కరోనా వైరస్ మహమ్మారి కంటే ఎల్లో మీడియా తప్పుడు రాతలు ప్రమాదకరమని మొదటి నుంచీ బలమైన అభిప్రాయం ఉంది. గత మార్చి చివరి వారం నుంచి ప్రధాని మోడీ లాక్డౌన్ విధించిన విషం తెలిసిందే. ఏపీ సర్కార్‌ను ఎలాగైనా భ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దానికి కొమ్ముకాసే ఎల్లో మీడియా కరోనా వైరస్‌ను మించి సమాజానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు.
తాజాగా తన తప్పుడు వార్తలను తానే ఖండించుకొంది. అది కూడా దళితులపై జగన్ సర్కార్ కక్ష పూరిత, వివక్షతో వ్యవహ రిస్తోందనే విద్వేషాన్ని వెదజల్లే వార్తా వంటకం తయారీలో పొరపాటునో, గ్రహపాటునో ఓ నిజాన్ని చెప్పాల్సి వచ్చింది. ఆ నిజం ఇంత కాలం కరోనాపై రాస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తుండడం గమనార్హం.
‘అసలు టార్గెట్ పీవీ రమేశ్!’ శీర్షికతో ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనంలో దళిత అధికారిని తొలగించ డానికే సబ్జెక్టుల తొలగింపు డ్రామా? అంటూ సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసింది. పీవీ రమేశ్ సంగతి కాసేపు పక్కన పెడితే….వివిధ సందర్భాల్లో కరోనా విషయంలో జగన్ సర్కార్‌పై ఆంధ్రజ్యోతి దాడి ఎలా జరిగిందో పరిశీలిద్దాం.
మే 3వ తేదీన ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘జగన్…కరోనా…కోరస్!’ శీర్షికతో కొత్త పలుకు వ్యాసాన్ని ఆ పత్రిక ఎండీ ఆర్కే రాశాడు. ఆ వ్యాసంలో ఆయన కలం నుంచి ఆణిముత్యాలు వెలువడ్డాయి. అవి ఎంతగా మెరిసిపోతున్నాయో చూద్దామా!
‘ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా కరోనా వైరస్‌ను అరికట్టలేకపోతున్నాం. ఆ వైరస్ మనతోనే ఉంటుంది. కలిసి జీవించాల్సిందే! మామూలు జ్వరంలాంటి కరోనా గురించి ఎక్కువగా భయపడవద్దు. మందులు వేసుకుంటే అదే తగ్గిపోతుంది’.. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన!’
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శల పాలయ్యాయి. కరోనా మామూలు జ్వరంలాం టిదేనని జగన్ అండ్ కో ఇప్పటికీ వాదిస్తే మనం నోరు మూసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోజుకు 60 నుంచి 80 మంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఆంధ్రాలో కరోనా ఎక్కువ ఉన్నందున వ్యాపార అవసరాలు, వైద్య అవసరాలకు పక్కనే ఉన్న కర్నూలుకు ఎట్టి పరిస్థితులలోనూ వెళ్లవద్దని తెలంగాణలోని పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. సరిహద్దుల్లో గోడల నిర్మాణానికి తమిళనాడు అధికారులు పూనుకున్నారు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి పొరుగు రాష్ట్రాలవారు ఏమనుకుంటున్నారో అర్థంకావడం లేదా?’
‘బతికి ఉంటే బలుసాకు తినవచ్చు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమస్య ఉత్పన్నమైనప్పుడు దాని తీవ్రతను గుర్తించకపోతే జరిగే నష్టం ఏమిటో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి’
‘ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను కట్టడి చేయడం ఎలా? అని తలలు పట్టుకుంటూ ఉంటే, జగన్ అండ్ కో మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. తమపై విమర్శలు చేసినవారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. అరెస్టులు చేయిస్తున్నారు’…ఆర్కే రాతలు ఎంత దారుణంగా ఉన్నాయో చూశారా? యజమానే తప్పుడు రాతలు రాస్తుంటే…ఇక వేతన జీవులైన స్టాఫ్ రిపోర్టర్లు, లైన్ అకౌంట్‌పై ఆధారపడే విలేకరుల రాతల గురించి ఏం మాట్లాడుతాం?
అంతెందుకు మచ్చుకు గత రెండు మూడు రోజుల వార్తలను తీసుకుందాం. ఈ నెల 11న ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ‘కరోనా బీభత్సం’ శీర్షికతో కథనం. దాని ఉప శీర్షికలు… ‘కేసుల్లో రాష్ట్రం పరుగు…మరో వారంలో జాతీయస్థాయిలో ఐదో స్థానానికి; భవిష్యత్‌లో రోజుకు రెండు వేల కోసులు’ ఈ నెల 12న ‘సీమ విలవిల’ శీర్షికతో మరో బ్యానర్ స్టోరీ. దీని ఉప శీర్షిక అనంత, చిత్తూరు జిల్లాల్లో ఒకేరోజు 300కు పైగా కేసులు. ఈ రోజు పేపర్లో రోజుకో రికార్డ్ శీర్షికతో ఇండికేషన్. దీని ఉప శీర్షిక రాష్ట్రంలో కొత్త కేసులు 1933, మరణాలు 19 అని రాసుకొచ్చారు.
ఇదే ఆంధ్రజ్యోతి ఈ రోజు పీవీ రమేశ్‌ను అడ్డుపెట్టుకుని దళితులను రెచ్చగొట్టాలని కలలు కంటూ ఓ కథనాన్ని వండింది. ఆ కథనంలో పీవీ రమేశ్ గొప్పతనాన్ని రాసుకొచ్చారు. పనిలో పనిగా కరోనా నియంత్రణలో పీవీ రమేశ్ పాత్ర ఏంటో ఘనంగా రాసుకొచ్చారు. ఇంతకూ ఏం రాశారంటే…
‘కరోనా నియంత్రణలో ఆయన పాత్రే ముఖ్య కారణమని అంటున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్వహణకు సంబంధించి జాతీ య మీడియాలో పీవీ రమేశ్ చాలా పాపులర్ అయ్యారు. ఇక్కడ వైరస్ నియంత్రణకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తక్షణమే ట్విటర్లో షేర్ చేసుకునేవారు. చాలా సార్లు ఆయన ట్వీట్లకు ప్రశంసలు దక్కాయి. ‘మీరు ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉండాల్సిన వారు’ అని జాతీయ మీడియా నుంచి ప్రశంసలు లభించాయి. జగన్ సర్కారుకు దక్కాల్సి న ప్రశంసలు దళిత సామాజిక వర్గానికి చెందిన అధికారికి దక్కడం కూడా శాఖల తొలగింపునకు ఓ కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు’
ఇంతకూ ఆంధ్రజ్యోతి ఏం చెప్పదలచుకున్నదేమిటి? ఏపీలో కరోనా నియంత్రణలో ఉందనే కదా? అయితే ఆ నియంత్రణ గొప్పతనం అంతా పీవీ రమేశ్‌దే అని కదా ఆంధ్రజ్యోతి అభిప్రాయం. పోనీ అదే నిజం అనుకుందాం. మరి ఆర్కే మొదలుకుని ప్రతి రోజూ కరోనాపై ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు రాతల కథేంటి? నిజానికి, ఆంధ్రజ్యోతికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత దూరమా?
ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా తమిళనాడులో అత్యధికంగా 15,66,917 పరీక్షలు చేయగా 1,34,226 కేసులు, మహారాష్ట్రలో 12,89,325 పరీక్షలు చేయగా 2,46,600 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 11,53,849 పరీక్షలు చేయగా 29,168 కేసులు, తెలంగాణలో 1,70,324 పరీక్షలు చేయగా 34,671 కేసులు బయటపడ్డాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా కేవలం 4,57,066 పరీక్షలు చేయగా 40,941 కేసులు బయటపడ్డాయి.
వాస్తవాలు ఇలా ఉంటే అబద్ధాలు రాస్తూ ఏపీలో విషాన్ని కుమ్మరించే రాతలు రాస్తూ తనను తాను దిగజార్చుకునే పని ఆంధ్రజ్యోతి చేస్తోంది. నిజం నిప్పులాంటిదంటారు. దాన్ని దాచితే దాగేది కాదు. నిజాలు వెలుగులోకి రావడానికి ఇప్పుడు అనేక మార్గాలు ఓపెన్ అయ్యాయి. కరోనా నియంత్రణలో ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుం టున్నాయి.
ఇంటింటికి కరోనా పరీక్షలు చేయించాలనే గొప్ప ఆశయంతో జగన్ మొబైల్ వాహనాలను రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. విపత్కర సమయంలోనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. జగన్‌లోని దూరదృష్టిని, పేద ప్రజల పట్ల నిబద్ధతను ఈ సమాజం గుర్తించింది. ఇది చాలు. సీఎం జగన్ ప్రత్యేకత ఏమంటే ఆయన మాటల మనిషి కాదు…చేతల మనిషి. ఆయన పని మాట్లాడుతుందే తప్ప…ఆయనెప్పుడూ నోరు తెరవరు. ఆయనపై అవాకులు చెవాకులు పేలిన వారంతా కాలగర్భంలో కలిసి పోయేలా చేయడం జగన్ రాజకీయ చతురత. ఆకాశంపై ఉమ్మేయాలనే ప్రయత్నం లాంటిదే జగన్‌పై ఎల్లో మీడియా దుష్ప్రచారం.
సొదుం