ఒక్కోసారి ఏ జన్మలోనో..ఈ జన్మలోనో చేసిన పాపం అనిపించే సంఘటనలు జరుగుతూ వుంటాయి. నిర్మాత బన్నీ వాస్ కు ఇలాంటి వ్యవహారం నుంచి విముక్తి దొరకడం లేదు. బోయ సునీత అనే జూనియర్ నటి నుంచి జరుగుతున్న రచ్చ అలాగే వుంది. తరచు రావడం గీతా సంస్థ ముందు నగ్న ప్రదర్శన చేయడం, పోలీసులు తీసుకెళ్లడం, మెంటల్ ఆసుపత్రికో, లేదా ఆమె తల్లి తండ్రుల దగ్గరకో తీసుకెళ్లి అప్పగించడం, ఆ తరువాత కొన్నాళ్లు సైలంట్ గా వుండడం అన్నది రెగ్యులర్ వ్యవహారం అయిపోయింది.
ఇది తరచు వార్తల్లోకి రావడం, ఏదో వుంది అని అందరూ అనుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు. ఆమె వల్ల తమ పరువు సంగతి పక్కన పెడితే, తన కుటుంబానికి ప్రాణహాని వుందనే భయం వెంటాడుతోందని ఇండస్ట్రీ లో వినిపిస్తూనే వుంది. ఏదో జరిగే వుంటుంది లేదంటే ఎందుకు ఇలా చేస్తుంది అనే కామెంట్లు వుండనే వున్నాయి.
నిజానికి బన్నీ వాస్ కే కాదు ఇంకా చాలా మందికి ఇలాంటి సమస్య వుందని కూడా ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. కానీ బన్నీ వాస్ కి మాత్రమే ఇది బబుల్ గమ్ అంటుకున్నట్లు అంటుకుని వదలడం లేదు. ఎలా వదిలించుకోవాలో అన్నదీ తెలియడం లేదు. రెండు మాడు సార్లు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు ఇదో డిజార్డర్ అని అన్నారని బోగట్టా. మరి కేవలం బన్నీవాస్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసినట్లు అని ప్రశ్నిస్తే ఇన్ సైడ్ వర్గాలు ఇంకా చాలా పేర్లు చెబుతున్నాయి. కానీ అవన్నీ బయటకు రాలేదు..రావడం లేదని, ఇక్కడ మాత్రమే మీడియా ఫోకస్ పడుతోందని అంటున్నాయి.
ఓ మీడియా కమ్ సినిమా పర్సన్ ను, ఓ హోటల్ ఓనర్ ను, ఇంకా ఇలా మరో ఒకరిద్దరికి ఇదే సమస్య ఎదురయిందని, కానీ చాలా అంటే చాలా చిన్న మొత్తాలతో పనైపోయిందని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల క్రితం కూడా ఒకరికి ఇలాంటి సమస్య ఎదురైతే జస్ట్ అయిదు వేలతో వదలిపోయిందని అంటున్నారు. మరి అదే రూట్ లో బన్నీవాస్ కూడా వెళ్ల వచ్చుకదా అంటే ఆరంభంలోనే పోలీస్ కంప్లయింట్ అనే రాంగ్ సైడ్ రబ్ చేసేసారని, దాంతో ఇక ఆ దారి మూసుకుపోయిందని రీజన్ చెబుతున్నారు.
మొత్తానికి అన్ని విధాలా సక్సెస్ చూసిన, చూస్తున్న నిర్మాత బన్నీవాస్ కు ఇది ఓ పరిష్కారం దొరకని సమస్యగా మారిపోయింది. తరచు వార్తల్లోకి బన్నీవాస్ పేరును లాగేస్తోంది. అంతకుమించి, తన కుటుంబానికి ఎక్కడ హాని జరుగుతుందో అన్న భయమూ వెంటాడుతోంది.