ఈమధ్య విశాఖ పర్యటనలో మోడీతో సమావేశం తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచనలు మారుతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. అటు బీజేపీతోగానీ ఇటు టీడీపీతోగానీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలన్నదే పవన్ ఆలోచనగా కనబడుతోంది. మోడీ విశాఖ పర్యటనకు ముందు టీడీపీతో పొత్తు ఉంటుందేమోనని సంకేతం ఇచ్చిన పవన్ ఇప్పుడు టీడీపీకి దూరంగా ఉన్నట్లు కనబడుతోంది. పొత్తులమీదగానే, ప్రభుత్వంపైగానీ కలిసి పోరాటం చేసే విషయంలో పవన్ అండ్ చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేయడంలేదు. పవన్ వైఖరి చూస్తుంటే గత ఎన్నికల సీన్ రిపీట్ చేస్తాడా అనే అనుమానం కలుగుతోంది. మొన్నటివరకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని గంభీర ప్రకటనలు చేసిన ఈయన ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారా అనిపిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటన తర్వాత ఒక్క చాన్స్ ఇవ్వమని పవన్ ప్రజల్ని కోరుతున్నారు. అన్ని చోట్లా అభ్యర్థుల్ని పెడతానని.. ఎవరైనా అడ్డుకుంటే సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నారు. నిన్నటిదాకా ఆయన ఓట్లు చీల్చబోనని అన్న ప్రకటనలకు.. ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు చాలా తేడా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ రూటు మార్చుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. మోదీ సమావేశం తర్వాత ఆయనకు ఏమైనా సందేశం వచ్చిందా లేకపోతే.. సమావేశంలో తమ మధ్య జరిగిన చర్చల్లో మోదీ చెప్పిన విషయంలో ఏదైనా కొత్తగా అర్థం అయిందా అనేదానిపై క్లారిటీ మాత్రం లేదు. విజయనగరం జిల్లా గుంకలాన్ గ్రామంలో జగనన్న ఇళ్లలో అవినీతిపై పోరాటానికి వెళ్లి ప్రసంగించిన సందర్భంలో పవన్ కల్యాణ్ ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు.
అంతే కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థిని పెడతా.. నామినేషన్ వేయనివ్వకపోతే ఏం చేయాలో తెలుసని అన్నారు. అన్ని చోట్లా పోటీ చేయబోతున్నామన్న సంకేతాలను పవన్ కల్యాణ్ పంపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటనపై పోరాటం వల్ల తనకు, జనసేనకు రాష్ట్ర వ్యాప్త మైలేజ్ వచ్చిందన్న అభిప్రాయం పవన్ కల్యాణ్‌లో ఉందని అంటున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసైన వైపు చూస్తారని, అవకాశం ఇస్తారని భావిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీ ప్రస్తావన కూడా తీసుకు రావడం లేదు. తానే సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పొత్తుల గురించి మాట్లాడటం లేదు.
గతంలో చంద్రబాబునాయుడు విశాఖ ఘటనపై సంఘిభావం తెలిపినప్పుడు వైసీపీ సర్కార్‌ను కూలదోయడం కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా కలిసి పోటీ చేయడంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు కానీ ఏపీ బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. వ్యూహం మార్చుకుంటున్నానని చెప్పడం ద్వారా పవన్ విధానంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇన్నేళ్లైనా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లేకపోతే.. వైసీపీ ఓటమి కోసం పని చేయాలా అన్నదానిపైనా క్లారిటీ లేదు . ప్రస్తుతం పొత్తులో ఉన్న బీజేపీతో అయినా కలిసి ఉండాలా లేదా అన్నదానిపైనా క్లారిటీ ఉన్నట్లుగా లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో జనసేనతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి జనసేన – వైసీపీ పొత్తు ఇంకా అధికారికంగా తెగిపోలేదు. అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కలిసి 2020 జనవరిలో అధికారికంగా పొత్తులను ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పవన్ పొత్తు పెట్టుకోవడం మంచిదేనంటూ వార్తలు వెలువడ్డాయి. ఏ సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపకదికన పొత్తు పెట్టుకున్నారో ప్రకటించలేదు. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకంగా విజయవాడ వంతెనపై ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడిగా ప్రకటించిన మొదటి కార్యక్రమం అదే.. చివరి కార్యక్రమం అదే. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ర్యాలీలో పాల్గొని, బహిరంగసభలో ప్రసంగించారు. ఆ తర్వాత ఎవరికివారుగా సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
బీజేపీ అధిష్టానం మొదటినుంచి చెబుతున్నదేమిటంటే.. ఎన్నికలు ఆరు నెలల సమయం ఉన్నప్పుడు పొత్తుల గురించి మాట్లాడవచ్చు.. ఇప్పుడే ఎందుకు? అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పై దూకుడుగా రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ కు బీజేపీతో స్నేహం పోరుబాటకు అడ్డం పడుతోందని జనసేన సైనికులు చెబుతున్నారు. తమ ముందరికాళ్లకు బీజేపీ పెద్దలు బంధం వేస్తున్నారని, కొంత వేచిచూసే ధోరణికి తమ నేత వచ్చాడని, తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. విశాఖ పర్యటనలోకానీ, ఇప్పటంలోకానీ, గుంకలాం పర్యటనలోకానీ బీజేపీ శ్రేణులెవరూ జనసేనకు మద్దతుగా రాలేదు. పొత్తున్నప్పటికీ చిత్రంగా బీజేపీ తనకేం సంబంధం లేనట్లు ఒంటరిగా కార్యక్రమాలు చేస్తుంటుంది.
ఇటీవల అమరావతి ప్రాంతంలో ఉండవల్లి నుంచి తుళ్లూరు వరకు నాలుగురోజుల పాదయాత్ర చేసిన బీజేపీ నాయకులు జనసేనను కలుపుకోలేదు. అధికార పార్టీతో పోరాటం చేసే క్రమంలో తమతో బీజేపీ ఏనాడూ కలిసిరాలేదని, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని కొనసాగడం అవసరమా? అని జనసేన శ్రేణులు పవన్ ను ప్రశ్నిస్తున్నాయి. పొత్తు విషయంలో పునరాలోచన చేయాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో పవన్ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేం.