దీనికి ముందు మణిపూర్‌లో ప్రభుత్వ వైఫల్యం వ్యాసం చదవగోర్తాను.
మోదీ, అమిత్‌ల నిరాసక్తత – మణిపూర్ ఘర్షణల్లో ఏ జాతి తీవ్రవాదులది తప్పున్నా, మధ్యలో సామాన్యులు నలిగారు కదా! వారిని రక్షింపలేక పోవడం రాష్ట్రప్రభుత్వ వైఫల్యమే కదా! కానీ అమిత్ షాకు అలా అనిపించలేదు. పార్లమెంటులో మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రిని మార్చకపోతే ఏం? చీఫ్ సెక్రటరీని మార్చాం, డిజిపిని మార్చాం, సెక్యూరిటీ ఎడ్వయిజర్‌ను మార్చాం. ముఖ్యమంత్రి సహకరించకపోతే మార్చాల్సి వచ్చేది, కానీ సహకరిస్తూంటే ఎందుకు మారుస్తాం?’ అన్నారు. సహకరించడం మాత్రం చాలదు కదా, సామర్థ్యం చూపాలి కదా. అమిత్ తన ప్రసంగంలో తను మణిపూరులో 3 రోజులున్నానని, సహాయమంత్రి 23 రోజులు ఉన్నారని చెప్పారు. మంచిదే, కానీ ఫలితం కనబడటం లేదు కదా! ఇవాళ్టి పేపర్లో వచ్చింది. కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ (కోటూ) అనే కుకీ సంస్థ ఒకటి సోమవారం నుంచి నేషనల్ హైవే 2ను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.
మణిపూరు అసెంబ్లీలో మార్చిలో సమావేశమైంది. ఆరునెలల్లోగా అంటే సెప్టెంబరు 2లోగా మళ్లీ సమావేశం కావాలి. ఆగస్టు 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం చేయడానికి అనుమతి యివ్వండి అని మణిపూరు కాబినెట్ ఆగస్టు 4న గవర్నరుకి సిఫార్సు చేసింది. కానీ ఇప్పటివరకు గవర్నరు అనుమతి యివ్వలేదు. కేంద్రం ప్లానేమిటో తెలియదు. ఇదే కాదు, మణిపూరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విషయంలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మురళీధరన్ అత్యంత వివాదాస్పదమైన తీర్పులిచ్చి గిరిజనుల విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. సుప్రీం కోర్టు కొలీజియం దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌ను ఆ పదవికి సిఫార్సు చేసింది. కేంద్రం వెంటనే ఆ పని చేయకుండా, మణిపూరు ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపి, మీరు ఒప్పుకుంటేనే వేస్తాం అంటోంది. ఇది అసాధారణం. మురళీధరన్ తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నపుడు బీరేన్ ఆయన్ని మార్చమని ఎందుకంటాడు?
గోధ్రా రోజులు – గుజరాత్‌లో హిందువులు కాంగ్రెసు, బిజెపి రెండిటిని ఆదరిస్తూ వచ్చారు, ఒక్కోసారి ఒక్కోరిని గెలిపిస్తూ వచ్చారు. ఒక దశలో గుజరాత్ బిజెపి అవినీతిలో, అంతఃకలహాల్లో పూర్తిగా మునిగిపోయి బలహీనపడి పోయి, ప్రజాదరణ కోల్పోయింది. ఆ సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా పంపబడ్డాడు. అప్పుడే గోధ్రా అల్లర్లు జరిగాయి. రైలు బోగీ దగ్ధం కావడం ప్రణాళికతో జరిగిందా లేక అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిందా అనే దానిపై భిన్నాభిప్రాయా లున్నాయి కానీ ఆ తర్వాత జరిగిన హిందూ-ముస్లిము ఘర్షణలలో ప్రభుత్వం పూర్తిగా హిందువుల పక్షం వహించిందనే దానిలో ఎవరికీ సందేహం లేదు. అల్లర్లను నివారించ గలిగిన స్థితిలో ఉండి కూడా నివారించకుండా ఉదాసీనత వహించింది అనే ఉద్దేశంలోనే అప్పటి ప్రధాని వాజపేయి ‘రాజధర్మం నిర్వర్తించబడలేదు’ అని తన ముఖ్యమంత్రిపై వ్యాఖ్యానించారు. ఆడ్వాణీ అడ్డుపడకపోయి ఉంటే, వాజపేయి మోదీని తప్పించి ఉండేవారనే అభిప్రాయం యిప్పటికీ బలంగా ఉంది.
