కరోనా కేసులతో సతమతం అవుతున్న దేశాల్లో ఒకటి రష్యా. మొదట్లో ఇండియా లాగే రష్యాలో కూడా కరోనా కేసుల బాగా తక్కువగా తేలాయి. అయితే ఆ తర్వాత అక్కడ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అయితే కరోనాను ఎదుర్కొనడానికి రష్యా బాగా పని చేసింది. రికార్డు స్థాయిలో పరీక్షలు చేసింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మంత్రులు.. అనుమానితులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. అయితే రష్యాలో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేశారు. దీంతో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యింది. అభివృద్ధి చెందిన దేశం కావడంతో.. వైద్య సౌకర్యాలతో కరోనా సోకిన వారికి చికిత్సను అందిస్తూ వచ్చారు.
ఇదే సమయంలో కోవిడ్ 19 విరుగుడుకు తొట్టతొలి వ్యాక్సిన్ ను కనిపెట్టినట్టుగా మాస్కోలోని ఒక యూనివర్సిటీ ప్రకటించింది. కనిపెట్టడం అంటే క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి కావడం. ఇప్పటికే తొలి విడతగా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించిన వారిని డిశ్చార్జ్ చేశారట. ఇక రెండో విడత క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా సాగుతున్నాయని, ఈ నెల 20న వారందరినీ డిశ్చార్జి చేయబోతున్నట్టుగా ఆ వర్సిటీ ప్రకటించింది. అంతే గాక .. ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని స్పష్టం కావడంతో.. భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఆ వర్సిటీ ప్రకటించింది.
ఆ ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ, ఇంతటితో కరోనాకు చెక్ పెట్టేసినట్టేనా? అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. హ్యూమన్ ట్రయల్స్ మాత్రం జరిగాయి. ఈ వ్యాక్సిన్ సేఫ్ అని తేలింది.
మరి రష్యా ఇతర దేశాలకు ఈ వ్యాక్సిన్ ఇస్తుందా? అంటే..వ్యాపారం చేయడానికి రష్యా కూడా ఎందుకు వెనుకడుగు వేస్తుంది? డిమాండ్ రీత్యా భారీగా సొమ్ము చేసుకోవడానికి ఈ వ్యాక్సిన్ ను రష్యా అమ్మవచ్చు. ప్రపంచం వ్యాప్తంగా మరి కొన్ని దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ సాగుతూ ఉన్నాయి. ఆయా వ్యాక్సిన్ ల ఫలితాలు కూడా సానుకూలం అని ప్రకటనలు వస్తున్నాయి. ఇండియా కూడా మరో నెల రోజుల్లో ఒక వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతున్నట్టే అనేది ఊరట.