అందరి రోగాలను నయం చేసే శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ (స్విమ్స్) సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రే కరోనా పాజిటివ్ బారిన పడింది. దీంతో తామెక్కడికి వెళ్లాలి దేవుడా అని రోగులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ వాసులకు స్విమ్స్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వరప్రసాదం అని చెప్పాలి. ఈ ఆస్పత్రిలో అన్ని రోగాలకు అధునాతనమైన సౌకర్యాలు అందు బాటులో ఉన్నాయి. వైద్యం ఖరీదైన నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ, ప్రాణదానం స్కీంలలో తక్కువ ధరకే వైద్యాన్ని అందిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతోంది.
ఈ ఆస్పత్రి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని పాదాల చెంత, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, నగర నడిబొడ్డున కొలువుదీరిన ఈ ఆస్పత్రిలో అన్ని రకాల రోగాలకు నిష్ణాతులైన వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దీంతో ప్రతిరోజు వేలాది మంది రోగులు వివిధ రకాల జబ్బులకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఊరట పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో 40 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఔట్ పేషెంట్స్ (ఓపీ) సేవలు రద్దు చేసినట్టు సోమవారం రాత్రి ప్రకటించారు. తిరిగి ప్రకటించే వరకు రోగులెవరూ రాకూడదని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. కాగా ఒక్క తిరుపతి నగరంలోనే ఇప్పటి వరకు 1092 కేసులు నమోదు కావడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తోంది.
ఇదిలా ఉండగా ఆకస్మికంగా ఓపీ సేవలను బంద్ చేయడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రోగులు, వారి బంధువులు అవస్థలు పడుతున్నారు. దీంతో స్విమ్స్ నిర్వాహకులు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ముందే ప్రకటించి ఉంటే తమకు ఈ తిప్పలు ఉండేవి కాదు కదా అని వారు మండిపడుతున్నారు.