అప్పటి ప్రధాని అభిప్రాయం ఎలా ఉన్నా, గుజరాతీ హిందువులలో అధిక సంఖ్యాకుల దృష్టిలో మాత్రం మోదీ హిందువుల పరిరక్షకుడిగా అవతరించారు. ముస్లిములను ఎక్కడుంచాలో అక్కడ ఉంచారని (జనాభాలో దాదాపు 10శాతం ఉన్నా ముస్లిములకు ప్రస్తుత అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు) మెచ్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన 20 ఏళ్లగా బిజెపియే మళ్లీమళ్లీ గెలుస్తోంది. మోదీ, ఆయన వారసులే గుజరాత్‌ను ఏలుతున్నారు. మోదీ ప్రధాని అయిపోయి, యీ భావజాలాన్ని దేశాన్నంతా వ్యాప్తి చేస్తూ అనేక రాష్ట్రాలలో విజయాలు సాధిస్తున్నారు ఇప్పుడు బీరేన్ కూడా మోదీ బాటలోనే పూర్తిగా మైతేయీల పక్షం వహించి, వాళ్ల దృష్టిలో రక్షకుడిగా స్థిరపడిపోదామని ప్రయత్నిస్తున్నారు. మైతేయీలు యిప్పటివరకు కేవలం బిజెపి పక్షాన మాత్రమే లేరు. కాంగ్రెసుకు కూడా ఓటేస్తూ వచ్చారు. ఇకపై తనకే గంపగుత్తగా ఓటేస్తారని బీరేన్ ఆశ కావచ్చు. మైతేయీ, కుకీలలో యిరుపక్షాలదీ తప్పు ఉంది. కానీ యిద్దరి కంటె పెద్ద తప్పు ప్రభుత్వానిది. అది అల్లర్లను నియంత్రించడంలో విఫలమైంది.
ఏ రాష్ట్రంలోనైనా సరే కాస్త అల్లర్లు జరగ్గానే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, కేంద్రం ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ప్రతిపక్షం నుంచి డిమాండ్లు వస్తాయి. అధికారపక్షం నుంచి కనీసం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా వేరేవార్ని పెట్టాలి అనే డిమాండు వస్తుంది. మూడు నెలలైనా రాష్ట్రాన్ని అదుపులోకి తీసుకు రాలేక పోయిన బీరేన్ స్థానంలో బిజెపి అధిష్టానం మరొకర్నయినా కూర్చోపెట్టి ఉంటే సబబుగా ఉండేది. ఎందుకంటే బీరేన్‌పై కుకీలకు పూర్తిగా నమ్మకం పోయింది. అయినా మోదీ, అమిత్ షా బీరేన్‌ను వెనకేసుకుని వస్తున్నారు. ఎందుకంటే అతన్ని మారిస్తే గోధ్రా విషయంలో కూడా యిదే జరగాల్సింది అనే మాట వస్తుంది. ప్రతి చిన్న విషయంపై ‘మన్ కీ బాత్’ వినిపించే మోదీ, మణిపూరు అల్లర్లు ప్రారంభమయ్యాక సంభవించిన గుజరాత్ తుపాను గురించి, టర్కీ భూకంపం గురించి సంతాపం వెలిబుచ్చిన మోదీ, యీ విషయంపై చాలాకాలం పాటు పెదవి విప్పలేదు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో వచ్చిన ప్రతిపక్ష బృందానికి కాదు కదా, తన పార్టీ ఎమ్మెల్యేల బృందాన్ని కూడా ఎపాయింట్‌మెంట్ యివ్వలేదు.
