ప‌వ‌న్‌పై టీడీపీ దాడి స్టార్ట్‌!

జ‌న‌సేన భ‌య‌ప‌డుతున్న‌ట్టే జ‌రుగుతోంది. టీడీపీకి అనుకూలంగా వుంటే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను నెత్తికెత్తుకుంటార‌ని, లేదంటే ద‌బీమ‌ని కింద‌ప‌డేస్తార‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో వుంది. వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు త‌మ‌కు రాజ‌కీయంగా లాభిస్తాయ‌ని టీడీపీ…

జ‌న‌సేన భ‌య‌ప‌డుతున్న‌ట్టే జ‌రుగుతోంది. టీడీపీకి అనుకూలంగా వుంటే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను నెత్తికెత్తుకుంటార‌ని, లేదంటే ద‌బీమ‌ని కింద‌ప‌డేస్తార‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో వుంది. వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు త‌మ‌కు రాజ‌కీయంగా లాభిస్తాయ‌ని టీడీపీ భావిస్తూ వ‌చ్చింది. పైగా వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌న‌ని, దానికి తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు.

ఈ మాట‌ల‌కు టీడీపీ త‌న కోణంలో విశ్లేషించుకుంది. పొత్తు పెట్టుకుంటామ‌నే ప‌రోక్ష సంకేతాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇచ్చార‌ని ఎల్లో మీడియా ప్ర‌చారం మొద‌లు పెట్టింది. చివ‌రికి విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, చంద్ర‌బాబు భేటీతో పొత్తు ఖ‌రారైందంటూ పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ప్ర‌చారం చేసింది. ఇందులో త‌ప్పేం లేదు. ఎవ‌రైనా అదే ప‌ని చేస్తారు. బీజేపీ అధిష్టానం త‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే ఆగ్ర‌హం, అస‌హ‌నంలో ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… చంద్ర‌బాబుతో క‌లిసి ప్ర‌యాణించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నేది నిజ‌మే.

అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌వ‌న్ అడుగులు ప‌డ్డాయి. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు విప‌క్షాల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని కూడా ప‌వ‌న్‌కల్యాణ్ టీడీపీ అధినేత స‌మ‌క్షంలో ప్ర‌క‌టించారు. ఇద్ద‌రూ రాజ‌కీయంగా క‌లిసి న‌డుస్తార‌నేందుకు ఇంత కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? అంతా అయిపోయింద‌ని అనుకుంటున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ భేటీ , అనంత‌ర ప‌రిణామాలు టీడీపీకి షాక్ ఇచ్చాయి.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌నివ్వ‌న‌నే మాట తూచ్ అని ప‌వ‌న్ త‌న చేష్ట‌ల‌తో ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు. జ‌న‌సేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై ఎల్లో మీడియా దాడి మొద‌లు పెట్టింది. రాజ‌కీయ విశ్లేష‌కుల‌తో ప‌వ‌న్‌పై దారుణ వ్యాఖ్య‌ల‌కు తెగ‌బ‌డ‌డం టీడీపీ నైజాన్ని బ‌య‌ట‌పెడుతోంది.

బీజేపీ, జ‌న‌సేన‌కు పెళ్లి అయ్యింద‌ని, కానీ ఇద్ద‌రూ క‌లిసి కాపురం చేయ‌లేదంటూ ఎల్లో మీడియాలో విమ‌ర్శ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. పెళ్ల‌యిన త‌ర్వాత భార్యాభార్త‌లిద్ద‌రూ త‌మ పుట్టింట్లోనే వేర్వేరుగా వుంటున్న‌గా బీజేపీతో ప‌వ‌న్ పొత్తు సాగుతోందంటూ “కుండ‌బ‌ద్ధ‌లు” కొట్టిన‌ట్టు జ‌న‌సేనానిపై తీవ్ర‌స్థాయిలో దాడికి దిగారు. టీడీపీతో క‌దా ప‌వ‌న్ క‌లిసి ప్ర‌యాణించాల్సింద‌ని వామ‌ప‌క్షాల నాయ‌కులు ప‌వ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చంద్ర‌బాబును కాద‌నుకుంటే, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌తంలో మాదిరిగా మ‌రోసారి ప‌వ‌న్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌నే హెచ్చ‌రిక‌లు ఇదే ఎల్లో చాన‌ళ్ల వేదిక‌గా వస్తున్నాయి.

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ జ‌త క‌ట్ట‌క‌పోతారా? అనే ఆశ వున్న నేప‌థ్యంలో ఈ మాత్రం విమ‌ర్శ‌ల‌తో స‌రిపెడుతున్నారు. కాదు, కూడ‌దు బీజేపీతోనే న‌డుస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్లారిటీ ఇస్తే మాత్రం ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ దాడి చేసేందుకు ఎల్లో మీడియా వెనుకాడ‌దు. ఇదంతా టీడీపీ ద‌ర్శ‌క‌త్వంలోనే సాగుతుందన‌డంలో సందేహం లేదు.