జగన్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పరిషత్ పదవుల్లోనూ మహిళలకు, అణగారిన వర్గాలకు సగానికి పైగా పదవులను కట్టబెడుతుండడం ప్రశంసలు అందుకుంటోంది.
ఈ నెల 24,25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్లు, 660 ఎంపీపీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార పార్టీ వైసీపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు జెడ్పీ చైర్మన్ పదవులు, 335 ఎంపీపీ పదవులకు ప్రభుత్వం మహిళలకు రిజర్వ్ చేసింది. అంటే సగానికి పైగా మహిళలకు ప్రభుత్వం పదవులు ఇస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఎస్టీ, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, బీసీ జనరల్‌కు ఒక్కొక్కటి చొప్పున, బీసీ మహిళలకు రెండు, జనరల్ మహిళకు మూడు, జనరల్ కేటగిరికి నాలుగు జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వు చేశారు. 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. ఇవే కాకుండా మైనార్టీలకు 686 కోఆప్టెడ్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ప్రతి మండలానికి ఒకరు చొప్పున 660 మండల పరిషత్‌లలో, జిల్లాకు ఇద్దరేసి చొప్పున 13 జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యు లను ఎన్నుకుంటారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు తదితరులతో పాటు తెలుగు మినహా మిగిలిన భాషలను మాతృభాషగా గుర్తింపు పొందిన వారు కోఆప్టెడ్ పదవులు పొందేందుకు అర్హులు. ఈ ప్రాతిపదికన నియామకాలు చేపట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం మొదటి నుంచి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా చేపట్టే ఈ నియామకాలన్నీ రానున్న ఎన్నికల్లో ఎంత వరకూ ఉపయోగపడతాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.