ఓటీటీ వచ్చేసింది.. సినిమాలను వెబ్ సైట్లలో విడుదల చేసేస్తూ ఉన్నారు.. ఒక అంతా ఓటీటీలదే రాజ్యం, థియేటర్ల మాఫియాకు చెక్ పడినట్టే.. సినిమా వాళ్లు కూడా ఈ విషయాన్ని గమనించాలి.. సినిమాలను థియేటర్ల కోసం కాకుండా, ఓటీటీల్లో విడుదల చేయడానికి తగ్గట్టుగా నిర్మించేయాలి… ఇవీ గత మూడు నెలలుగా గట్టిగా వినిపిస్తున్న అభిప్రాయాలు, విశ్లేషణలు.
కరోనా వైరస్- లాక్ డౌన్ నేపథ్యంలో ముందుగా మూతపడిన వాటిల్లో థియేటర్లు ఉన్నాయి. మార్చి 21 నాటి నుంచి దేశంలో లాక్ డౌన్ మొదలుకాగా.. అంతకు వారం నుంచినే దాదాపుగా నగరాల్లోని మాల్స్ క్లోజ్ అయ్యాయి. మాల్స్ క్లోజ్ కావడంతోనే థియేటర్లు కూడా దాదాపుగా మూత పడ్డాయి. మార్చి 21 నుంచి మాత్రం థియేటర్లు పూర్తిగా క్లోజ్. దాదాపు నాలుగో నెల గడిచిపోతోంది. థియేటర్ల తలుపులు తెరుచుకోవడం లేదు.
ఒకవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్లకు ఇప్పుడప్పుడే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. లాక్ డౌన్ మినహాయింపులు మొదలు కాగానే..థియేటర్ల ఓపెనింగ్ పై కూడా ఆశలు కలిగాయి. అయితే భారత దేశంలో అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ పోతోంది. దీంతో థియేటర్లు తెరవడానికి ఇప్పుడప్పుడే అవకాశం లభించేలా లేదు.
ఈ మధ్యనే పీవీఆర్ సినిమాస్ వాళ్లు ఒక వీడియో విడుదల చేశారు. థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం అనుమతిని ఇస్తే.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోయేదీ, సోషల్ డిస్టెన్సింగ్ ఏ విధంగా పాటించేది వివరిస్తూ ఒక వీడియోను రూపొందించి విడుదల చేశారు. డిజిటల్ బుకింగ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్సే ఎక్కువగా జరుగుతాయని.. టికెట్ కౌంటర్ వద్ద ఎవరైనా కొనడానికి వచ్చినా.. భౌతిక దూరం పాటించేలా చర్యలు ఉంటాయని, అలాగే ప్రతి షో తర్వాత థియేటర్ ను పూర్తిగా శానిటైజ్ చేయడం జరుగుతుందని, బాత్ రూమ్ ల శానిటైజేషన్ తప్పనిసరిగా జరుగుతుందని, అలాగే థియేటర్లో అందించే ఫుడ్ విషయంలో కూడా కరోనా పరిస్థితులకు అనుగుణంగా శుద్ధి చేసిన ఆహారమే ప్రేక్షకులకు అందుతుందని.. ఆ వీడియోలో పేర్కొన్నారు.
థర్మల్ స్క్రీనింగ్ చేయడం ద్వారా సింప్టమ్స్ ఉన్న ప్రేక్షకులను లోపలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉండవని కూడా ఆ థియేటర్ల యాజమాన్య సంస్థ పేర్కొంది. ఆ వీడియో చూస్తే.. కరోనా వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలూ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అయితే.. ఈ పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి వెళ్లడానికి ఎంతమంది రెడీగా ఉంటారనేది మాత్రం సందేహమే.
ఈ అంశం గురించినే ఒక సంస్థ ఒక సర్వే ఒకటి చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో, థియేటర్ల విషయంలో కొనసాగుతున్న లాక్ డౌన్ తో తాము లోటును ఫీలవుతున్నట్టుగా మెజారిటీ మంది చెప్పారట. ఎంత శాతమంటే.. 81 శాతం మంది తాము థియేటర్లలో సినిమాలను చూడటాన్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇండియాలో డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు క్రేజ్ అనేక రెట్లు పెరిగింది. అంతవరకూ ఏ అమెజాన్ కో పరిమితం అయిన వాళ్లు.. లాక్ డౌన్ మొదలయ్యాకా నెట్ ఫ్లిక్స్ తో సహా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ మీద దృష్టి సారించారు. వాటికి సబ్ స్క్రైబ్ చేసుకుని అక్కడ సినిమాలు చూడటాన్ని దాదాపు దినచర్యగా మార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 81 శాతం మంది థియేటర్లలో సినిమాను మిస్ అవుతున్నట్టుగానే చెప్పారంటే.. ప్రజలకు థియేటర్ల మీద మక్కువ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది.
థియేటర్లలో జరిగేది దోపిడీనే!!
థియేటర్లలో జరిగేది దోపిడీ అని వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి ఫుడ్ కోర్టుల్లో అయితే మరీ అన్యాయం. ఆహార పదార్థాల వాస్తవ విలువకు వాటి ధరను అనేక రెట్లు పెంచి తప్పనిసరిగా అవే కొనాలనే పరిస్థితులను కల్పిస్తున్నారు. బయటి ఫుడ్ కు అనుమతి లేదంటూ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆఖరికి ఏ ఆఫీసుకో అని వెళ్లి లంచ్ బాక్స్ బ్యాగ్ లో ఉంచుకుని, అటు నుంచి అటే మాల్స్ లోని థియేటర్లకు వెళితే, ఆ బాక్స్ ను కూడా లోపలకు తీసుకెళ్లనివ్వనంత స్థాయిలో వారి మాఫియా నడుస్తుంది. అవన్నీ గాక ఇంటర్నెట్ హ్యాండలింగ్ ఫీజులంటూ ఇంకో దోపిడీ. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే.. ఇంటర్నెట్ హ్యాండలింగ్ ఫీజంటూ ప్రతి టికెట్ మీద ఇరవై ముప్పై రూపాయల వరకూ అకారణంగా తీసుకుంటున్నారు!
ఏముంది వారు చేసే ఇంటర్నెట్ హ్యాండలింగ్? అన్ని రకాల టికెట్ లూ ఆన్ లైన్లో ఉచితంగా కొనవచ్చు. ఆ పై ఆఫర్లు కూడా ఇస్తారు. ఆన్ లైన్లో ఏది బుక్ చేసినా ఫ్రీ హోం డెలివరీల కాలం ఇది. ఇలాంటి సమయంలో కూడా కేవలం టికెట్ బుక్ చేసుకున్నందుకు ప్రతి యూజర్ కూడా పదుల రూపాయల కప్పాన్ని బుకింగ్ సైట్ల వారికి కడుతున్నారు! ఒకేసారి మూడు టికెట్లు బుక్ చేస్తే,.. ప్రతి టికెట్ కూ ఇంటర్నెట్ హ్యాండలింగ్ ఫీజు అదనం! ఇదంతా జస్ట్ దోపిడీ.
జనాల బలహీనతను అవకాశంగా మలుచుకుని చేస్తున్న దోపిడీ. బస్ టికెట్ బుక్ చేసుకుంటే.. ఆఫర్లు, థియేటర్లో టికెట్ బుక్ చేసుకుంటే ఇరవై ముప్పై రూపాయల అదనపు ఫీజు! ఇలా థియేటర్ల యాజమాన్యాల దోపిడీ సాగుతూ ఉంది. ప్రభుత్వాలూ వీటిని పట్టించుకోవు. థియేటర్ వద్దకు ముందే చేరుకుని క్యూలో నిలబడి టికెట్ కొనుక్కోవడం కన్నా, ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే టెన్షన్ ఉండదులే అనే భావనతో ప్రేక్షకులూ ఆ ఆన్ లైన్ అదనపు భారం విషయంలో ఫీల్ కావడం లేదు. దీంతో ఆ దోపిడీ ఎంచక్కా సాగుతూ ఉంది.
