కోడెల మరణం.. టీడీపీ వైపే వేళ్లు!

కోడెల మరణంపై ఇంకా మిస్టరీనే కొనసాగుతూ ఉంది. ఆయన ఎలా మరణించారనే అంశం గురించి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఒకవైపు, ఆయన గుండెపోటుకు గురిఅయ్యి మరణించారని మరోవైపు కథనాలు వినిపిస్తూ…

కోడెల మరణంపై ఇంకా మిస్టరీనే కొనసాగుతూ ఉంది. ఆయన ఎలా మరణించారనే అంశం గురించి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఒకవైపు, ఆయన గుండెపోటుకు గురిఅయ్యి మరణించారని మరోవైపు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయనకు చికిత్సను అందించింది బసవతారకం ఆసుపత్రిలో. అదే ఆసుపత్రి కోసం కోడెల చాలాకాలం పనిచేశారు. అది తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలోని ఆసుపత్రి అని కూడా వేరే చెప్పనక్కర్లేదు. కోడెల గుండెపోటుకు గురై మరణించారో లేక ఆత్మహత్యకు పాల్పడగా ఆసుపత్రిలో మరణించారో.. 'బసవతారకం ఆసుపత్రి' ప్రకటించాల్సి ఉంది!

ఆ విషయం అలా ఉంటే.. కోడెల గుండెపోటుకు గురైనా లేదా ఆత్మహత్యాయత్నం చేసినా.. అందుకు కారణాలు తెలుగుదేశం పార్టీ వద్దనే ఉన్నాయని ఒక చర్చ మొదలైంది. ఇటీవల ఎన్నికల్లో కోడెల తెలుగుదేశం పార్టీతో పాటు ఓడిన సంగతి తెలిసిందే. తనకు అంబటి రాంబాబు పోటీనే కాదని, అలాగే చంద్రబాబుకు జగన్ కూడా పోటీనే కాదని కోడెల దర్జాగా ప్రకటించుకున్నారు. అలా ప్రకటించుకున్న వ్యక్తి ఓడిపోతే ఆయన ఎంత డిప్రెషన్లోకి వెళ్లి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

ఇక కోడెల ఓటమి తర్వాత నియోజకవర్గంలో ఆయన సంతానం సాగించిన దందాలకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కోడెల  శివరాం, పూనాటి విజయలక్ష్మిలు భారీగా దందాలు సాగించారనే ఆరోపణలున్నాయి. బాధితులు వరసగా కేసులు పెట్టసాగారు. టీడీపీ హయాంలో ఆ కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు నమోదు అవుతూ ఉన్నాయి. అదే తేడా. మరోవైపు ఫర్నీచర్ వ్యవహారం తెరమీదకు వచ్చింది.

అసెంబ్లీకి సంబంధించి ఎంతో విలువైన ఫర్నీచర్ ను కోడెల శివరాం వ్యాపారాలకు తరలించి వాడుకుంటున్న వైనం బయటపడింది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా కోడెల కు సపోర్ట్ చేయలేదు. కోడెల తప్పు చేశారంటూ తెలుగుదేశం నేత వర్లరామయ్య కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కోడెల తనయుడు, తనయ దందాలపై కూడా తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. వారు దందాలు సాగించలేదని తెలుగుదేశం పార్టీ గట్టిగా చెప్పలేదు.

ఒకదశలో కోడెల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కోడెలను సస్పెండ్ చేసి.. తద్వారా పార్టీ ఇమేజ్ ను పెంచే ఆలోచన లోకేష్ బాబు చేశారని వార్తలు వచ్చాయి. కోడెలపై చంద్రబాబుకు లోకేష్ సిఫార్సు చేసినట్టుగా కూడా కథనాలు వినిపించాయి. ఇంతలోనే కోడెల మరణించారు.

ఆయన ఊహించని రీతిలో పరాజయం పాలవ్వడం, కొడుకు-కూతురు దందాలపై కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కనీస సపోర్ట్ చేయకపోవడం.. పైగా ఆయనను సస్పెండ్ చేస్తారనే వార్తలు కూడా రావడం.. ఇలాంటి పరిస్థితులే కోడెల మరణానికి కారణం అయ్యాయని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?