తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారనే పేరు వుంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది. దూషించుకోవడంలో తగ్గేదే లే అని ఇటు జేసి బ్రదర్, అటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అంటున్నారు. వీళ్లిద్దరి నోటి దురుసుతో రాజకీయాల్లో శబ్ద కాలుష్యం ఏర్పడిందని అనంతపురం జిల్లా ప్రజలు వాపోతున్నారు. టీడీపీ హయాంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌రెడ్డి నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, ఆయన తల్లి, ఇతర కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడారు.
అధికారం పోయిన తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి బతుకు జైలు పాలైంది. ఆ తర్వాత ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా అధికారాన్ని దక్కించుకున్నారు. తాజా రాజకీయ పరిణాలపై ప్రభాకర్‌రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేసి వార్తలకెక్కారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘ఆస్తులన్నీ పోయాయి. అన్నీ పీక్కున్నారు. పుట్టగొసి మాత్రమే ఉంది. 2+2 గన్ మెన్లను తొలగించి 1+1 పెడుతారా? చంపుతారా చంపండి. ఇప్పటికి 76 కేసులు నమోదయ్యాయి. మరొకటైతే 77కేసులు అవుతాయి. ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్. ఐపీస్‌లు అయ్యారు.. ఎందుకిలా అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల కోసం ఎస్పీలు పని చేస్తారా?’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వాహనాల రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌పై కేసులు నమోదు చేసి కడప జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఉన్న జేసీ బ్రదర్స్ రవాణా వ్యాపారం కుదేలైంది. దీంతో సీఎం వైఎస్ జగన్‌పై వారు మండిపడుతున్నారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ ఆయన హవా సాగడం లేదు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా అధికారులపై నోరు పారేసుకోవడం, బెదిరింపులకు దిగుతూ లొంగదీసుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నా వర్కౌట్ కావడం లేదు. జగన్ పాలనలో తన వ్యాపారం దెబ్బతినడంతో పుట్టగోసి మాత్రమే మిగిలిందని వాపోవడం ఆయన వంతైంది.