40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి, 14 ఏళ్ల పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబునాయుడు కనీసం తనదంటూ సొంత ముద్ర వేసే ఒక్క పథకమైనా అమలు చేశారా? అంటే “లేదు” అనే సమాధానమే వస్తుంది. 23 మంది శాసనసభ్యులను తన పార్టీలో కలిపేసుకోవడంతో పాటు వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి అపకీర్తిని మాత్రం మూటకట్టుకున్నారు. అంతేకాదు, తన పార్టీ అత్యంత ఘోర పరాజయం పాలు కావడానికి తానే కారణమయ్యారు.
కానీ తన మిత్రుడు, రాజకీయ సమకాలికుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ అందరి అంచనాలను తలకిం దులు చేస్తూ పాలనకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. జగన్ విజన్‌కు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలే నిలువెత్తు నిదర్శనం.
ఈ రెండు వ్యవస్థల ద్వారా పాలనను నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లిన ఘనత జగన్ దక్కించుకున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో సమర్థవంతంగా పనిచేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచేందుకు ఈ వ్యవస్థలే కారణం. తాజాగా జగన్ సృజనాత్మక పాలనలో మరో సౌకర్యం ప్రజలకు చేరువయ్యేందుకు బుడిబుడి అడుగులు వేస్తోంది. శైశవ దశలో ఉన్న ఈ పథకం అడుగులు వడివడిగా వేయడానికి మరికొంత సమయం పట్టనుంది.
కానీ జగన్ సర్కార్ వినూత్న ఆలోచన ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గుంటూరు జిల్లా కాజ సచివాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ లోటుపాట్లను సరిదిద్దుకున్న అనంత రం రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో అమలు చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోనే భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ చేపడుతూ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఏది ఏమైనా భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం సుదూర ప్రాంతాలకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెళ్లాల్సిన బాధ తప్పనుంది. పాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చే ఇలాంటి పనులను చంద్రబాబు ఎందుకు చేయలేక పోయారో అని రాజకీయ విశ్లేషకులు, మెజార్టీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపూ ప్రచారమే తప్ప పనిలో ధ్యాస లేకపోవడాన్ని చూశాం. కానీ ఇప్పుడు జగన్ పాలన అందుకు పూర్తి భిన్నంగా, వినూత్నంగా సాగుతోంది.