దూకుడు తగ్గించిన రాములమ్మ …అసంతృప్తి మొదలైందా?

విజయశాంతి అలియాస్ రాములమ్మలో గతంలో ఉన్నంత దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొత్తల్లో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా దాదాపు ప్రతిరోజూ ఒక స్టేట్ మెంట్  ఇచ్చేవారు. ప్రెస్…

విజయశాంతి అలియాస్ రాములమ్మలో గతంలో ఉన్నంత దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొత్తల్లో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా దాదాపు ప్రతిరోజూ ఒక స్టేట్ మెంట్  ఇచ్చేవారు. ప్రెస్ మీట్ పెట్టి కడిగిపారేసేవారు. కాని గత కొంతకాలంగా ఆమెలో ఆ దూకుడు లేదని, సైలెంటుగా ఉంటోందని పరిశీలకులు అంటున్నారు. ఆమె ధోరణి చూస్తుంటే ఆమెలో అసంతృప్తి మొదలైందని అనుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో విజయశాంతి కనిపించిన దాఖలాలు లేవు. బీజేపీలో చేరిన తొలినాళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడిన విజయశాంతి, ప్రస్తుతం సైలెంట్ గా తెలంగాణ లో జరుగుతున్నది చూస్తున్నారు. అడపాదడపా ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడ్డం మినహాయించి, పార్టీకి సంబంధించిన మిగతా కార్యక్రమాలలో విజయశాంతి పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపించటంలేదు.

విజయశాంతికి బీజేపీలోనూ మొదట్లో బాగానే ప్రాధాన్యత లభించింది. కానీ క్రమక్రమంగా పార్టీలో ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని కొంతకాలం విజయశాంతినే స్వయంగా వెల్లడించింది కూడా. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సమయంలో వేదికపై తనను మాట్లాడనివ్వలేదని, తనను పక్కన పెట్టారని ఆరోపించారు. తనను ఎందుకు మాట్లాడనివ్వలేదో బీజేపీ నేతలను అడగాలని పేర్కొన్న విజయశాంతి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ లకే తెలియాల్సి ఉందని విజయశాంతి చెప్పారు. 

పార్టీ బాధ్యతలు ఏమైనా ఇస్తే చేస్తానని .. ఇవ్వకుండా ఎలా చేయాలని ప్రశ్నించిన విజయశాంతి పార్టీలో తన పరిస్థితిని తానే నేరుగా వెల్లడించారు. ఇక బండి సంజయ్ విజయశాంతికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించారన్న చర్చ జరుగుతుంది.ఇక తాజాగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి కీలక భూమిక పోషించలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా లేరు. ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేవారు. పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెట్టారని ఆరోపించేవారు. ఆమె 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన విజయశాంతి ఓటమి పాలయ్యారు.

ఇక మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనూ కొంచెం కీలకంగా కనిపించిన విజయశాంతి ప్రభావం ఆపై తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతికి రాష్ట్ర ముఖ్య నాయకులు స్థానం కల్పించకపోవడంతో, సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు కొనసాగిన విజయశాంతి, ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక్కడా కథ మొదటికి వస్తున్న సూచనలు కనబడుతున్నాయి. విజయశాంతి 1998వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె పెద్దగా రాణించిన దాఖలాలు కనిపించలేదు. 1998 వ సంవత్సరంలో విజయశాంతి మొదట్లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత 2005 సంవత్సరంలో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేశారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసి ఆమె కూడా టీఆర్ఎస్ లో  చేరారు. ఆ పార్టీ నుంచే ఆమె తొలిసారి ఎంపీగా గెలిచారు. తెలంగాణా ఇచ్చినప్పుడు ఆమె, కేసీఆర్ ఇద్దరే ఎంపీలుగా ఉన్నారు.  మొదట్లో కేసీఆర్ విజయశాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించినా, క్రమక్రమంగా విజయశాంతి ప్రాధాన్యత పార్టీలో తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తరువాత బీజేపీలో చేరారు. మొత్తానికి ఎక్కడికి వెళ్లినా విజయశాంతికి కష్టాలు తప్పడం లేదని, ఇటు బీజేపీ లోనూ పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తోందని, మరి ఇటువంటి పరిస్థితుల్లో రాములమ్మ ఏం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని ముఖ్యమైన పార్టీలన్నీ మారిన రాములమ్మ, ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక ఇదే పార్టీలో ఉంటూ ప్రాధాన్యత లేకుండా మనుగడ సాగించటం కూడా కష్టంగా మారిందని సమాచారం. మరి ముందు ముందు పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.