గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దెబ్బకు టీడీపీ ముఖ్య నాయకుడు అటు వైపు తొంగి చూడలేదు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న చేదు అనుభవం ఉండడంతో బతికి వుంటే బలిసాకు తినైనా బతకొచ్చని ఆ ముఖ్య నాయకుడు గన్నవరం వైపు వెళ్లలేదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకూ ఆయనెవరంటే… సాధారణ నాయకుడు మాత్రం కాదు. తెలుగుదేశం పార్టీకి ఏకంగా జాతీయ అధికారి ప్రతినిధి. అతనే కొమ్మారెడ్డి పట్టాభిరామ్.
గన్నవరానికి, పట్టాభికి మంచి అనుబంధం వుంది. ఆ మధ్య “రేయ్ వంశీ…మీ ఊరొస్తా, రా తేల్చుకుందాం” అని సవాల్ విసిరి, అన్నంత పని చేశారాయన. గన్నవరం వెళ్లి వంశీ అంతు చూస్తాడని టీడీపీ శ్రేణులు ఎంతో ఆశగా ఎదురు చూడగా, చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా దెబ్బలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గన్నవరంలో చిచ్చు రేపడానికి పట్టాభినే కారణమని పోలీసులు అరెస్ట్ చేయడం, వారి చేతిలో దెబ్బలు తినడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
తాజాగా నారా లోకేశ్ గన్నవరం నియోజకవర్గంలో సాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన బుద్దా వెంకన్న , బొండా ఉమా, దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు వల్లభనేని వంశీ, కొడాలి నాని, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ప్రసంగించకపోవడం సభలో లోటుగా కనిపించింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన పట్టాభిరామ్ అసలు సభకే వెళ్లలేదనే చర్చ నడుస్తోంది.
గతంలో దెబ్బలు తిన్న చేదు అనుభవం ఆయన్ను వెంటాడుతుండడం వల్లే అటు వైపు తొంగిచూడలేదని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. లోకేశ్‌ను మెప్పించడానికి బహిరంగ సభపై ఏదో ఆవేశంలో మాట తూలుతారని, ఆ తర్వాత అసలు కథ మొదలవుతుందని కొందరు నాయకులు ఆఫ్ ది రికార్డుగా అనడం గమనార్హం. అయితే పట్టాభికి మించి కొందరు నేతలు బహిరంగ సభలో నోరు పారేసుకోవడం గమనార్హం.