాట్లాడితే.. అది తమకు డ్యామేజ్ చేసేదే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది నిజం కాదా? అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో కానీ, కే ట్యాక్స్ విషయంలో కానీ.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒక్క మాట అయినా మాట్లాడారా?
ఆత్మకూరులో తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని అంటూ చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టారు కానీ, కోడెల శివప్రసాద్ రావుపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత మాట్లాడలేదు. కోడెలను వేధిస్తున్నారనే మాటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వినిపించలేదు!
అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ప్రభుత్వ వేధింపులతోనే కోడెల చనిపోయారని.. తెలుగుదేశం వాదిస్తూ ఉంది. ఇంకా కోడెలది ఆత్మహత్యా, లేక గుండెపోటా.. అనే విషయం గురించి ప్రభుత్వ వైద్యులు ప్రకటించలేదు. అయితే ఇంతలోనే తెలుగుదేశం పార్టీ ప్లేటు ఫిరాయించింది. కోడెల మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు రెడీ అవుతోంది.
చావు విషయంలోనూ తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎలా ఉందంటే.. కోడెలపై ఫర్నీచర్ వ్యవహారంలో వర్ల రామయ్య అప్పట్లో స్పందించారు. కోడెల అలా చేయాల్సింది కాదన్నట్టుగా హితవచనాలు పలికారు. అప్పట్లో కోడెలను కార్నర్ చేస్తూ మాట్లాడిన ఈయన ఇప్పుడు ప్రభుత్వ వేధింపుల వల్లనే ఆయన మరణించారంటూ మాట్లాడారు. కోడెల మరణాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇలా ఉపయోగించుకుంటూ ఉంది.
ఆయన బతికి ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు, పైపెచ్చూ ఆయనను సస్పెండ్ చేయాలని అప్పట్లో లోకేష్ అనుకున్నారట. ఇప్పుడు ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. దీనిపై తెలుగుదేశం ఇంకా ఎంత రాజకీయం చేయనుందో!