కోతికి పుండు వస్తే.. దాన్ని గీరి గీరి తనే పెద్దది చేసుకుని చివరకు అదే పెద్ద సమస్యగా మార్చుకుని చనిపోతుంది. టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పల్నాడులోని ఓ చిన్న గ్రామం ఆత్మకూరులో జరిగిన శాంతి భద్రతల సమస్యను రెండువర్గాల మధ్య విభేదాలుగా సృష్టించి, గుంటూరులో పునరావాస కేంద్రం అంటూ దాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి రాద్ధాంతం చేసింది. అసలు ఈ సమస్య కోసం ఇంత యాగీ చేయడం అవసరమా?
చంద్రబాబు మినహా టీడీపీ నేతలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. పల్నాడు సమస్యకి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామేమోనంటూ అధినేత దగ్గర మొర పెట్టుకుంటున్నారు. ఆ ప్రాంత నాయకుల్ని బైటకు రానీయకుండా.. మిగతా ప్రాంతాల నుంచి నేతల్ని తీసుకొచ్చి మరీ రాద్ధాంతం చేయాలని చూశారు. చివరకు ఏమైంది. అరెస్ట్ ల పాలై ఆగమాగం కావాల్సి వచ్చింది. పోనీ ఫలితం ఏదైనా దక్కిందా అంటే అదీలేదు. బాధితుల ముసుగులో ఉన్న పెయిడ్ ఆర్టిస్ట్ లందర్నీ ఆత్మకూరుకు తరలించేశారు పోలీసులు. గ్రామంలో పోలీస్ పికెట్ పెట్టారు, అక్కడ పరిస్థితి చక్కబడింది.
ఇక దీన్ని ఇంకా సాగతీయడం బాగోదని టీడీపీ నేతలే చెప్పడం విశేషం. అయితే చంద్రబాబు ఏమాత్రం తగ్గడంలేదు, ఆత్మకూరు బాధితులకు ఫోన్లో పరామర్శ, వారికి నిత్యావసరాలు పంపిణీ అంటూ మరిన్ని డ్రామాలకు తెరతీస్తున్నారు. ఇతర ప్రాంతనేతలు మాత్రం మాకెందుకీ తలనొప్పి అంటూ అధినేత దగ్గర వాపోతున్నారట. మరీ ఇన్ని రోజులుగా ఆత్మకూరు చుట్టూనే తిరగడం మంచిదికాదని, రాష్ట్రంలో మిగతా సమస్యలపై పోరాటం చేద్దామని, ప్రభుత్వ విధానాలని ఎండగడదామంటూ సమీక్షల్లో అధినేతకు సూచించారట.
కానీ చంద్రబాబు మాత్రం ఆత్మకూరు దగ్గరే ఆగిపోయారు. తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. అయితే బాబు అనుకుంటున్నట్టు అక్కడ తేల్చుకోడానికేం లేదు. ఊరి జనాల్లో ఎన్ని వర్గాలున్నా.. ఎప్పటికైనా ఒకటి కాకతప్పదు. అందుకే ఈ సమస్యని అటు ఆత్మకూరు ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. ఆత్మకూరు చుట్టూ ఎలా రాజకీయాలు చేయాలా అని జుట్టుపీక్కుంటున్నారు.