మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలంటే ఢిల్లీ వేదికగా ఉద్యమించిన తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత… ఇప్పుడు నిలదీతలకు గురి అవుతున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే చోటు దక్కింది. కవితేమో 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ మోదీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారని, ఇంట్లో తండ్రికి చెప్పడానికి మాత్రం ధైర్యం చాలలేదా? అని టార్గెట్ చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు పదునైన మాటల తూటాలతో రాజకీయంగా కవితపై ఫైరింగ్ చేస్తున్నారు. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో కవితపై విరుచుకుపడ్డారు. వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా ఎప్పట్లాగే కవితకు చురకలు అంటించారు.
33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ… ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు, రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలని చీవాట్లు పెట్టారు. 115 సీట్లలో 7 సీట్లు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా? అని షర్మిల నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్‌లో ప్రాధాన్యం దక్కలేదని ఆమె గుర్తు చేశారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కాకుండా మీ నాన్నతో మాట్లాడి కేబినెట్‌లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలని కవితను దెప్పి పొడిచారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కవిత రాష్ట్రంలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదని తండ్రిని ఎందుకు అడగట్లేదని డీకే అరుణ నిలదీశారు. లిక్కర్ కేసు దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వని తన తండ్రిని ప్రశ్నించకపోగా, మళ్లీ విపక్షాలను కవిత నిలదీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ మొదటి కేబినెట్‌లో మహిళలకు అసలు చోటే కల్పించని సంగతి తెలిసిందే. మొదటి నుంచి మహిళలకు బీఆర్ఎస్‌లో తక్కువ ప్రాధాన్యం వుంటూ వస్తోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.