రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ పై యువనేత సచిన్ తిరుగుబాటు ప్రకటించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదు. కాంగ్రెస్ నడక మార్పు , బీజేపీ ఫిరాయింపు రాజకీయాలు , సచిన్ , సిందియాల తిరుగుబాటును జగన్ తో పోలికలు పై చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ నడకలో మార్పు చూచిస్తున్న రాజస్తాన్….
కాంగ్రెస్ పార్టీలో మార్పు రావాలి అని ప్రజలు 2014 , 2019 లో తమ తీర్పు ద్వారా చెప్పారు. కీలకమైన జాతీయ నాయకత్వంలో మార్పు రావాలి. నాయకత్వం లో మార్పు అంటే అధ్యక్షుడు మారడం కాదు. పార్టీ విధానాలు , నడక మారాలి విధివిధానాలను నిర్ణయిస్తున్న కొర్ గ్రూప్ మారాలి. కాంగ్రెస్ ఓటమి పాలైన సందర్బంలో ఎవరు నాయకత్వం వహించారో వారే కొనసాగుతూ మార్పు రావాలి అంటే అది సాధ్యం కాదు.
నేడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కానీ అలాంటి భరోసా ఇవ్వవలసిన బాధ్యత నాయకత్వం మీద ఉంది. పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మినహా మరో మార్గం లేదు. జాతీయ స్థాయిలో ఉన్న కొర్ గ్రూప్ , రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రధాన నాయకత్వంలో మార్పులు చేసి గతానికి భిన్నంగా మారిన పరిస్థితులకనుగుణంగా తన నడకను మార్చుకుంటే దేశంలో మార్పు రావడం కష్టం కాదు. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ముంబై , హర్యానా రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి ప్రతికూలంగా వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉన్న సమయంలో ఈ తీర్పులు ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ ఫిరాయింపు రాజకీయాలు…
నిన్న మధ్యప్రదేశ్ , నేడు రాజస్తాన్ లో బీజేపీ ఫిరాయింపుల ను ప్రోత్సహిస్తుంది అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీలో బలహీనత లేకుండా బీజేపీ ప్రయత్నం చేయదు. కానీ కరోన సమస్య గురించి ఆందోళన చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికార మార్పు కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని సాధించవచ్చు గానీ తదుపరి ఎన్నికల సమయానికి అది వారికి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోస్టాహించిన ముద్ర ఆపార్టీకి ఎప్పటికి ఉంటుంది.
జగన్ తో సచిన్ , సిందియా కు పోలిక…..
సచిన్ , సిందియా , జగన్ ఒకే వయస్సులో ఉన్న వారు. అంతే కాదు వారి తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి స్నేహితులు. జగన్ తన తండ్రి మరణానంతరం మెజారిటీ పార్టీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ద్వారా లభించిన పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకుని పార్టీని నిర్మించి ప్రజల్లోకి వెళ్లారు.
తాను అధికారంలోకి వచ్చిన నేటి వరకు స్వతంత్రంగా ఉన్నారు. కానీ సచిన్ , సిందియాలు బలమైన నేతలే కానీ ఏపీలో జగన్ తో ఉన్నంత వారి వెనక శ్రేణులు కానీ నేతలుగాని లేరు. ఈ విషయంలో అసలు పోలికే లేదు. ముఖ్యంగా వారు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరారు. అక్కడితో వారి చరిస్మా ముగిసింది. ఎటువంటి పరిస్థితులలోను జగన్ ఏపీలో సృష్టించిన రాజకీయ పరిస్థితిని సచిన్ , సిందియా లు అక్కడ సృష్టించలేరు.
-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి