కేసీఆర్ తిట్టాడ‌ని…బ్లాక్ మెయిల్ క‌థ‌నం!

త‌న‌ను కుల‌, గుల ప‌త్రిక అని తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్ట‌డంతో పచ్చ ప‌త్రిక తెగ బాధ‌ప‌డిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఆ పత్రిక వెంట‌నే బ్లాక్ మెయిల్ క‌థ‌నాన్ని వండివార్చ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. “గులాబి తోట‌లో…

త‌న‌ను కుల‌, గుల ప‌త్రిక అని తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్ట‌డంతో పచ్చ ప‌త్రిక తెగ బాధ‌ప‌డిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఆ పత్రిక వెంట‌నే బ్లాక్ మెయిల్ క‌థ‌నాన్ని వండివార్చ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. “గులాబి తోట‌లో క‌మ‌లం” శీర్షిక‌తో త‌న మార్క్ బ్లాక్ మెయిల్ క‌థ‌నాన్ని చ‌క్క‌గా వండి, బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య లోపాయికారి ఒప్పందం వుంద‌ని జ‌నాన్ని న‌మ్మించి, త‌ద్వారా కాంగ్రెస్‌కు రాజ‌కీయంగా మేలు క‌లిగించే ప్ర‌య‌త్నాన్ని చూడొచ్చు.

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయమ‌నే పేరుతో కేసీఆర్ ఏకంగా త‌న పార్టీ పేరును కూడా మార్చిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మార‌డం వెనుక బీజేపీని ఎదుర్కోవ‌డానికి అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ‌లో త‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని నిలువ‌రించ‌డానికి కేసీఆర్ వ్యూహ ర‌చ‌న చేశారు. ఈ క్ర‌మంలో క‌ర్నాట‌క ఎన్నిక ఫ‌లితాలు కాంగ్రెస్‌కు అనుకూల వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చాయి.

దీంతో తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు కాంగ్రెసే ప్ర‌త్యామ్నాయ‌మ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రోవైపు చంద్ర‌బాబు ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే, రేవంత్‌రెడ్డి సీఎం అయితే, చంద్ర‌బాబే ఉన్న‌ట్టుగా ఎల్లో మీడియా భావిస్తోంది. మ‌రోవైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో కేసీఆర్ త‌న‌య క‌విత‌ను అరెస్ట్ చేయ‌కపోవ‌డం రాజ‌కీయంగా బీజేపీకి న‌ష్టం తెచ్చింది. దీంతో తెలంగాణ‌లో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే ద‌మ్ము ఒక్క కాంగ్రెస్‌కే ఉంద‌ని, ఆ పార్టీని ప్రోత్స‌హిస్తే భ‌విష్య‌త్‌లో ల‌బ్ధి పొందొచ్చ‌ని ప‌చ్చ ప‌త్రిక తెగ ఉబ‌లాట‌ప‌డుతోంది.

ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం కుల‌, గుల ప‌త్రిక అంటూ కేసీఆర్ అవ‌మానించ‌డాన్ని ప‌చ్చ ప‌త్రిక జీర్ణించుకోలేక‌పోతోంది. ఆ వెంట‌నే బీజేపీ, బీఆర్ఎస్‌కు లోపాయికారి సంబంధం వుంద‌ని న‌మ్మించేందుకు క‌థ‌నం రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రానున్న ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు పూర్తి మెజార్టీ స్థానాలు ద‌క్క‌క‌పోతే, బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింద‌ని తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయ‌ని రాయ‌డం ఆ ప‌త్రిక‌కే చెల్లింది.

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్‌ను తొల‌గించ‌డంతో బీఆర్ఎస్‌తో ఆ పార్టీతో అవ‌గాహ‌న కుదిరింద‌నే అనుమాన బీజాల్ని మ‌రోసారి నాటేందుకు అక్ష‌రాల‌ను చ‌ల్లింది. తాజాగా క‌మ్యూనిస్టుల‌తో బీఆర్ఎస్‌కు పొత్తు కుద‌ర‌క‌పోవడానికి బీజేపీనే కార‌ణ‌మ‌ని రాసుకొచ్చారు.

“జాతీయ స్థాయిలో లెఫ్ట్‌ పార్టీలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉండడంతో.. వారితో కలిసి వెళ్తే బీజేపీ నుంచి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే కమ్యూనిస్టులకు కేసీఆర్‌ దూరం జరిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి” అని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు క‌లిసే ఉన్నాయ‌న్న సంగ‌తిని విస్మ‌రించడం గ‌మ‌నార్హం.

మ‌రీ ముఖ్యంగా బీజేపీకి బీఆర్‌ఎస్‌ దగ్గరవుతోందనడానికి కేసీఆర్‌తో చినజీయర్‌ స్వామి స్నేహం మ‌ళ్లీ చిగురిస్తోంద‌ని రాయ‌డం విశేషం. ఇలా అనేక ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని, బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య సంబంధాలున్నాయ‌ని న‌మ్మించేందుకు ప‌చ్చ ప‌త్రిక క‌థ‌నం సాగింది. ఇదంతా రెండు రోజుల క్రితం కేసీఆర్ తిట్ల ఎఫెక్టే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

త‌మ‌కు ఇష్ట‌మైన పార్టీల‌పై పాఠ‌కులు న‌వ్విపోతార‌ని అనుకోకుండా ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌శంస‌లు కురిపిస్తూ క‌థ‌నాలు వండి వార్చుతారు. లేదంటే పాతాళానికి తొక్కేస్తూ ఇష్టానుసారం వ్య‌తిరేక క‌థ‌నాలు అల్ల‌డం అల‌వాటైంది. లోకేశ్ పాద‌యాత్ర గురించి ఆ ప‌త్రిక క‌థ‌నాలు చ‌దివితే… అమ్మో ఎన్టీఆర్‌కు కూడా ఈ స్థాయి ఆద‌ర‌ణ లేదేమో అనే ఆలోచ‌న క‌లుగుతుంది. అట్లుంట‌ది మ‌రి. న‌చ్చితే నెత్తి మీద‌, లేదంటే కాళ్ల కింద పెట్టుకునేలా అక్ష‌రం ల‌య‌ త‌ప్పుతోంది.