మోదీ నోరు విప్పకపోవడంతో మణిపూరుపై మోదీ మాట్లాడాలి అంటూ ప్రతిపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలు స్తంభింపచేశాయి. అమిత్ షా తను మాట్లాడతానని అన్నా అవి ఊరుకోలేదు. మోదీయే కావాలి అని పట్టుబట్టాయి. నా దృష్టిలో యిద్దరిదీ తప్పే. మోదీ చెప్పినా, అమిత్ చెప్పినా విషయం ఒకటే చెప్తారు. ఆ మాటకొస్తే యుపిఏ అధికారంలో ఉన్నా ‘విదేశీశక్తుల, విద్రోహకారుల కుట్ర యిది, పరిస్థితిని అదుపులోకి తెస్తున్నాం, పూర్తి దృష్టి సారించాం, ప్రస్తుతం ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదు, సమస్యను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం శోచనీయం..’ యిదే ధోరణిలో ఉంటుంది జవాబు. ఈ భాగ్యానికి కేంద్ర హోం మంత్రి పనికిరాడు, ప్రధానే చెప్పాలి అని మంకుపట్టు పట్టడం, పార్లమెంటు సమయాన్ని వృథా చేయడమే! ప్రతిపక్షానికి చేతనైతే ఆందోళనలు చేయాలి.
పార్లమెంటు ఎగ్గొడితే బెదిరే రకం కాదు మోదీ! చివరకు పార్లమెంటులో మాట్లాడినది టూ లిటిల్ అండ్ టూ లేట్! అమిత్ భాయ్ చాల చక్కగా మాట్లాడారంటూ మెచ్చుకున్నారు. అమిత్ ఏమన్నారు? మణిపూరులో నెహ్రూ కాలం నుంచి అల్లర్లు జరుగుతున్నాయి, యిదేమీ కొత్త కాదన్నారు. మయన్మార్ కుకీల వల్లనే ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతానికి చెందిన ఎంపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు లోర్హో అనే అతను ఆగస్టు 12న ప్రెస్‌తో మాట్లాడుతూ తను పార్లమెంటులో మాట్లాడుదా మనుకున్నానని, కానీ మౌనంగా ఉండమని సంకేతాలు వచ్చాయని చెప్పాడు. తనే కాదు, మణిపూరు నుంచి ఉన్న మరో ఎంపి, బిజెపి వాడే అయినా అతనికీ అటువంటి సలహాయే వచ్చిందని అన్నాడు.
మోదీ దృష్టిలో మణిపూరుకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షాలకు అర్థం కాలేదేమో కానీ దేశప్రజలకు మాత్రం బాగానే అర్థమైంది. అల్లర్లు ప్రారంభమైన 79 రోజుల తర్వాత నోరు విప్పి, వీడియో ద్వారా బయటకు వచ్చిన మే 4 సంఘటన ఒక్కదానిపై మాట్లాడుతూ దీనిపై చర్యలు ఉంటాయి అన్నారు. అంటూనే రాజస్థాన్ అయినా, ఛత్తీస్‌గఢ్ అయినా (ఈ రెండూ కాంగ్రెసు పాలిత రాష్ట్రాలు) మహిళలపై అకృత్యాలు సహించేది లేదన్నారు. వాటిలో జరిగిన చెదురుమదురు సంఘటనలతో కలగలిపి దీన్ని సమానస్థాయిలో దీన్ని ప్రస్తావించినప్పుడే ఆయన ధోరణి అర్థమై ఉండాలి. ఆయనకు విదేశాలకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ, సొంత దేశంలో అట్టుడుకుతున్న రాష్ట్రానికి వెళ్లి బాధితులను పరామర్శించడానికి టైముండదు. మే3న అల్లర్లు ప్రారంభమైతే కేంద్ర హోం మంత్రికి కూడా మే నెలాఖరు దాకా వెళ్లడానికి కుదరలేదు. వెళ్లి ఏం చేసి వచ్చాడో ఏమో ఆ తర్వాత కూడా అల్లర్లు ఆగలేదు. సుప్రీం కోర్టుకి ఒళ్లు మండిపోయి, మీరు ఏమైనా చేస్తారా? మమ్మల్ని చేయమంటారా? అని జులై 20న అడగవలసి వచ్చింది.
