క‌క్ష సాధింపులో రామోజీ మార్గ‌ద‌ర్శి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా చిట్‌ఫండ్ కంపెనీల‌పై అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనాడు అధిప‌తి రామోజీరావుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాల‌యాల్లో సోదాలు చేశారు. ఒక్క మార్గ‌ద‌ర్శికి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా చిట్‌ఫండ్ కంపెనీల‌పై అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనాడు అధిప‌తి రామోజీరావుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాల‌యాల్లో సోదాలు చేశారు. ఒక్క మార్గ‌ద‌ర్శికి మాత్ర‌మే ఈ సోదాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వ క‌క్ష సాధింపుగా క‌నిపిస్తున్నాయి. క‌క్ష సాధింపు గురించి రామోజీ క‌బుర్లు చెప్ప‌డం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా వుంటుంద‌ని జ‌నం అంటున్నారు.

త‌న మాట విన‌లేద‌ని దివంగ‌త ఎన్టీఆర్ అంత‌టి వాడిని క‌క్ష సాధించిన చ‌రిత్ర రామోజీరావుది. క‌క్ష సాధింపులో రామోజీ “మార్గ‌ద‌ర్శి” అనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఎంత‌టి వారైనా రామోజీ మాట వినాలి. లేదంటే క‌క్ష కట్టి త‌న మీడియా ద్వారా వ్య‌తిరేక వార్త‌లు రాయిస్తారు. చివ‌రికి అమ‌లాపురం డీఎస్పీ, ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌లు కూడా రామోజీ క‌క్ష సాధింపున‌కు గురి కావ‌డాన్ని ఇటీవ‌ల ఆయ‌న ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ల ద్వారా తెలుసుకున్నాం. జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచిన ఏ ఒక్క‌రినీ ఆయ‌న వ‌దిలిపెట్ట‌డం లేదు. కానీ ఆయ‌న్ను మాత్రం ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌దు. ఇది రామోజీరావు నీతి, రీతి.

మార్గ‌ద‌ర్శిపై మూడు రోజులుగా సోదాలు నిర్వ‌హించ‌డ‌మే జ‌గ‌న్ ప్ర‌భుత్వ క‌క్ష సాధింపున‌కు పాల్ప‌డడ‌మైతే, ప్ర‌తిరోజూ రామోజీ నేతృత్వంలోని ఈనాడు మీడియా గ్రూపు చేస్తున్న‌దేంటి? ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో పాటు ఆయ‌న కుటుంబంపై మీడియాను అడ్డు పెట్టుకుని రామోజీ చేస్తున్న పనికి ఏ పేరు పెట్టాలో ఆయ‌నే రాస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

“మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌పై క‌క్ష సాధింపు” శీర్షిక‌తో ఇవాళ “ఈనాడు” బ్యాన‌ర్ క‌థ‌నం రాసింది. ఈ క‌థ‌నంలో మార్గ‌ద‌ర్శి కంపెనీ త‌న‌కు తాను నిజాయ‌తీ స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. “ఆరు ద‌శాబ్దాల చ‌రిత్ర గ‌ల మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్ నూటికి నూరు శాతం చ‌ట్టానికి లోబ‌డి ప‌ని చేస్తుంది” అని ఆ సంస్థ ఉన్న‌తాధికారులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. త‌న‌కు తాను క్లీన్‌చిట్ స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం ఒక్క రామోజీ సంస్థ‌కే చెల్లింది. ఆ సంస్థ అహంకారం ఏ స్థాయిలో వుందో మార్గ‌ద‌ర్శి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నే నిద‌ర్శ‌నం.

“చ‌ట్ట ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన చ‌రిత్ర కానీ, ఖాతాదారుల ఫిర్యాదులు కానీ మార్గ‌ద‌ర్శిపై లేవు” అని కూడా రాసుకొచ్చింది, మ‌రి రామోజీ, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌ధ్య వివాదం ఏంటో ఈనాడు మీడియా, మార్గ‌ద‌ర్శి ఉన్న‌తాధికారులే స‌మాధానం చెప్పాల్సి వుంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య రాజ‌మండ్రిలో లేదా హైద‌రాబాద్‌లో ఏవైనా స్థ‌ల వివాద స‌మ‌స్య‌లున్నాయా?  లేక రాజ‌కీయ వైర‌మా? ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో రామోజీరావుపై న‌డుస్తున్న కేసు దేనికి సంబంధించిందో చెప్ప‌గ‌ల‌రా? మ‌రీ జ‌నాల‌కు ఏమీ తెలియ‌ద‌ని అనుకుంటే ఎలా?  

క‌క్ష సాధింపు గురించి రాసే ముందు… ప్ర‌తిరోజూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం, ఆయ‌న కుటుంబంపై విద్వేష‌పూరిత రాత‌ల గురించి రామోజీరావు ఆలోచిస్తే మంచిది. త‌న‌కు గిట్ట‌ని జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈనాడు ప‌త్రిక‌ క‌క్ష క‌ట్టి రాత‌లు రాస్తున్న సంగ‌తి ప్ర‌జ‌ల‌కు, పాఠ‌కుల‌కు బాగా తెలుసు. సుప్రీంకోర్టులో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిష‌న్‌లో ఏపీ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ అయిన‌ప్ప‌టి నుంచి మ‌రింత విద్వేష‌పూరిత రాత‌లు రాస్తుండ‌డాన్ని పాఠ‌కులు గ‌మ‌నిస్తున్నారు. త‌న‌పై జ‌గ‌న్ క‌క్ష సాధిస్తున్నార‌ని ఆరోపించే రామోజీరావు… తాను చేస్తున్న‌దేంటో ఒక‌సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే స‌మాధానం దొరుకుతుంది.

ప్ర‌తిరోజూ త‌న ప‌త్రిక‌లో బ్యాన‌ర్ క‌థ‌నాలు ఏ ర‌క‌మైన స్వ‌భావాన్ని క‌లిగి ఉన్నాయో చంద్ర‌బాబు రాజ‌గురువు ఆలోచిస్తే మంచిది. మొండివాడైన జ‌గ‌న్ పాల‌కుడు కావ‌డాన్ని జీర్ణించుకోలేక సాగిస్తున్న వికృత క్రీడ‌లో చివ‌రికి తామే బ‌లి కావాల్సి వుంటుంద‌నే వాస్త‌వాన్ని గుర్తిస్తే… అంద‌రికీ మంచిది. ఎందుకంటే చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య వుంటుంద‌ని సైన్స్ చెబుతుంది. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. గ‌గ్గోలు పెడితే సానుభూతి చూపే వారెవ‌రూ వుండ‌రు.