ఒకరేమో ఒక్క చాన్స్ ఇవ్వాలని, మరొకరేమో లాస్ట్ చాన్స్ ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలెవరో అందరికీ తెలుసు. జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమకు ఈ దఫా అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు మూడు దఫాలు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏళ్లు, విభజిత ఏపీని ఐదేళ్ల పాటు పరిపాలించారు. వయసు పైబడడం, అలాగే శపథాన్ని నెరవేర్చుకునేందుకు ప్రజలు దయ చూపాలని ఆయన వేడుకోవడం గమనార్హం.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… ఎప్పుడెలా మాట్లాడ్తారో ఆయనకే తెలియని పరిస్థితి. పవన్ రాజకీయ పంథాలో మార్పు రాకపోతే చివరికి కేఏ పాల్‌లా తయారవుతారని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు ఘాటు వ్యాఖ్య చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి పవన్ వ్యవహారశైలిపై జనం ఎంతగా విసిగిపోయి వున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రధాని మోదీతో భేటీ తర్వాత మాత్రమే పవన్ మాటలో మార్పు వచ్చింది. విజయనగరం పర్యటనలో జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం తనకు ఒక్కసారి అధికారం ఇస్తే, అద్భుతాలు చేస్తానని ఆయన మొదటిసారిగా నమ్మబలుకుతున్నారు. ఇది ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఇంతకాలం జగన్‌ను గద్దె దించడమే ఏకైక ఆశయంగా పవన్ చెబుతూ వచ్చారు.
కానీ ఇప్పుడు మాత్రం తాను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టుగా చెబుతున్నారు. కర్నూలులో పర్యటిస్తున్న చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. తనకివే చివరి ఎన్నికలని, టీడీపీని గెలిపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చంద్రబాబును జనం 40 ఏళ్లుగా చూస్తున్నారు. ఆయన నైజం ఏంటో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు.
ఎవరినైనా కరివేపాకులా వాడుకుంటారని జనానికి బాగా తెలుసు. చంద్రబాబును సీఎం చేయడానికి జనం ఎందుకు ఓట్లు వేయాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బాబు సీఎం అయితే ఆయన కుమారుడు లోకేశ్‌కు, తెలుగుతమ్ముళ్లకు మేలు జరుగుతుంది. అంతే తప్ప జనానికి కలిగే ప్రయోజనం ఏంటనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సి వుంది. అదేంటో గానీ చంద్రబాబు తనకివే చివరి ఎన్నికలంటూ కన్నీళ్లు పెట్టుకోవడం వింతగా వుంది.
నటనలో తనకు మించిన వాళ్లు లేరని ఇలాంటి చర్యల ద్వారా చంద్రబాబు తనకు తానుగా చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దత్త పుత్రుడి ఒక్క చాన్స్ ఫ్లీజ్, అలాగే దత్త తండ్రి లాస్ట్ చాన్స్ ఫ్లీజ్ అనే అభ్యర్థనలకు జనం ఏ మేరకు కనికరిస్తారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.