ఈ ప్రభుత్వాలకు వచ్చినదేమిట్రా అంటే సమాచారం ప్రసారం కానీయకుండా యింటర్నెట్ ఆపేయడం. దీనివలన ఆందోళనకారుల మాట ఎలా ఉన్నా, ప్రభుత్వానికి కూడా తన రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. ఎమర్జన్సీ టైములో మీడియాపై ఆంక్షలు విధించడం వలన, ఎమర్జన్సీ అత్యాచారాల గురించి ఇందిరా గాంధీకి సరైన సమాచారం లభించకుండా పోయింది. చుట్టూ భజనపరులు ఏం చెపితే అదే నమ్మింది. ఎమర్జన్సీ పాలనను ప్రజలు హర్షిస్తున్నారని వాళ్లు చెపితే ఎన్నికలు పెట్టి, దాన్ని ఎన్‌క్యాష్ చేసుకుందామని చూసింది. తీరా చూస్తే ఉత్తరాదిన కాంగ్రెసు మొత్తం ఊడ్చుకుపోయింది. ఇప్పుడు యింటర్నెట్ నిషేధించి మణిపూరు ప్రభుత్వం బావుకున్నదేదీ లేదు. కోర్టులు చివాట్లు వేయగా ఎట్టకేలకు పునరుద్ధరించారు. పునరుద్ధరించగానే అల్లర్లలో ఎంత బీభత్సం జరిగిందో బయటి ప్రపంచానికి తెలిసి నిర్ఘాంతపోయారు.
బీరేన్ మరో మోదీ కాగలరా?- మణిపూరులో బీరేన్ అమలు చేసిన ‘విభజించి పాలించు’ అనే పాలసీ ద్వారా మైతేయీలను ఆకట్టుకుని రాజకీయ లబ్ధిని పొందినా అది ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. గుజరాత్ విషయానికి వస్తే గోధ్రా తర్వాత 20 ఏళ్లగా బిజెపి అధికారంలో కొనసాగిన మాట నిజమే కానీ హిందువులందరూ బిజెపికి గంపగుత్తగా ఓటేయటం లేదు. అల్లర్లు జరిగిన కొద్ది నెలలకే, పాప్యులారిటీని ఎన్‌క్యాష్ చేసుకోవాలని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బిజెపికి, 2002 డిసెంబరులో మొత్తం 182 స్థానాలలో గతంలో కంటె 12 సీట్లు ఎక్కువగా 127 వచ్చాయి. 2007 వచ్చేసరికి 117కు, 2012 వచ్చేసరికి 115కు, 2017 వచ్చేసరికి 97కు తగ్గుతూ వచ్చాయి. 2022లో ప్రతిపక్ష కాంగ్రెసు పూర్తిగా చచ్చుబడి పోవడంతో, 13శాతం ఓట్లతో ఆప్ ప్రతిపక్ష ఓటును చీల్చడంతో 157 తెచ్చుకోగలిగింది.
నిజానికి మైతేయీలు మే, జూన్‌లలో బీరేన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకీలు పూర్తిగా అణచివేసి, తమ ఆస్తిపాస్తులు కాపాడలేక పోయాడని, అతను రాజీనామా చేయాలని అనసాగారు. దీనితో విసిగిపోయిన అతను జూన్ నెలాఖరులో తన సెక్రటరీని పిలిచి, రాజీనామా లేఖ తయారు చేయి, గవర్నరుకి యిచ్చేస్తా’ అన్నాడట. వార్త రాష్ట్ర బిజెపి ఆఫీసుకి చేరగానే వెంటనే వాళ్లు సామాజిక సంస్థలను ప్రేరేపించి బీరేన్ యింటి ముందు ప్రదర్శనలు చేసి, అతన్ని రాజ్‌భవన్‌కు వెళ్లకుండా నిరోధించ మన్నారట. మైతేయీలకు కూడా ‘బీరేన్‌ను తీసేస్తే వచ్చేది రాష్ట్రపతి పాలనే. అంటే సైన్యమే ఎల్లెడలా రాజ్యం చేస్తుంది. వాళ్లు ‘మైయిరా పైబీస్’ పేర ఆందోళనలో ముందువరుసలో ఉన్న మైతేయీ మహిళలను కూడా వదలరు జాగ్రత్త’ అని హెచ్చరించారట. అమిత్ షా కూడా రంగంలోకి వచ్చి నువ్వు రిజైన్ చేయవద్దు అని బీరేన్‌కు చెప్పాడట. ఇదంతా రాబిన్ బెనర్జీ అనే అతను ‘‘ద వీక్’’ జులై 16 సంచికలో రాశాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండిపోవాలని నిశ్చయించుకున్నాక బీరేన్ అఫెన్సివ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ‘శాంతిభద్రతలు కాపాడడంలో విఫలమైన మీరెందుకు రిజైన్ చేయరు?’ అని అతన్ని ఒకతను ట్విటర్‌లో ప్రశ్నించగా యితను ‘మీది భారతదేశమా? మయన్మారా?’ అని అడిగాడు. తనను ప్రశ్నిస్తే దేశద్రోహి కిందే లెక్క అన్నమాట. బీరేన్ అధిపతిగా ఉండగా మణిపూరులో శాంతి నెలకొంటుందని నమ్మకం లేదు. కేంద్రమే పూనుకుని అఖిలపక్షం వారిని దింపాలి. ఇతర ఈశాన్య రాష్ట్రాల వారిని కూడా మధ్యవర్తులుగా పెడితే కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే, నెలల తరబడి ప్రాణభయంతో బతకాలని కోరుకోరు. సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మన స్థాయిలో చెప్పగలిగే విషయం కాదు.
కానీ యీ లోపున బీరేన్ తన పద్ధతులను మార్చుకోవలసిన అవసరం ఎంతైనా కనబడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా యిలాటి అల్లర్లు జరిగినప్పుడు నష్టపరిహారం ప్రకటించి, యిస్తూంటారు. అలాగే యిక్కడా మణిపూర్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ (ఎంవిసిఎస్) ప్రకటించారు. అయితే యిక్కడ మెలికేమి పెట్టారంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేవారికి యీ స్కీము వర్తించదు అన్నాడు. ఇలా ఏ రాష్ట్రమూ చేయదు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు నియమించినా మహిళా న్యాయమూర్తుల పానెల్ ఎత్తి చూపింది. ఇది అన్యాయమని, దీన్ని మార్చాలని సిఫార్సు చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వారితో ఏకీభవించారు. దీన్ని బట్టి చూస్తే బీరేన్ బాధితుల పట్ల ఎంత నిర్దయగా ఉన్నాడో అర్థమౌతుంది.
అల్లర్ల ప్రభావం – మణిపూరు ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మణిపూరులో అభద్రతాభావానికి లోనైన కుకీలు పొరుగున ఉన్న మిజోరాం, మేఘాలయలకు తరలిపోతున్నారు. ఆ రాష్ట్రాల రూపురేఖలు ఎలా మారతాయో తెలియదు. అంతేకాదు, దేశభద్రతనే ప్రమాదంలో పడవేసే పరిస్థితి మణిపూరులో నెలకొంది. చైనా వారి బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌కు సమాంతరంగా ఆసియన్ హైవే ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అది మయన్మార్, మణిపూరులను కలుపుతుంది. అయితే మణిపూరు సెక్షన్ ఆరంభమయ్యే ప్రాంతాలు కుకీల అధీనంలో ఉన్నాయి. వారు తలచుకుంటే మొత్తం సరఫరాలను ఆపేయగలరు. మయన్మార్ ప్రభుత్వం ఆర్థికంగా బలహీనంగా ఉండడంతో చైనా దానిపై తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. మణిపూరు త్వరగా చల్లబడకపోతే ఏమవుతుందో ఊహించడానికే భయం వేస్తుంది. ఎక్కడో చదివాను. మణిపూరు శాంతియుతంగా ఉంటే, దాని ద్వారా మన వస్తువులు ఆసియన్ హైవే ద్వారా ఎగుమతులు చేసి ఎంతో ఆర్జించవచ్చట. చైనా వస్తువుల కంటె మనవి నాణ్యత ఎక్కువ, ధర తక్కువట.
