ఈ బుద్ధి అప్పుడేమైంది పవన్ కల్యాణ్!

అంతా ఊహించినట్టే జరిగింది. జగన్ పాలనపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారని విశ్లేషకులు ఊహించారో సరిగ్గా అలానే స్పందించారు పవన్. ఓ సగటు టీడీపీ కార్యకర్తలా, ఆంధ్రజ్యోతి పత్రికలా, రామోజీరావు అడుగుజాడల్లో నడిచే వ్యక్తిలా…

అంతా ఊహించినట్టే జరిగింది. జగన్ పాలనపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారని విశ్లేషకులు ఊహించారో సరిగ్గా అలానే స్పందించారు పవన్. ఓ సగటు టీడీపీ కార్యకర్తలా, ఆంధ్రజ్యోతి పత్రికలా, రామోజీరావు అడుగుజాడల్లో నడిచే వ్యక్తిలా మాత్రమే పవన్ కనిపించారనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. జగన్ పై విమర్శలు చేస్తూ ఈరోజు పవన్ మాట్లాడిన మాటలు, వాడిన భాష చూస్తుంటే.. చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావు ప్రభావం జనసేనానిపై ఏ స్థాయిలో పడిందో అర్థమౌతోంది. ఇంకా చెప్పాలంటే పవన్ స్క్రిప్ట్ మొత్తం వీళ్ల ముగ్గురి కనుసన్నల్లోనే తయారైనట్టుంది.

ఈమాత్రం విమర్శలు చేయడానికి జగన్ కు పవన్ ఇన్ని రోజులు టైమ్ ఇవ్వనక్కర్లేదు. తను కూడా ఇన్ని రోజులు ఎదురుచూడనక్కర్లేదు. చంద్రబాబు, లోకేష్ లా ఎప్పుడుపడితే అప్పుడు ఈ కామెంట్స్ చేయొచ్చు. ఏమాత్రం పసలేకుండా ఉన్నాయి పవన్ విమర్శలు. మరీ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఇసుక రీచ్ కెళ్లి కలరింగ్ ఇచ్చారు పవన్. ఈరోజు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి కొంతమంది బాధితులతో సమావేశం పెట్టుకున్నారు. పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే పవన్ ముందస్తు ఏర్పాట్లు ఇలానే ఉంటాయి మరి.

ఇప్పుడే కాదు, మొదట్నుంచి పవన్ ది ఇదే వ్యవహారశైలి. ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఓ వారం రోజులు హడావుడి చేయడం, తర్వాత చేతులు దులిపేయడం పవన్ కు బట్టర్ తో పెట్టిన విద్య. ఇవన్నీ పక్కనపెడితే.. ఇప్పుడు జగన్ వంద రోజుల పాలనపై ఇంత యాగీ చేస్తున్న పవన్, గతంలో చంద్రబాబు ఐదేళ్లు పాలించినప్పుడు ఏం చేశారో ఒక్కసారి చూద్దాం. గతంలో చంద్రబాబుకు కూడా ఇలానే టైమ్ ఇచ్చారు పవన్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న జనసేనాని, ఏడాది పాటు వేచి చూస్తామని, అప్పుడు చంద్రబాబు చేసిన తప్పులపై ప్రశ్నిస్తామని గొప్పలు చెప్పారు. కట్ చేస్తే, చంద్రబాబు చేసిన ప్రతి తప్పును కప్పిపుచ్చడానికి మాత్రమే ముందుకొచ్చారు.

రాజధాని కోసం భూముల్ని రైతుల నుంచి లాక్కుంటే ఉద్యమం చేయాల్సింది పోయి, రైతుల మధ్య కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడి వచ్చేశారు. తర్వాత చంద్రబాబుతో ఏదో చర్చించినట్టు ఫొటోలకు పోజులిచ్చారు. అప్పుడు రైతుల భూముల్ని బాబు లాక్కుంటున్నప్పుడు లేవని నోరు, ఇప్పుడు రాజధానిని జగన్ అభివృద్ధి చేయడం లేదంటూ అంతెత్తున లేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఓవైపు ముఖ్యమంత్రి జగన్ కమిటీ వేసినప్పటికీ అది పవన్ కు పట్టదు.

ఉద్దానం విషయంలో కూడా అదే జరిగింది. కిడ్నీ బాధితులను నేనొక్కడ్నే ఆదుకుంటా అనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు రోడ్ షోలు చేశారు. ఆంధ్రాయూనివర్సిటీలో నిపుణులతో చర్చించారు. కట్ చేస్తే మళ్లీ చంద్రబాబుతో ఫొటోలు. 2-3 వాటర్ ప్లాంట్స్ మినహా అక్కడేం జరగలేదు. ఇప్పుడు జగన్ 600 కోట్ల రూపాయలతో సమగ్ర మంచినీటి వ్యవస్థను తీసుకొస్తుంటే మాత్రం అది తన కృషి అని చెప్పుకుంటున్నారు పవన్. బాబు ఉన్నప్పుడు ఉద్దానం విషయంలో ఏమీ సాధించలేకపోయిన పవన్, జగన్ చేస్తున్న పనులకు మాత్రం తనదే క్రెడిట్ అని చెప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్.

ఇక కీలకమైన మూడో అంశం పోలవరం. టీడీపీతో కాపురం చేసినన్ని రోజులు పవన్ కు పోలవరం గుర్తుకురాలేదు. ఎప్పుడైతే చంద్రబాబుకు విడాకులిచ్చారో అప్పుడు వెంటనే పోలవరం గుర్తుకొచ్చింది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పోలవరం అంశం కేంద్రంగా బాబుపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో తండ్రికొడుకులు బాబు-లోకేష్, కోటానుకోట్లు మెక్కేశారంటూ స్వయంగా పవన్ చేసిన విమర్శలు యూట్యూబ్ లో కొడితే ఇప్పుడు కూడా ప్రత్యక్షమౌతాయి. అందుకే జగన్ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చారు. ప్రాజెక్టు టెండర్లన్నీ పునఃసమీక్షిస్తున్నారు.

పోలవరంలో కుంభకోణం జరిగిందని బలంగా నమ్ముతున్న పవన్, జగన్ చేపడుతున్న నష్టనివారణ చర్యల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పనులు జాప్యం అవుతున్నాయంటూ ఎందుకు బీద అరుపులు అరుస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ డొంకతిరుగుడు మాటలు, దొంగ విమర్శలు ఇవాళ్టి ప్రెస్ మీట్లో కోకొల్లలున్నాయి. ఇలాంటివి చూస్తున్నప్పుడే పవన్, బాబుతో కుమ్మక్కయ్యారనే విషయం మరింత గట్టిగా నిర్థారణ అవుతుంటుంది.

పవర్ స్టార్ కు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్యాకేజీ స్టార్ అనే ముద్ర బలంగా పడిపోయింది. ఇలాంటి విమర్శలు చూస్తున్నప్పుడు ప్యాకేజీ స్టార్ అనే పదం మనసులో మెదిలితే అది ఏపీ ప్రజల తప్పు కాదు, కచ్చితంగా పవన్ తప్పే.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?