ఈ స్టేట్ మెంట్ ను పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇందులో వెటకారమే దాగి ఉంది. పైగా ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు, బాబు పక్కలో బల్లెంలా మారిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అవును.. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ పుంజుకుంటుందా లేక బలహీనపడుతుందా అనే అంశం చంద్రబాబు వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుందంటున్నారు జేసీ.
బాబు వ్యవహారశైలితో విసుగుచెందిన చాలామంది నేతలు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారని, చంద్రబాబు ప్రవర్తన ఇలానే కొనసాగితే.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరింత బలపడుతుందంటూ విశ్లేషించారు జేసీ. సో.. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఎదగాలా వద్దా అనేది పూర్తిగా చంద్రబాబు వ్యవహారశైలిపైనే ఆధారపడి ఉందంటూ సెటైర్ వేశారు.
తన పంచ్ లతో చంద్రబాబుతో ఓ ఆట ఆడుకుంటున్న జేసీ, తను మాత్రం పార్టీ మారనంటున్నారు. బీజేపీలోకి వెళ్లనంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్థన్ రెడ్డి తనకు మంచి స్నేహితులని వాళ్లకు హాయ్ చెప్పడానికి వచ్చానంటున్నారు. పలకరిస్తే పార్టీలో చేరినట్టు ఎలా అవుతుందని రివర్స్ లో మీడియాను ప్రశ్నించారు. అంటే బాబుపై మరిన్ని సెటైర్లు సిద్ధంగా ఉన్నాయన్నమాట.
మొన్నటికిమొన్న జగన్ వందరోజుల పాలనను మెచ్చుకుంటూ, పరోక్షంగా బాబుపై పంచ్ లు కురిపించిన జేసీ.. ఇప్పుడు బీజేపీ యాంగిల్ లో బాబుపై మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు. మొత్తమ్మీద జేసీ వ్యవహారశైలి చూస్తుంటే మాత్రం రేపోమాపో ఆయన కాషాయం కండువా కప్పుకోవడం ఖాయం అనిపిస్తోంది.