పార్టీలో చేరేందుకు రూ.25 కోట్లు అడిగాడు

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ కామెడీ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ కేఏ పాల్ త‌న‌లోని కామెడీ కోణాన్ని మ‌రింత‌గా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే ఆయ‌న‌లోని గొప్ప‌త‌నం ఏంటంటే… కేఏ…

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ కామెడీ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ కేఏ పాల్ త‌న‌లోని కామెడీ కోణాన్ని మ‌రింత‌గా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే ఆయ‌న‌లోని గొప్ప‌త‌నం ఏంటంటే… కేఏ పాల్ న‌వ్వించ‌డ‌మే త‌ప్ప‌, ఆయ‌న న‌వ్వ‌రు. ఏ కామెడీ యాక్ట‌ర్ ఆయ‌న ముందు స‌రిపోర‌న్న రీతిలో రాజ‌కీయాల్లో హాస్యాన్ని పండిస్తుండ‌డం విశేషం.

ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ నుంచి భారీగా ప్ర‌శంస‌లు అందుకున్న ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ‌పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల‌ను త‌న పార్టీలోకి కేఏ పాల్ ఆహ్వానిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న‌ను న‌మ్ముకుంటే ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని పాల్ గ‌ట్టి హామీ ఇచ్చారు. ఎందుక‌నో ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీ వైపు మొగ్గు చూపారు. అలాగ‌ని చంద్ర‌బాబు జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను సీఎం చేస్తాన‌ని హామీ ఇవ్వ‌లేదు.

ప‌వ‌న్ విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. మంద‌కృష్ణ మాదిగ‌ను త‌న పార్టీలో చేరాల‌ని ఆహ్వానించిన‌ట్టు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు తెలిపారు. అయితే త‌న పార్టీలో చేర‌డానికి మంద‌కృష్ణ రూ.25 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు కేఏ పాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అంత మొత్తంలో తాను ఇవ్వ‌క‌పోవ‌డంతోనే మంద‌కృష్ణ త‌న పార్టీలో చేర‌లేద‌నే సంకేతాల్ని ఆయ‌న పంపారు.

మంద‌కృష్ణ మాదిగ‌ను అంత‌టితో పాల్ వ‌దిలిపెట్ట‌లేదు. ప‌రేడ్ గ్రౌండ్‌లో త‌న సామాజిక వ‌ర్గంతో  స‌భ పెట్ట‌డానికి మంద‌కృష్ణ‌కు రూ.72 కోట్లు ముట్టిన‌ట్టు మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ప్ర‌ధాని మోదీకి మంద‌కృష్ణ మాదిగ అమ్ముడుపోయాడ‌ని ఘాటు విమ‌ర్శ చేశారు. గ‌తంలో మోదీని ఇష్టానుసారం తిట్టి, ఇప్పుడు అదే పాల‌కుడిని దేవుడ‌ని మంద కృష్ణ కీర్తిస్తున్నాడ‌ని త‌ప్పు ప‌ట్టారు.