జ‌న‌సేన‌పై వైసీపీ వ్యూహం…మార్చాలా?

జ‌న‌సేన‌పై వైసీపీ వ్యూహం మార్చాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఎందుకంటే రాజ‌కీయాల్లో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వుండాలి. ఒకే ర‌కంగా వెళితే మాత్రం బొక్క బోర్లా ప‌డ‌క త‌ప్ప‌దు. ప్ర‌ధాని మోదీతో జ‌న‌సేనాని…

జ‌న‌సేన‌పై వైసీపీ వ్యూహం మార్చాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఎందుకంటే రాజ‌కీయాల్లో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వుండాలి. ఒకే ర‌కంగా వెళితే మాత్రం బొక్క బోర్లా ప‌డ‌క త‌ప్ప‌దు. ప్ర‌ధాని మోదీతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత ప‌వ‌న్ త‌న వ్యూహాన్ని మార్చుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్‌ న‌డ‌వ‌డిక కూడా అదే చెబుతోంది.

ఇంత కాలం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌న‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెప్పేవాళ్లు. దీంతో ప‌వ‌న్‌ను సులువుగా బుట్ట‌లో వేసుకున్నామ‌నే ఆనందం టీడీపీలో వుండేది. ఏదో మొక్కుబ‌డిగా అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయిస్తే స‌రిపోతుంద‌ని టీడీపీ ఆశించింది. అయితే జ‌న‌సేన వైఖ‌రి మారింద‌నే చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో టీడీపీ వ్యూహం ఎలా వుంటుంద‌నేది తెలియాల్సి వుంది.

ఇదే సంద‌ర్భంలో వైసీపీ కూడా జ‌న‌సేన విష‌యంలో వ్యూహం మార్చుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త వుంది. ఇంత కాలం టీడీపీతో జ‌న‌సేన జ‌త క‌డుతుంద‌నే ప్ర‌చారం, అందుకు త‌గ్గ‌ట్టు ప‌వ‌న్ పంథా ఉంటూ వ‌చ్చింది. వైసీపీ విమ‌ర్శ‌లకు విలువ వుండేది. అయితే బీజేపీతో మాత్ర‌మే క‌లిసి పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ తేల్చి చెప్పారు. వైసీపీతో పాటు టీడీపీని కూడా ఆయ‌న విమ‌ర్శించ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో వెంట‌నే ఓ అభిప్రాయానికి రావ‌డం తొంద‌ర‌పాటు అవుతుంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. జ‌న‌సేన నేత‌లు చెబుతున్న‌ట్టు… టీడీపీతో కాకుండా కేవ‌లం బీజేపీతోనే ప్ర‌యాణం సాగించే ఉద్దేశం వుంటే మాత్రం… వైసీపీ త‌న వ్యూహాన్ని మార్చుకోవాల్సి వుంటుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల‌కు త‌క్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం మంచిది.

ప‌వ‌న్ సంగ‌తి చూసుకోడానికి ఇత‌ర ప‌క్షాల‌కు వైసీపీ అవ‌కాశం ఇవ్వాలి. ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన నేత‌ల్ని త‌క్కువ టార్గెట్ చేస్తే… వైసీపీకి రాజ‌కీయంగా ల‌బ్ధి. ఈ విష‌య‌మై రానున్న రోజుల్లో వైసీపీ సీరియ‌స్‌గా ఆలోచించాల్సి వుంటుంది.