ఢిల్లీ కోర్టు వైసీపీకి నోటీసులు పంపించిందని కథనాలిస్తూ పచ్చపాత మీడియా రాక్షసానందాన్ని పొందుతోంది. ఆ నోటీసులతో ఏమవుతుంది? వైసీపీ పేరుమారుతుందా? పార్టీని క్యాన్సిల్ చేస్తారా? జగన్ ముఖ్యమంత్రి కుర్చీకి ఇబ్బంది ఎదురవుతుందా? ఇవేవీ జరగనప్పుడు అంత శునకానందం ఎందుకు? పార్టీ పేరు గురించి వైసీపీకి వచ్చిన నోటీసులపై అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి?
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై స్పందించిన తీరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చుట్టూ వివాదాలు తెరపైకి వచ్చాయి. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచానని, అయితే తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నోటీసులెలా ఇస్తారని ఆయన అమాయకంగా, వెటకారంగా ప్రశ్నించారు.
ఆ తర్వాత అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకుంటున్న మహబూబ్ భాషా అనే వ్యక్తికి ప్రతిపక్షాలు 'కీ' ఇచ్చి వదిలాయి. అతను వాళ్లు ఆడమన్నట్టల్లా ఆడుతూ అధికార పార్టీకే సవాళ్లు విసురుతున్నారు. తన పార్టీ పేరుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వాడుకుందని, అందుకే తనకు పడాల్సిన ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయని వాపోయారు.
మరీ ఇంత దురాశ ఉంటే ఎట్లా. పార్టీ పేరు, చరిత్ర చూసి జనం ఓట్లు వేసే రోజులు ఎప్పుడో పోయాయి. అఖిల భారత కాంగ్రెస్ ని ముక్కలు చేసి ఇందిరా గాంధీ నిజమైన కాంగ్రెస్ మాదేనంటూ కాంగ్రెస్ (ఆర్) పేరుతో బైటకొచ్చారు. ఆ తర్వాత.. ఇందిర కాంగ్రెస్ ని స్థాపించి కాంగ్రెస్ (ఐ) అన్నారు. జోడెడ్ల బండి గుర్తు కాస్తా ఆవు దూడగా మారినా, ఆవుదూడను హస్తం గుర్తు ఆక్రమించినా.. జనం ఎవరి వెంట ఉన్నారనేదే ముఖ్యం కానీ పార్టీ పేరు, గుర్తుతో అవసరం ఏముంది.
వైఎస్సార్ ని తమవాడిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, అధికార పార్టీగా ఏపీ ఎన్నికల బరిలో దిగి కనీసం ఒక్కసీటు కూడా తెచ్చుకోలేదంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పేరుని హేళన చేశారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని వాస్తవాలను అర్థం చేసుకున్నారు. అంతెందుకు తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు.. ఆయా రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ నే దెబ్బకొట్టాయి. ఏపీలో కూడా అదే జరిగింది. మరి వైసీపీ ఒక్కదానిపైనే ఈ ఏడుపంతా ఎందుకు?
2019 ఎన్నికల్లో జనం అభ్యర్థి ఎవరనేది చూడలేదు, పార్టీలను, గుర్తులను పట్టించుకోలేదు. ఓటర్లకు కళ్ల ముందు కనిపించిన వ్యక్తి ఒక్కరే జగన్, వాళ్ల మనసులో ముద్రపడిపోయింది ఒక్కటే జగన్ చేతిలో ఫ్యాన్. రాజన్న రాజ్యం కోసం జగన్ ని గెలిపించుకున్నారు కానీ కాంగ్రెస్ పేరున్న పార్టీ కోసం కాదు.
ఇకనైనా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో చిల్లర వేషాలు వేయడాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలి. ఆకాశంపై ఉమ్మేసే పనులు ఆపేయాలి.