తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కేసులో బీజేపీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. అయితే బీజేపీ కోరుకుంటున్నట్టు సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణ కోరుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.
మునుగోడు ఉప ఎన్నిక ముంగిట టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగాయి. ఇందుకు సంబంధించి వీడియోలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ వీడియోలను దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులకు పంపినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముఖంగా వెల్లడించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని న్యాయ వ్యవస్థను ఆయన చేతులు జోడించి అభ్యర్థించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ విచారణకు నిరాకరించింది. అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారించాలని ఆదేశించింది. విచారణ పారదర్శకంగా వుండాలని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు వివరాలను మీడియాకు రాజకీయ నాయకులు వెల్లడించకూడదని హైకోర్టు ఆదేశించడం గమనార్హం.
హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితిలో బీజేపీ వ్యూహం ఎలా వుండబోతున్నదో అనే ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ నేతృత్వంలో దర్యాప్తు ఎలా వుండనుందో బీజేపీకి స్పష్టత వుంది. ఎలాగైనా బీజేపీని దోషిగా నిలబెట్టాలనే ఆలోచనలకు తగ్గట్టుగానే సిట్ నివేదిక ఇస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.