తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులతో ఏపీ మంత్రి ఆర్కే రోజాకు మంచి సంబంధాలున్నాయి. గతంలో రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి, ఆమె ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. తాజాగా కేసీఆర్‌కు రోజా కోపం తెప్పించారా? అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై, కేసీఆర్ సర్కార్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదన్న రీతిలో…రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య వార్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో బద్ధ శత్రువుగా భావించే గవర్నర్ తమిళిసై వెంట ఆర్కే రోజా కనిపించడం గమనార్హం. సూపర్‌స్టార్ కృష్ణ మృతదేహానికి గవర్నర్ తమిళిసై ఇవాళ నివాళులర్పించారు. కృష్ణ తనయుడు మహేశ్‌బాబును గవర్నర్ ఓదార్చారు. గవర్నర్ వెంట మంత్రి ఆర్కే రోజా వుండడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలే తమిళిసై అంటే కేసీఆర్ సర్కార్ చాలా కోపంగా వుంది. కేసీఆర్ సర్కార్ తన ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఇటీవల గవర్నర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ఇటీవల విద్యాబిల్లుకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసేందుకు గవర్నర్ చెంతకు సంబంధితశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. గత కొన్ని నెలలుగా గమనిస్తే… కేసీఆర్ కేబినెట్ మంత్రిగా రాజ్‌భవన్‌లో అడుగు పెట్టిన ఘనత సబితకు దక్కింది.
తమిళిసైతో స్నేహంగా మెలిగే వారెవరైనా తమకు శత్రువు అన్నట్టు టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళిసైతో రోజా సన్నిహితంగా కనిపించడం తెలంగాణ అధికార పార్టీకి నొప్పి కలిగించే వ్యవహారమే. అయితే పద్మాలయ స్టూడియోకు గవర్నర్ ప్రత్యేక పరిస్థితిలో వెళ్లారు. అక్కడ గవర్నర్‌తో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన శత్రువుగా చూసే పరిస్థితి వుండదని రోజా అభిమానులు చెబుతున్న మాట. ఏమో రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడని అంటుంటారు. కేసీఆర్ కుటుంబంతో రోజాకు ఆత్మీయ సంబంధాలు ఉండడం వల్లే ఈ చర్చ. లేదంటే పట్టించుకునే వారెవరూ ఉండరు.