బ‌ట‌న్ నొక్క‌డమే…రెండో వైపు ప‌ట్టించుకోని జ‌గ‌న్‌!

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప‌, ఇత‌ర అంశాల్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు లేవు. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాలే త‌న‌ను మ‌రోసారి గ‌ట్టెక్కిస్తాయ‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ కార్య‌క‌ర్త‌ల…

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప‌, ఇత‌ర అంశాల్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు లేవు. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాలే త‌న‌ను మ‌రోసారి గ‌ట్టెక్కిస్తాయ‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న ప‌దేప‌దే బ‌ట‌న్ నొక్క‌డం గురించే చెబుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను 98 శాతం అమ‌లు చేశామ‌ని, అలాంట‌ప్పుడు జ‌నం ఎందుకు ఆద‌రించ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం విశేషం.

ఇదే సంద‌ర్భంలో త‌న పాల‌న‌లో రెండో కోణాన్ని ఆయ‌న చూడ‌డం లేదు. అందుకు ఆయ‌న ఇష్టంగా లేన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. త‌న పాలన‌లో ప్రాధాన్య అంశాలేవో జ‌గ‌న్‌కు బాగా తెలుసు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు మిన‌హాయించి, ఇత‌ర‌త్రా అభివృద్ధి కార్య‌క‌లాపాలేవీ పెద్ద‌గా సాగ‌డం లేద‌ని జ‌గ‌న్ తెలుసు. అందుకే వాటి గురించి మాట్లాడేందుకు జ‌గ‌న్ ఆస‌క్తి చూప‌రు.

విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న ఏమ‌న్నారంటే…

“క్యాలెండ‌ర్ ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాల కింద ల‌బ్ధిదారుల‌కు బ‌ట‌న్ నొక్కి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డం నా బాధ్య‌త‌. సంక్షేమ పాల‌న గురించి విస్తృతంగా జ‌నంలోకి తీసుకెళ్లి వారి ఆశీస్సుల‌ను తీసుకోవ‌డం కార్య‌క‌ర్త‌లుగా మీ బాధ్య‌త‌. మీరూ, నేను ఎవ‌రి ప‌ని వారు చేస్తే 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తీరుతాం. ఈ ఒక్క ఎన్నిక‌ల్లో గెలిస్తే… ఆ త‌ర్వాత  30 ఏళ్ల‌పాటు మ‌న‌మే అధికారంలో వుంటాం” అని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

జ‌గ‌న్ ఆలోచ‌న‌లు ఇలా వుంటే, ఆయ‌న పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల ఆవేద‌న మ‌రోలా వుంది. అనంత‌పురంలో గృహ‌నిర్మాణ‌శాఖ‌పై నిర్వ‌హించిన స‌మావేశంలో చోటు చేసుకున్న ఆస‌క్తిక‌ర ప‌రిణామం గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి. ఈ స‌మావేశానికి  గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి జోగి ర‌మేశ్ హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాట్లాడిన తీరును జ‌గ‌న్ గ‌మ‌నంలో పెట్టుకోవాలి. వారు ఏమ‌న్నారంటే…

“ఇసుక దొర‌క‌డంలేదు. దూరం నుంచి తెచ్చుకోవాలంటే ర‌వాణా ఖ‌ర్చు త‌డిసి మోపెడవుతోంది. అలాగే క‌ట్టుకున్న ఇళ్ల‌కు బిల్లులు చెల్లించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో ప‌క్కాగృహాల నిర్మాణాలు ఎలా పూర్తి అవుతాయ్” అంటూ మంత్రి జోగి ర‌మేశ్ ఎదుట ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ ఆవేద‌న‌, ఆక్రోశాన్ని ప్ర‌ద‌ర్శించారు. బ‌ట‌న్ నొక్క‌డం గురించి జ‌గ‌న్ గొప్ప‌లు చెప్పుకోవాల్సిందే. క్షేత్ర‌స్థాయిలో ఇత‌రేత‌ల విష‌యాలు జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త పెంచుతున్నాయి. దాన్ని త‌గ్గించుకోక‌పోతే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.

త‌న‌కే కాదు, బ‌ట‌న్ నొక్క‌డానికి ఐదేళ్ల‌కోసారి జ‌నానికి  ఓ అవ‌కాశం వుంటుంద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గుర్తెర‌గాలి. సొంత పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్న అసంతృప్తి గురించి ప‌ట్టించుకోవాలి. అదొక్క‌టి త‌ప్ప అన్న‌ట్టు జ‌గ‌న్ త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తే మాత్రం 16 నెల‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏం చేయాలో ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. 175కు 175 స్థానాల్లో విజ‌యం, 30 ఏళ్ల అధికారం… క‌ల‌గానే మిగిలిపోతాయి.