అయినా థియేటర్..థియేటరే!
థియేటర్ లో సినిమా చూడటం విషయంలో ఆ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా జనాల మొగ్గు మాత్రం థియేటర్ వైపే ఉంది. ఇప్పటికిప్పుడు కరోనా పరిస్థితులు సద్దుమణిగితే, కొత్త కేసులు తగ్గిపోయి, ఉన్న కేసులు క్లియర్ అయిపోతే.. ప్రజలు హ్యాపీగా థియేటర్ వైపుకు వెళ్తారు. ఇప్పటికే వచ్చిన థియేటర్ విరహాన్నంతా తీర్చుకునేలా అక్కడే మకాం పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్థాయిలో థియేటర్ మనిషిని కట్టి పడేసింది. సిల్వర్ స్క్రీన్ పై సినిమా చూడటంలో ఉన్న మజా మనిషికి అనునిత్యం జరిగే అకారణ దోపిడీని కూడా సహించే స్థితికి తీసుకు వచ్చింది.
నెట్ ఫ్లిక్సింగ్ ఇండియాలో సాధ్యమేనా?
నెట్ ఫ్లిక్సింగ్.. అమెరికా వంటి దేశంలో సినిమాల వీక్షణకు ప్రత్యామ్నాయంగా మారిన పదం ఇది. నెట్ ఫ్లిక్స్ కు పుట్టినిల్లు, విపరీత స్థాయి ఆదరణ ఉన్న దేశం అమెరికానే. ఇప్పటికే ఇండియాలో కూడా ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్ ను ఇచ్చేలా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ తగిన ఏర్పాట్లు చేశాయి. టీవీకి కనెక్ట్ చేసుకుని పెద్ద తెరపై యాప్స్ లోని సినిమాలను చూసే ఏర్పాట్లూ చేశాయి. అయినా.. భారతీయుల మనసు థియేటర్ల వైపే మొగ్గు చూపుతూ ఉంది.
ఇంతకీ జూలై సినిమాల పరిస్థితి ఏమిటి?
మార్చి నెల లో లాక్ డౌన్ ప్రారంభం అయ్యాకా కూడా కొన్ని సినిమాల విషయంలో డేట్లను ప్రకటించారు. అప్పటికి లాక్ డౌన్ ఎన్నాళ్లు? అనే స్పష్టత లేకపోయినా.. జూన్ – జూలై ల సమయానికి పరిస్థితులు చక్కబడతాయని, ఆ సమయంలో సినిమాలు కూడా విడుదల అవుతాయని కొందరు సినిమా వాళ్లు అంచనాలు వేశారు. జూలైలో సినిమాల విడుదల అంటూ కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు తేదీలను కూడా ప్రకటించాయి. అయితే.. జూలై రానే వచ్చింది.
జూలై నెల ఆఖర్లో తమ సినిమాలను విడుదల చేసుకోవచ్చని ఆయా సినిమాల వాళ్లు భావించారు. పెండింగ్ షూటింగులను పూర్తి చేసుకోవచ్చని కూడా అంచనాలు వేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఆ మేరకు కూడా లేదు. జూలైలో కాదు, సమర్థవంతమైన వ్యాక్సిన్ వచ్చే వరకూ లేదా యూరప్ దేశాల్లోలా ఇండియాలో కూడా కరోనా దానంతట అది పూర్తి తగ్గుముఖం పట్టే వరకూ సినిమాల విడుదల, థియేటర్ల తలుపులు తెరవడం ఉండదేమో! అంత వరకూ ప్రేక్షకులకు విరహం తప్పకపోవచ్చు!