అంతర్జాతీయ ప్రభావం – చివరగా మణిపూరులో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటూ యూరోపియన్ పార్లమెంటు తీర్మానం చేసిన విషయం ప్రస్తావించి తీరాలి. బాధితులు ముస్లిములైతే యిది జరిగేది కాదు. క్రైస్తవులు కాబట్టే వాళ్లు జోక్యం చేసుకుంటున్నారు. మీరు గమనించండి. ప్రపంచంలో క్రైస్తవుల మాటే ఎప్పుడూ నెగ్గుతుంది. పొరుగువారిని ప్రేమించమని బైబిలు సూక్తులు చెప్పినా ఆచరణలో అది ఎప్పుడూ కనబడదు. జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం అన్నీ ఒకే చోట పుట్టాయి. క్రైస్తవులు యూదులను ఎప్పుడూ హీనంగానే చూశారు. ఇంగ్లీషు సాహిత్యం పరికిస్తే అది అర్థమౌతుంది. హిట్లర్ యూదులను మూకుమ్మడిగా హత్య చేయడంతో యిప్పుడు అయ్యోపాపం అంటున్నారు కానీ లేకపోతే ఎలా ఉండేదో తెలియదు.
ఇక ముస్లిములతో క్రైస్తవులు శతాబ్దుల పాటు మతయుద్ధాలు చేశారు. ఆధునిక యుగంలో కూడా ముస్లిం వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉంటారు. యూదుల ద్వారా ఇజ్రాయేలు చుట్టూ ఉన్న ముస్లిం దేశాలన్నిటిలో అగ్గి రగిలించి రెచ్చగొట్టారు. ముస్లిము దేశాలు తమలో తాము కలహించుకుంటూ ఉంటే ఎవరో ఒకరి పక్షం వహించి, అవతలివాళ్లను అణుస్తారు. దేశం లోపల కూడా షియా, సున్నీలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటే ఒక వర్గం కొమ్ము కాసి, మరొకరిపై ఉసి కొల్పుతారు. అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత క్రైస్తవులు ప్రపంచంలోని ముస్లిము లందరిపై టెర్రరిస్టు ముద్ర కొట్టేశారు. ప్రతి ముస్లిములను అనుమాన దృక్కులతో చూసే రోజులు వచ్చేశాయి. ప్రపంచ జనాభాలో 24శాతం ముస్లిములే అయినప్పుడు యీ 180 కోట్ల మందీ టెర్రరిస్టులేనా? అదే నిజమైతే అయితే ప్రపంచం మన గలిగేదా?
భారతదేశంలో ముస్లిములపై దాడులు జరిగాయి అనే వార్తలు వచ్చినపుడు పెద్దగా పట్టించుకోని క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవుల మీద దాడులనగానే స్పందిస్తుంది. లేకపోతే యూరోపియన్ పార్లమెంటుకి మణిపూరుతో ఏం పని? ఇప్పటివరకు మోదీకి పాశ్చాత్యదేశాలలో ఆదరణ ఉండడానికి కారణం అల్లర్ల బాధితులు క్రైస్తవులు కాకపోవడమే! చెదురుమదురు సంఘటనలు వదిలేయండి. బాబ్రీ మసీదు కూల్చివేత లాటిది క్రైస్తవుల విషయంలో జరిగితే బ్రహ్మాండం బద్దలయ్యేది. ఇప్పటికే బాలకార్మికు లున్నారంటూ, మానవహక్కుల ఉల్లంఘన అంటూ కొన్ని వస్తువులు కొనడం మానేస్తున్నారు. ఇప్పుడు మణిపూరు ఘర్షణలు జాతుల మధ్య వైరంలా కాకుండా హిందూ-క్రైస్తవ ఘర్షణగా ప్రొజెక్టు అయితే మాత్రం భారత దేశానికి పాశ్చాత్య దేశాల మద్దతు తగ్గుతుంది. దాని కోసమైనా మణిపూరులో శాంతి నెలకొల్పడానికి భారత ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుకుందాం. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)