సూపర్‌స్టార్ కృష్ణ మృతి టాలీవుడ్‌ని తీవ్ర విషాదంలో నింపింది. కృష్ణను చివరి చూపు చూసేందుకు అభిమానులు, సినీ, రాజకీయ, పారిశ్రామిక తదితర రంగాల ముఖ్యులు పద్మాలయ స్టూడియోకు క్యూ కట్టారు. ప్రతి ఒక్కరూ కృష్ణతో తమ అనుబంధాన్ని మీడియాతో పంచుకోవడం విశేషం.
ఇవాళ పద్మాలయ స్టూడియోకు హీరో నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణిలతో కలిసి వెళ్లారు. కృష్ణ పార్థివ దేహానికి వారంతా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఆ తర్వాత మీడియాతో బాలయ్య మాట్లాడుతూ కృష్ణ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
కృష్ణను ఎప్పుడు కలిసినా తన తండ్రి దివంగత ఎన్టీఆర్ గురించే చెప్పేవారన్నారు. కృష్ణతో మాట్లాడే సందర్భంలో ఆయన గురించి తెలుసుకోవాలనే కుతూహలం తనలో వుండేదన్నారు. కానీ తన గురించి కాకుండా, ఎన్టీఆర్‌తో జ్ఞాపకాలను నెమరువేసుకునే వారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, కృష్ణకు మధ్య చాలా విషయాల్లో సారూప్యత ఉండేదన్నారు. నిర్మాతల విషయంలో చాలా ఔదార్యంతో ఇద్దరూ వ్యవహరించే వారన్నారు.
అవసరమైతే రెమ్యునరేషన్ కూడా కృష్ణ తగ్గించుకునేవారని చెప్పుకొచ్చారు. నిర్మాతల పాలిట కృష్ణ కల్పవృక్షమన్నారు. కొత్త దర్శకులు, నిర్మాతలను ఎన్టీఆర్, కృష్ణలే చిత్రపరిశ్రమకు పరిచయం చేశారన్నారు. నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా చూసుకోవడంలో ఎన్టీఆర్, కృష్ణలకు మాత్రమే ఘనత దక్కుతుందన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మన మధ్య లేరన్నది నమ్మలేని నిజం అని ఆయన అన్నారు.