జ‌గ‌న్ ఆదేశించినా…డోంట్ కేర్‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించినా…అయితే ఏంటి? అనే రీతిలో టీటీడీ ఉన్న‌తాధికారులు లెక్క చేయ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో మ‌రోసారి టీటీడీ వివాదానికి నిల‌య‌మ‌వుతోంది. కేవ‌లం త‌మ‌కిష్టంలేని కార‌ణంగా టీటీడీ మాజీ ప్ర‌ధాన…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించినా…అయితే ఏంటి? అనే రీతిలో టీటీడీ ఉన్న‌తాధికారులు లెక్క చేయ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో మ‌రోసారి టీటీడీ వివాదానికి నిల‌య‌మ‌వుతోంది. కేవ‌లం త‌మ‌కిష్టంలేని కార‌ణంగా టీటీడీ మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితుల‌కు టీటీడీ ఉన్న‌తాధికారులు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా ర‌మ‌ణ‌దీక్షితుల ట్వీట్ మ‌రోసారి సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశించినా 20 మంది వంశ‌పారంప‌ర్య అర్చ కుల‌ను తిరిగి విధుల్లోకి తీసుకోలేద‌ని, నేటికీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాలనే టీటీడీ అధికారులు అమ‌లు చేస్తున్నార‌ని ర‌మ‌ణ‌దీక్షితులు ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ టీటీడీ ఈవో అశోక్‌సింఘాల్‌, మ‌రో అధికారి ధ‌ర్మారెడ్డి గురించే అని అంద‌రికీ తెలుసు. ర‌మ‌ణ‌దీక్షితులు చేసిన ట్వీట్‌లో చాలా వ‌ర‌కు వాస్త‌వం లేక‌పోలేదు.

గ‌త టీడీపీ పాల‌న‌లో 20 మందికి పైగా వంశ‌పారంప‌ర్య అర్చ‌కుల‌ను విధుల నుంచి తొల‌గించారు. ఇందులో భాగంగా ర‌మ‌ణ దీక్షితులు అర్ధాంత‌రంగా త‌న ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ర‌మ‌ణ‌దీక్షితులు తీవ్ర‌స్థాయిలో చంద్ర‌బాబు, టీటీడీపై విమ‌ర్శ‌లు గుప్పించి దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపిన విష‌యం తెలిసిందే. బాబు హ‌యాంలో నియమితులైన ఈవోనే నేటికీ కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

సీఎం జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త శ్ర‌ద్ధాస‌క్తుల‌తో ర‌మ‌ణ‌దీక్షితులు తిరిగి టీటీడీలో అడుగు పెట్టారు. అయితే సీఎం ఆదేశాలతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినా….ఆయ‌నంటే గిట్ట‌ని ఇద్ద‌రు  అధికారులు పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని స‌మాచారం. నిజానికి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ప్ర‌భుత్వాన్ని ర‌మ‌ణ‌దీక్షితుల విమ‌ర్శ‌లు భ్ర‌ష్టు ప‌ట్టించాయ‌ని చెప్పొచ్చు.

తిరుమ‌ల శ్రీ‌నివాసుని పింక్ డైమండ్ పోయింద‌ని ర‌మ‌ణ దీక్షితులు గ‌తంలో తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉంద‌ని, 24 గంట‌ల్లో వెతికితే ప‌ట్టుబ‌డుతుంద‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించి  సంచ‌ల‌నానికి ఆజ్యం పోశాడు. టీటీడీతో ర‌మ‌ణ‌దీక్షితులు త‌ల‌ప‌డుతున్న స‌మ‌యంలోనే నాటి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌న గోడు వెల్ల‌బోసుకున్నారు. ర‌మ‌ణ‌దీక్షితులంటే జ‌గ‌న్ మ‌నిషిగా ముద్ర ప‌డింది.

అయితే జ‌గ‌న్ సీఎం కాగానే ర‌మ‌ణ దీక్షితులు మ‌ళ్లీ ప్ర‌ధాన అర్చ‌కులుగా వ‌స్తార‌ని అంద‌రూ భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఏదో మొక్కుబ‌డిగా ర‌మ‌ణ‌దీక్షితుల‌కు ఆగ‌మ స‌ల‌హాదారుని ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. మ‌రోవైపు ఎప్పుడో రిటైర్డ్ అయిన డాల‌ర్ శేషాద్రికి స‌ద‌రు అధికారులు విశేష ప్రాధాన్యం ఇవ్వ‌డం ర‌మ‌ణ‌దీక్షితుల‌కు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టైంది.

