రిలీజ్ కు ముందు హీరోలంతా టెన్షన్ తో బిగుసుకుపోతుంటారు. మహేష్ లాంటి హీరోలైతే దేశం విడిచి వెళ్లిపోతుంటారు. ప్రభాస్ అయితే హిట్ టాక్ వస్తేనే నిద్రలేపమంటాడు. బన్నీ అయితే ఆ రోజంతా ఎవ్వరితో మాట్లాడడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా టెన్షన్ ను హ్యాండిల్ చేస్తారు. కానీ నాని మాత్రం ఆ టెన్షన్ ను కూడా ఎంజాయ్ చేస్తానంటున్నాడు.
“రిలీజ్ కు ముందు ఉండే టెన్షన్ ను ఎంజాయ్ చేస్తాను. అది మళ్లీ మళ్లీ రాదు. నాకు ప్రతి సినిమాకు ముందు ఎక్సయిట్ మెంట్ ఉంటుంది. విడుదలకు ముందు ఆ ఒకట్రెండు రోజులు ఉండే భయం-నమ్మకం-టెన్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టెన్షన్ లో ఓ ఎంజాయ్ మెంట్ ఉంటుంది. విడుదల రోజు సాయంత్రానికి ఆ కిక్ మళ్లీ ఉండదు. ఆ కిక్ కోసమే సినిమాలు చేస్తుంటాను.”
గ్యాంగ్ లీడర్ రిలీజ్ సందర్భంగా గ్రేట్ ఆంధ్రకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు నాని. దర్శకుడు శివ నిర్వాణ, తన తొలి హీరో నానిని ఇంటర్వ్యూ చేయడం విశేషం. అంతేకాదు.. శివ నిర్వాణ ఏ ఆఫీస్ నుంచి తన కెరీర్ స్టార్ట్ చేశాడో, అదే ఆఫీస్ లో నానిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు నాని.
“విక్రమ్ కుమార్ చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే రాస్తాడనే ఇమేజ్ ఉంది బయట. ఈ సినిమాకు సంబంధించి నేను కూడా ఒకచోట చదివాను, అదేంటంటే.. గ్యాంగ్ లీడర్ లో విలన్ నేనేనంట. కార్తికేయ ద్వారా తెలిసేది ఏంటంటే నేనే విలన్. నాది డబుల్ రోల్ అంట. విక్రమ్ కుమార్ కు ఉన్న ఇమేజ్ వల్ల ఆ పుకారు బయటకొచ్చింది. అందులో నిజం లేదు.”
విక్రమ్ కుమార్ తీసిన సినిమాల్లో చాలా తక్కువ కాంప్లికేషన్లు, ఫ్లాట్ నెరేషన్ ఉన్న సినిమా గ్యాంగ్ లీడర్ మాత్రమే అంటున్నాడు నాని. విక్రమ్ కుమార్ స్టయిల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇందులో కనిపించదంటున్నాడు. ట్రయిలర్ లో ఏం చూపించామో అదే కథ సినిమా మొత్తం నడుస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఈరోజు వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వచ్చింది గ్యాంగ్ లీడర్.