మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గురించి బ్రేకింగ్ న్యూస్ లు వస్తున్నాయి. 72 యేళ్ల కోడెల శివప్రసాద్ రావు మరణించారు. ఆయన గుండె పోటుకు గురి అయినట్టుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ వార్తా కథనాన్ని ఇచ్చింది. అలాగే ఒక టీవీ చానల్ ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా వార్తలను ఇస్తోంది.
ఈ రెండు మీడియా సంస్థలూ తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైనవి. వాటిల్లోనే కోడెల కు ఏమైందనే అంశం గురించి భిన్నమైన కథనాలు వస్తూ ఉండటం గమనార్హం. రెండు రోజుల కిందట కోడెల శివప్రసాద్ రావు హైదరాబాద్ వెళ్లారని, అక్కడ సొంతిట్లో ఉన్నారని ఆయన ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారని ఒక మీడియా సంస్థ పేర్కొంది.
అయితే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని, ఆయన ఇంట్లోనే ఉరి వేసుకున్నారని మరో మీడియా సంస్థ చెబుతోంది. ఆయన మరణించినట్టుగా కూడా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఆయన మరణంపై, ఎలా మరణించారనే అంశంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. బసవతారకం ఆసుపత్రిలో కోడెల మరణించినట్టుగా సమాచారం.