ఇదే స‌మ‌యంలో ర‌మ‌ణ‌దీక్షితులు నాడు పింక్ డైమండ్ అదృశ్యంపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో నియ‌మితుడైన ఓ అధికారి ప‌నిగ‌ట్టుకుని ప‌లు చాన‌ళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో అస‌లు పింక్ డైమండ్ అనేదే లేద‌ని, శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల‌న్నీ సుర క్షితంగా ఉన్నాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. నాడు ఎన్నిక‌ల స‌మ‌యంలో పింక్ డైమండ్ అదృశ్యంపై జ‌గ‌న్ మొద‌లుకుని మిగిలిన వైసీపీ నాయ‌కులంతా చేసిన విమ‌ర్శ‌లు ఉత్తుత్తివేనా? ర‌మ‌ణ‌దీక్షితుల‌ను ప‌రోక్షంగా దెబ్బ‌తీసేందుకు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న అధికారులు….ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌స్తున్న విష‌యాన్ని ఎందుకు మ‌రిచిపోతున్నారో అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. త‌న‌ను మాన‌సికంగా వేధిస్తున్న అధికారుల‌కు ర‌మ‌ణ‌దీక్షితులు ప్ర‌స్తుతం ట్రైల‌ర్ మాత్ర‌మే చూపుతున్నార‌ని, మున్ముందు సినిమా చూపుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే అంతిమంగా జ‌గ‌న్ స‌ర్కార్ ఇరుకున ప‌డ‌క త‌ప్ప‌దు.

బాబుతో నేరుగా ఢీకొట్టిన ర‌మ‌ణ‌దీక్షితుల‌కు డాల‌ర్ శేషాద్రికి ఇచ్చిన విలువ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప రుస్తోంది. మ‌రోవైపు తాము అధికారంలోకి రాగానే టీడీపీ హ‌యాంలో తొల‌గించిన వంశ‌పారంప‌ర్య అర్చ‌కుల‌ను తీసుకుంటామ‌ని వైసీపీ హామీ ఇచ్చింది. మ‌రి ప్ర‌భుత్వం వ‌చ్చి ఏడాది పూర్త‌యినా ఇంత వ‌ర‌కూ వంశ‌పారంప‌ర్య అర్చ‌కుల‌ను నియ‌మించ‌క‌పోగా, హామీని ఎందుకు అమ‌లు చేయ‌డం లేదో జ‌వాబు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.  

జ‌గ‌న్ అఖండ ప్ర‌జాద‌ర‌ణ‌తో అధికారంలోకి వ‌స్తే…కొంద‌రు అధికారుల పుణ్య‌మా అని చెడ్డ‌పేరు వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా టీటీడీలో చంద్ర‌బాబు హ‌యాంలో నియ‌మితుడైన అధికారి కీల‌క స్థానంలో ఉండ‌డం, డిప్యుటేష‌న్‌పై వ‌చ్చిన మ‌రొకాయ‌న ఆడిండే ఆట‌. పాడిందే పాట‌గా సాగుతోంది. జ‌గ‌న్ అధికారంలోకి రావాల‌ని ప‌రిత‌పించిన వాళ్ల‌కు టీటీడీలో పోస్టులు, నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌క పోగా, బాబు హ‌యాంలో చ‌క్రం తిప్పిన వాళ్ల‌కే మ‌రోసారి పెద్ద పీట వేస్తున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం జిల్లాలో అట‌వీశాఖ‌లో ప‌నిచేసిన ఓ అధికారి టీడీపీ ఏజెంట్ అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఇదే అధికారి నేడు టీటీడీకి డిప్యుటేష‌న్‌పై అగ‌మేఘాల‌పై వ‌చ్చాడ‌ని స‌మాచారం. ఇక జ‌గ‌న్ గెలుపును కాంక్షించిన అధికారుల‌కు మాత్రం నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా పోస్టింగులు ద‌క్క‌క‌పోవ‌డంపై క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు. ఏడు కొండ‌ల వాడా…వెంక‌టేశ్వ‌రా ఈ అధికారుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో స్వామి అని వేడుకోవ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేమ‌ని వైసీపీ శ్రేణులు నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేస్తున్నాయి.

మామా కోడలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్